సిపిఎం మహాసభల వేదికను స్ఫూర్తిదాయకమైన సమరశీల చిత్రాలతో తీర్చిదిద్దారు. వేదికకు ఒకవైపు సామ్యవాద సిద్ధాంత కర్తలు కారల్‌మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ నిలువెత్తు చిత్రపటం; మరోపక్క సిపిఎం తొలి పొలిట్ బ్యూరో సభ్యుల బ్యానర్ అమర్చారు. వేదిక వెనుక భాగాన్ని ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ గీసిన చారిత్రిక చిత్రాలతో తీర్చిదిద్దారు. సంకెళ్లను తెంచుకొని సమరశీలంగా ఉరకలెత్తుతున్న సామాన్యులు, ఐక్యంగా చైతన్యవంతంగా కదులుతున్న కార్మిక కర్షకులు ... చిత్త ప్రసాద్ కుంచె ప్రావీణ్యంతో అద్భుత నేపథ్యంగా అమర్చారు. అమర వీరుల స్థూపం దగ్గర కూడా విప్లవాంజలి ఘటిస్తున్న సామాన్యుల చిత్రం చిత్తప్రసాద్ గీచినదే ప్రదర్శించారు.
చిత్తప్రసాద్ బెంగాల్‌లో జన్మించి కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రభావితమైన గొప్ప చిత్రకారుడు. 1915 ా 1978 మధ్య జీవించాడు. కులాన్ని సూచించే తన పేరులోని చివరి భాగాన్ని త్యజించాడు. బెంగాల్ కరువును తన కుంచె నుంచి హృదయాన్ని కదిలించేలా జాలువార్చాడు. తెలంగాణా సాయుధ పోరాటంతో స్ఫూర్తి పొంది ఆ ప్రాంతాల్లో గ్రామగ్రామాల్లో పర్యటించాడు. సాయుధ పోరాటాన్ని తనదైన శైలిలో అద్భుతమైన బమ్మలతో చిత్రించాడు. మహాసభల ప్రాంగణంలో ఉపయోగించిన చిత్రాలు తెలంగాణా పోరాట నేపథ్యంలో ఆయన గీసిన వాటిలోంచి తీసుకున్నవే!










