పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దుని అధిష్టానం ఎంపిక చెయ్యడం ఆ పార్టీ వ్యవహారాలు తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించవు. అధికారం ఉన్న కాసిన్ని చోట్లలో పంజాబ్ ముఖ్యమైంది. ఆరు మాసాల్లో ఎన్నికలకు వెళ్లబోతోంది. అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్న అమరేందర్ సింగ్ కు మంచి పేరే ఉంది. రైతుల ఉద్యమ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం అకాలీదళ్, వారి పూర్వ మిత్రులు బీజేపీ ఇబ్బందికర స్థితిలోనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిగా సవాల్ చెయ్యగల బలం ఇంకా రాలేదు. ఇలాంటి అనుకూల వాతావరణంలో, మిగతా చోట్ల ఉనికి కోల్పోతున్న వేళ కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండాలి? తమ పట్టు సడలకుండా, బలం పెంచుకునేలా ఉండాలి! అందులో భాగంగా ప్రజాదరణ ఉన్న నాయకుడికి పగ్గాలు, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి! కానీ అక్కడ జరుగుతున్నది అందుకు విరుద్ధం. స్వంత పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని ధిక్కరిస్తూ సిద్దు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అటు పార్టీ శ్రేణులలో, ఇటు ప్రజల్లో పలుకుబడి లేదు. బీజేపీ నుండి వచ్చి, మధ్యలో ఆప్ వైపు చూసి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉంటూ అసమ్మతి రాగాలు వినిపిస్తున్న నేత. ఆయన్ని అధిష్టానం ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక చూడాలి. ఆట ఎలా సాగుతుందో? క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే కాంగ్రెస్ టీమ్‌కు ఇది ఆఖరి ఓవర్. స్వంత టీమ్ మెంబర్లనే స్లెడ్జింగ్ (శల్యుడిలా తిట్లు తిట్టడం) చేసే అలవాటున్న సిద్దుని బలవంతంగా తోడు పంపింది బోర్డు. ఆయన అలవాటుకొద్దీ తోటి ప్లేయర్ రన్ అవుట్ అయ్యేలా ఆడి మొత్తం పాడు చేస్తాడో, సిక్సర్లతో ఆదుకుంటాడో చూడాలి.
- డా|| డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.










