Jan 02,2022 07:09

ఎద్దుబండితో కొలవకు కాలాన్ని ఎగరవోరు ఎద చీలుస్తూ అంటాడు శ్రీశ్రీ ఒకచోట. పదండి ముందుకు పదండి తోసుకు అన్న మహాకవి కలం నుంచి వచ్చిన ఈ మాటల్లో చాలా అర్థం వుంది. మందగించక ముందుకడుగెరు వెనకబడితే వెనకేనోరు అన్న గురజాడ మాటలకు గొప్ప కొనసాగింపు ఈ పిలుపు. కాలాన్ని మాయాజాలం అంటుంటారు, కాలగతి గురించి తత్వాలు పాడుతుంటారు. వాస్తవానికి కాలం ఒక ప్రమాణం. ప్రయాణం. కార్యాచరణే దానికి కొలమానం. అనంత ప్రకృతిలో జీవరాశిలో బ్రహ్మాండమైన పరిణామాలు కాల గతి లోనే కలిగాయి. అప్పుడు చైతన్యవంతంగా జోక్యం చేసుకోగల మానవ మేధస్సు శక్తియుక్తులు లేవు. ముందుకు సాగే కొద్దీ చారిత్రిక పరిణామాలూ సామాజిక రాజకీయ మలుపులలో సమిష్టి మానవ ప్రయత్నం కీలక పాత్ర వహిస్తున్నది. ఉద్యమాల నుంచి విప్లవాల వరకూ ఇందుకు ప్రతిబింబాలే. ఈ క్రమంలోనే కాలానికి ఒక గణన, పరిగణన ఏర్పడ్డాయి. సంవత్సరాలు దశాబ్దాలు అందులో కొండగుర్తులు. కాలం వెనక్కు నడవదు. తాత్కాలికమైన పరిణామాలు కష్టనష్టాలు ఎలా వున్నా మానవ గమనం కూడా దీర్ఘకాల దృష్టిలో వెనక్కు పోదు.

విఘాతాల మధ్యనే విజయాలు!
2020 తీవ్రమైన కరోనా, 2021లో రెండవ విడత చూసిన మానవాళి ఇప్పుడు అప్రమత్తత, ఆశ మేళవించి ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నది. అలాగే రైతాంగ వ్యతిరేక శాసనాలను వెనక్కు కొట్టిన ప్రజా ఉద్యమం మిగిలిన వాళ్లను కూడా ఢకొీనడానికి సమాయత్తమవుతున్నది. ఎ.పి లో రాజధానికి సంబంధించిన వివాదాస్పద వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. తెలంగాణలో వరి కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమం చేపట్టవలసిన స్థితి ఏర్పడింది. కేరళలో గత నాలుగున్నర దశాబ్దాల వరవడిని తిరగరాసి సిపిఎం నాయకత్వం లోని ఎల్‌డిఎఫ్‌ వరసగా రెండోసారి అధికారం లోకి వచ్చింది. కోవిడ్‌పై పోరాటంలో దేశానికి ఆదర్శం చూపింది. చిలీ వంటి చోట ఒకప్పుడు అమెరికా పనుపున అధ్యక్షుడు అలెండీని బలి తీసుకుని ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇప్పుడు ప్రతికూలతల మధ్య ప్రగతిశీల శక్తులు విజయం సాధించాయి. గతంలో ప్రతీప శక్తుల తాకిడికి గురైన లాటిన్‌ అమెరికా దేశాలలోనూ ఈ పరిణామం చూశాం. కోవిడ్‌ సాకుతో నిందా ప్రచారాలకు గురైన చైనా అనూహ్యమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచాన్ని అబ్బురపర్చడమే గాక ఆలోచనలోకి నెట్టింది. ఏ విధంగా చూసినా 2021 విశ్వాసాన్ని పెంచి భవిష్యత్తుపై ఆశ కలిగించి నిష్క్రమించింది. ఆత్మవిశ్వాసంతో 2022 మొదలైంది.

