* అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు బెదిరింపులు
* అధికార వైసిపి కార్పొరేటర్ భర్త హస్తం?
ప్రజాశక్తి-విజయవాడ : అనుమతిలేని ఇంటి నిర్మాణ పనులను అడ్డుకోబోయిన వార్డు సచివాలయ ఉద్యోగులపై అక్రమ ఇంటి నిర్మాణదారులు పెట్రోల్ పోసిన సంఘటన బుధవారం విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడ కృష్ణలంక సిఐ ఎ.సత్యానందం కథనం ప్రకారం... నగరంలోని రామలింగేశ్వర్‌నగర్ 16వ డివిజన్లోని 74వ నంబరు సచివాలయ పరిధిలో కృష్ణా పరీవాహక ప్రాంత సమీపంలో ఎటువంటి అనుమతీ లేకుండా రావులమ్మ అనే మహిళ ఇంటిని నిర్మిస్తోంది. సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పల్లవి, 15 మంది సెక్రటరీలు ఈ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్రమంగా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. దీంతో, రావులమ్మ కుమార్తె గోవిందమ్మ, కుమారుడు గణేష్ కలిసి ప్లానింగ్ సెక్రటరీ పల్లవి, ఇతర సచివాలయ ఉద్యోగులపై పెట్రోల్ పోశారు. గోవిందమ్మ కూడా తనపై పెట్రోలు పోసుకుంది. ఇంటిని కూలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సచివాలయ ఉద్యోగులను ఆమె, గణేష్ హెచ్చరించారు. భయాందోళనకు గురైన ఉద్యోగులు విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల సూచనల మేరకు కృష్ణలంక పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి 353, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక అధికార వైసిపికి చెందిన స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త, మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి హస్తం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే గోవిందమ్మ, గణేష్ సచివాలయ ఉద్యోగులపై పెట్రోల్ పోశారని విజయవాడ సర్కిల్-3లోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నట్లు కృష్ణలంక సిఐ ఎ.సత్యానందం తెలిపారు. ప్లానింగ్ అధికారులు ఈ విషయాన్ని తమ ఫిర్యాదులో లిఖితపూర్వకంగా పేర్కొనకపోవడం గమనార్హం.










