ప్రజాశక్తి-విజయవాడ : 1998 క్వాలిఫైడ్ ఉపాధ్యాయలందరికి ఉద్యోగాలు ఇచ్చి అందరికి న్యాయం చెయ్యాలని, నియామకాల్లో రాజ్యాంగ బద్దంగా రూల్ అఫ్ రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్ చేస్తూ ఏఫ్రిల్ 24న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ అంశంపై ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ సదస్సులోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, MRPS తెలుగు రాష్ట్రాల ఛైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగేంద్ర, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అప్పారావు, కిరణ్, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న కెవిపియస్ రాష్ట్ర ఉపాధ్యక్షఁలు జి నటరాజు, నాయకులు సీహెచ్ శ్రీనివాసులు , 1998 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులు రమణ , వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రజని, యేసురత్నం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు ఉద్యమ కార్యాచరణకు కలిసివస్తామన్నారు. అనేక సంఘాల నాయకులు రాలేక పోతున్నామని ఉద్యమ కార్యాచరణకు కలిసి వస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు1998 క్వాలిఫైడ్ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) మరియు దళిత గిరిజన ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 4534 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6754 సర్టిఫికెట్లు పరిశీలన చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు సంబంధించిన జాబితాలను ప్రకటించి 4072 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ చర్య ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారిని నిరుత్సాహపరచినది. గత 25 సంవత్సరాల నుండి అభ్యర్థులు అనేక నిరసనలు, పోరాటాలు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేయాలని భర్తీకి పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలను పరిశీలించిన మీదట కొన్ని సమస్యలను గుర్తించారని తెలిపారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళమని తెలిపారు. తక్షణం పరిష్కారం చూపి దళిత గిరిజన, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు న్యాయం చెయ్యాలని కోరామన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా అహంకారపూరితంగా మాట్లాడారు. కోర్టుకు వెళ్లండని లేదా ధర్నాలు, నిరసనలు తెలుపుకొండని మాట్లాడటం సరైంది కాదన్నారు. బాధ్యత కలిగిన మంత్రి అలా మాట్లాడటం బాధాకరమన్నారు. సమస్యలను పూర్తిగా వినే పరిస్ధితి కూడ లేకుండ ఉండటం, అహంకారపూరితంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. పాలకులు చెప్పే సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. నలుగురు దళితులకు, ఇద్దరు మైనార్టీలకు, ఎనిమిది మంది బలహీన వర్గాలకు మంత్రి రాజకీయ పదవులు ఇస్తే సామాజిక న్యాయం కాదని, రాజ్యాంగ బద్ధంగా వచ్చే ఉద్యోగాలు ఇస్తే వారి కుటుంబాలను ఆదుకొన్నట్లు అవుతుందని తెలిపారు. ఈ కింద సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే వారికి మద్దతుగా ఆందోళన చేస్తామన్నారు.
1. ప్రభుత్వ హామీ మేరకు 4534 పోస్టులను భర్తీ చేయాలి .
2. ఇప్పుడు ప్రకటించిన జాబితాలలో రాజ్యాంగ బద్దంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి .
3. ఉద్యోగాల భర్తీ సమయంలో రోస్టర్ కం మెరిట్ ను పాటించాలి. ఈ జాబితాలను కూడా రోస్టర్ కం మెరిట్ ఆధారంగా తయారు చేయాలి .
4 . వెరిఫికేషన్ చేసిన లిస్ట్ ను బహిర్గతం చెయ్యాలి .
పై సమస్యలను పరిష్కరించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బడుగు బలహీనవర్గాలు, దళిత, గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయగలరని కోరారు.