కోవిడ్‌కు వాక్సిన్‌ వైజ్ఞానిక విజయమైతే దానివల్ల దేశంలో ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులకు తగిన చర్యలను కొంతైనా సాధించడం పోరాటం వల్లనే సాధ్యమైంది. బిజెపి మత రాజకీయాలు కార్పొరేటీకరణ ముప్పు గురించి వామపక్షాల హెచ్చరికలు నిజమని నిరూపిస్తూ గుంటూరులో జిన్నా టవర్‌, హైదరాబాద్‌ పేరు భాగ్యనగర్‌గా మార్పు వంటి కృత్రిమ కుటిల సమస్యలు రగిలించడం చాలా మంది కళ్లు తెరిపించింది. విశాఖ ఉక్కు అమ్మకం పాటతో సహా అన్నిటినీ ప్రైవేటీకరించే పథకాలు వివరణ అవసరం లేని ఉదాహరణలుగా ముందుకొచ్చాయి. ఇతర రంగాలను చూస్తే జై భీమ్‌ లాంటి చిత్రం న్యాయం సామాజిక న్యాయం కోసం పోరాడేవారికి ఉత్సాహమిచ్చింది. ఏడాది చివరలో కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రజాస్వామిక భావాలుగల గోరటి వెంకన్నకు లభించడం గమనించదగ్గది. కులతత్వాల కుళ్లు రాజకీయాలపై సాధారణ ప్రజానీకానికి కూడా ఏవగింపు కలిగిందిగాని ఆ శక్తుల కుయుక్తులను ఇంకా ఓడించవలసే వుంది. మీడియా స్వేచ్ఛ భావప్రకటనా స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు పెరిగాయి. న్యాయ వ్యవస్థ కూడా ఒక మేరకు వీటిని గుర్తించక తప్పలేదు గాని జరగాల్సింది చాలా మిగిలే వుంది. రైతుల పోరాట విజయంతో కార్మికులు మరోసారి జాతీయ సమ్మెకు సిద్ధమవుతున్నారు. మూడు దశాబ్దాల సరళీకరణ విషమ ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నా మానిటైజేషన్‌ పేరిట అన్నిటినీ తెగనమ్మే విధానాలపై వారు సమరశంఖం పూరిస్తున్నారు. ఈ ఉద్యమ పథంలో మహిళా చైతన్యం ఒక ముఖ్య పాత్ర వహించిన సంగతి అంతా గుర్తిస్తున్నారు.
 

కీలక ఎన్నికల వరస
2017లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఘన విజయం సాధించిన సమయంలో కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తమాషా అయిన వ్యాఖ్యానం చేశారు. మనం 2019ని మర్చిపోయి 2024కు సిద్ధం కావడం మెరుగు అని. అంటే ఆ విజయం మోడీని మరోసారి గెలిపిస్తుంది గనక ఆ తర్వాత ఘట్టానికి సిద్ధం కావాలన్నది ఆయన ఉద్దేశం. అంతకు ముందు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలలో బిజెపి దెబ్బ తిన్నప్పటికీ వాటిని అధిగమించి యు.పి లో 403 స్థానాలకు 312 సీట్లు పొందడం బిజెపి తిరిగిరావడానికి ప్రధానంగా దోహదం చేసింది. వాస్తవానికి రెండవసారి గెలిచిన బిజెపి నేరుగా కాశ్మీర్‌ 370 పైనే దాడి చేయడం, ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం బట్టి చూస్తే ఫరూక్‌ అన్నదానికంటే కూడా వేగంగానూ తీవ్రంగానూ 2019 ప్రభావం పడింది. 2020-21 ముగిసి మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో యు.పి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ ఎన్నికలు కూడా వాయిదా వేయబోవడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. హైకోర్టులో ఒక న్యాయమూర్తి ఎన్నికల వాయిదా గురించి సూచనగా అన్న మాటల ఆధారంగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. గత రెండు సార్లు యు.పి లో సాధించిన సీట్లే బిజెపిని గద్దెక్కించాయని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఆ ఫలితాలపై దృష్టి కేంద్రీకరించబడటాన్ని అర్థంచేసుకోవచ్చు. బిజెపి ఎన్నికల యంత్రాంగం అందుకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా నాయకత్వం సదా సిద్ధంగా వుంటాయి. ఇప్పటికే మోడీ అరడజను పైగా సభల్లో పాల్గని ప్రచారం మొదలెట్టేశారు. 2013లో యు.పి లోనే మకాం వేసి కులమత స్థానిక రాజకీయాంశాలను లోతుగా మధించిన అమిత్‌ షా ఎలాగైనా మరోసారి గెలవాలని ఎత్తులు జిత్తులు వేస్తూనే వున్నారు. ఇక్కడ గెలిస్తేనే అక్కడ (ఢిల్లీ) పల్లవి మొదలెట్టారు.

