Dec 25,2021 08:10
  • గుంటూరు జిల్లాలో జెండా ఆవిష్కరణ
  • 27 నుంచి మూడు రోజుల పాటు తాడేపల్లిలో మహాసభ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సిపిఎం 26వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిపిఎం జెండా ఆవిష్కరణ సభలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో కూడా నిర్వహించనున్నారు. గత 40 రోజులుగా గుంటూరు జిల్లాలో సదస్సులు, సెమినార్‌లు నిర్వహించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 40 వేల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంచి మహాసభ ప్రాధాన్యత వివరించారు. మైకు ప్రచారంతోపాటు వాల్‌ పోస్టర్ల, కరపత్రాల ఆవిష్కరణలు చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులు ఇస్తోన్న నృత్యరూపకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై వివరిస్తూ నృత్యరూపకాలను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రజలను ఆకర్షిస్తూ కళా బృందాలు తమ ప్రదర్శనలను కొనసాగిస్తున్నాయి . డెకరేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తోరణాలు, జెండాలు, అమరవీరుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టేందుకు జెండా ఆవిష్కరణ సభలు కూడా నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్రం మొత్తమ్మీద 480 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరు కానున్నారు. వీరికి వసతుల కల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ, తాడేపల్లిలోని వివిధ భవన సముదాయాల్లో వసతులను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ ఎంబి భవన్‌, బాలోత్సవ్‌ భవన్‌, తాడేపలి మండలం వడ్డేశ్వరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ప్రజా సంఘాల రాష్ట్ర కార్యాలయంలో వసతులు కల్పిస్తున్నారు. ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా పాశం రామారావు, కోశాధికారి జొన్నా శివశంకరరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జె.వి.రాఘవులు, గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, ఎం.రవి. ఎస్‌.చెంగయ్య, ఎన్‌.భావన్నారాయణ, ఈమని అప్పారావు, నళినీ కాంత్‌ తదితరులు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. ఈ నెల 27న మహాసభ ప్రారంభం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనసమీకరణ చేయనున్నట్లు ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. డెకరేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లి, మంగళగిరి పట్టణాలతో పాటు పరిసర గ్రామాలన్నింటిలో ఎర్ర జెండాలతో అలంకరణ చేపట్టారు. తొలి రోజు జరిగే బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాష్‌ కరత్‌, బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగిస్తారు.