ప్రజాశక్తి-హెల్త్ యూనివర్సిటీ: ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైనప్పుడు ప్రాణాపాయం నుండి కాపాడేందుకు సిపిఆర్ పద్ధతి ఎంతో దోడధపడుతుందని, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలోనూ కుంటుంబసభ్యులకు సిపిఆర్ పధ్ధతిపై అవగాహనా కల్పించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. గుండెపోటు నివారణా చర్యల్లో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటికి సిపిఆర్ కరపత్రాన్ని సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ గుండె పోటుకు గురైన వారిని కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రులలో చేర్పించాలనే ఆత్రుతతో ప్రధమ చికిత్స అందించకుండా సమయాన్ని వృధా చేయడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులకు సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వైద్యుల సూచనల మేరకు గుండె పోటుకు గురైన వారికి సిపిఆర్ పద్దతిని ద్వారా ప్రధమ చికిత్స అందిచినట్లైతే నూటికి 50 నుండి 80 మందికి గుండె శ్వాస తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రధమ చికిత్స అనంతరం గుండె పోటు వచ్చిన వారిని ఆసుపత్రిలో చేర్పించి మరింత మెరుగైన వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడటంతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దగలుగుతామన్నారు. రానున్న ఆరు మాసాల్లో కార్డియో పల్మనరీ రిసస్పిటేషన్ విధానంపై ఇంటింటికీ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా.జి.సమరం, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్‌కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్ పాల్గొన్నారు.