జమిలి కథలు వెనక్కు
ఒక విధంగా 2022 దేశ రాజకీయాల గమనం కీలకమైన యు.పి ఎన్నికలతో మొదలవుతుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం నుంచి హరిద్వార్‌లో మత విద్వేష ప్రసంగాల వరకూ ఈ కోణంలోనే చూడవలసి వుంటుంది. అమరీందర్‌ సింగ్‌ రాజీనామా, బిజెపితో పొత్తు, కాంగ్రెస్‌ బలహీనతలు, ఆమాద్మీ పార్టీ ఆశల మధ్య జరిగే పంజాబ్‌ ఎన్నికలు కూడా కొంత ప్రభావం చూపిస్తాయి. మొదటి నుంచి తమతో వున్న అకాలీదళ్‌ను రైతు ఉద్యమం కారణంగా కోల్పోయిన బిజెపి మారిన పరిస్థితులలో అమరీందర్‌ సాయంతో గట్టెక్కితే ఎలాగైనా గెలవగలమని ప్రచారం మొదలెడుతుంది. కీలకమైన గుజరాత్‌, హిమాచల్‌ 2022 చివరలో ఎన్నికలకు వెళ్లవలసి వుంది. కాంగ్రెస్‌ కోలుకుంటున్న సూచనలు కనిపించని నేపథ్యంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌ మమతా బెనర్జీ తానే ప్రత్యామ్నాయం కావాలని పడుతున్న హడావుడి పరిమితులేమిటో ఫలితాలు చెబుతాయి. మోడీ జమిలి ఎన్నికలకు వెళతారనీ, 2019లో ఏర్పడిన ప్రభుత్వాలకు రెండేళ్ల గడువు మాత్రమే వుందని పెద్ద ప్రచారమే నడిచింది. బిజెపి అంతటి దుస్సాహసాలు చేసే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టమై పోయింది. తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు నడుస్తున్నా అధికార టిఆర్‌ఎస్‌ కొట్టిపారేస్తున్నది. ఎ.పి లో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి మారతారనీ నడిచిన కథనాలు నిజం కాలేదుగాని ఇప్పటికీ కథలు ఆపడంలేదు. జగన్‌ కేసుల విచారణ తీరు గమనిస్తే 2022లో వాటి విచారణ పూర్తయ్యే అవకాశం దాదాపు కనిపించదు. కాకుంటే నాయకులు జైలుకు పోతారని బెదిరిస్తున్న బిజెపి పాచికలేమిటో తెలియదు.
 

సమగ్ర విధానంతో ముందుకు!
భాగ్యనగర్‌గా హైదరాబాద్‌ పేరు, కలాం పేరుతో గుంటూరు జిన్నా టవర్‌ వివాదాలుగా తేవడం తెలుగునాట బిజెపి అనర్థక వ్యూహాలకు అద్దం పడుతుంది. స్వార్థంతోనే ఇరు రాష్ట్రాల న్యాయమైన కోర్కెలను కూడా తొక్కి పడుతున్నది. మరీ ముఖ్యంగా ఏపికి ప్రత్యేక హోదా పోలవరం, లోటు భర్తి వంటి వాటి ఊసే పెట్టుకోవడం లేదు. పైగా ఆలయాల పేరిట మతాల మాటున చిచ్చు రగిలించేందుకు విషపూరిత పథకాలు సిద్ధం చేస్తున్నది. టిడిపి, జనసేన కూడా బిజెపితో పోటీ పడినట్టు అదే భాషలో మట్లాడటం ఆందోళనకరం. అధికార వైసీపీ కూడా తనకూ హిందూత్వ అంటే అనుకూలమని చూపించుకోవడానికి తంటాలు పడుతున్నదే గాని బిజెపిని సూటిగా ఎదుర్కోవడం లేదు. కెసిఆర్‌ వరి కొనుగోలు నిరసనలు అంటూనే యాదాద్రికి మోడీ తదితరులను రావించడంలో రాజకీయ యుక్తి చూపిస్తున్నారు. మత సామరస్యానికి, లౌకిక వాదానికి పెట్టింది పేరైన తెలుగు ప్రజలు వీటిని ఆమోదించే ప్రసక్తి వుండదు. కాకపోతే ప్రాంతీయ పాలక పార్టీలు ఈ ప్రమాదం ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి సిద్ధం కాకపోవడం, పరోక్ష - ప్రత్యక్ష పొత్తులకు ఎత్తులకు సిద్ధం కావడం నష్టదాయకంగా మారుతున్నది. రాష్ట్రాల హక్కులపై వనరులపై సాగే దాడిని ఎదుర్కోకపోగా ఎ.పి లో టిడిపి, తెలంగాణలో కాంగ్రెస్‌ కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయించాలన్నట్టు మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడవలసిందే గాని ఆ పేరుతో కేంద్రం పెత్తనాన్ని ఆహ్వానించడం అనుమతించరానిది. సమస్యలపై సముచిత అవగాహనతో సమగ్ర సమతుల్య విధానాలతో సమరశీల సంకల్పంతో సాగిపోవడమే ఈ కాలసంధిలో కర్తవ్యం. నిరర్థక వివాదాలతో నిందా ప్రచారాలతో బూతు తగాదాలలో ముంచి తేల్చే అవాంఛనీయ ధోరణులకూ అదే సమాధానం. 2022 అలాంటి అర్థవంతమైన కార్యాచరణకూ ఐక్య పోరాటాలకూ దారి చూపాలని ఆశిద్దాం. వివిధ లోపాలను అధిగమించి చైతన్య దీపాలను వెలిగిద్దాం.

సానుకూల విజయాలతో సమరశీల గమనం

తెలకపల్లి రవి