Nov 08,2020 07:15

         దైనా ఒక వస్తువును మార్కెట్‌ చేయాలంటే ప్రచారం అవసరం. ఆ ప్రకటన ఎంత ఆకర్షణీయంగా వుంటే అంత బాగా ప్రచారం అవుతుంది. ఆ వస్తువును కొనుక్కునే వారి సంఖ్య కూడా అంత బాగా పెరుగుతుంది. అయితే...ఇందులోని లాజిక్‌ ఏదైనప్పటికీ...కొన్ని పరిమితుల వరకు భరిస్తారు. పరిస్థితి విషమించి, జనాన్ని తప్పుదోవ పట్టించే వరకు వెళితేనే ప్రమాదం. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి...ఆ ప్రకటనకు మతం రంగునో, కులం రంగునో పులిమి, బద్‌నాం చేయడం, రెండోది... అసలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం. ఈ రెండు ధోరణులూ ప్రమాదకరమైనవే.
        ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ.... 'ఏకత్వం' పేరుతో ఒక ప్రకటన రూపొందించింది. అది... 'ఓ ముస్లిం కుటుంబం హిందూ యువతిని తమ ఇంటికి కోడలిగా ఆహ్వానిస్తారు. హిందూ కుటుంబం నుంచి వచ్చిన తమ కోడలి సీమంతం... వారి సంప్రదాయం ప్రకారమే చేయాలనుకుంటారు. ఆమె పుట్టింటి ప్రేమను మరపించేలా ఘనంగా సీమంతం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా కోడలి మెడలో నగలు అలంకరిస్తుంది అత్తగారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో 'ముస్లిం సంప్రదాయాన్ని పక్కనబెట్టి హిందూ సంప్రదాయంలో సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వీడియో ప్రకటనను 'రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక' అని ఆ నగల సంస్థ డిస్క్రిప్షన్‌ పొందుపరిచారు. అయితే, ఈ ప్రకటన చూసిన మతతత్వ వాదులు ఆ నగల సంస్థపై దాడికి దిగారు. 'లవ్‌ జిహాదీ'ని ప్రోత్సహించేలా ఉందంటూ గగ్గోలు పెట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే దేశానికి ఆయువుపట్టు అని గొప్పలు చెప్పుకునే మన దేశంలో కొందరికి ఇందులో మత ప్రచారం కనిపించింది. అంతే... ఆ ప్రకటనను నిలిపివేసేంత వరకు ఊరుకోలేదు.
       ఇప్పుడు తాజాగా వైట్‌ హ్యాట్‌ జూనియర్‌ అనే సంస్థ... ఒక ప్రకటనను విడుదల చేసింది. టీవీల్లో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఈ ప్రకటనలో 'ఒక స్కూల్‌ పిల్లాడు కోడింగ్‌ నేర్చుకుని అప్లికేషన్‌ డెవలప్‌ చేస్తాడు. దాంతో టాప్‌ ఐటీ కంపెనీలు ఆ పిల్లవాడి కోసం వారి ఇంటి ముందు క్యూ కడతారు. అంతేకాదు... ఆ పిల్లాడి ఇంటి ముందు గొడవ చేస్తున్నట్లు చూపించారు. దీంతో... ఈ రంగంలో అనుభవం వున్న టెక్కీస్‌ మాత్రమే స్పందించారు. నాలుగేళ్లు ఇంజనీరింగ్‌లో కష్టపడినా.. ఒక్కోసారి కోడింగ్‌ నేర్చుకోవడంలో అంత సామర్థ్యం కనబరచలేక, ప్రత్యేకంగా కోచింగ్‌ క్లాసులకు వెళుతుంటారు. అలాంటిది ఇంత చిన్న వయసులో... అంత సులభంగా ఎలా నేర్చుకుంటారంటూ టెక్‌ మేధావులు మండిపడుతున్నారు. ఈ ప్రకటనలో చూపించిన దశ్యాలు పిల్లలను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేవిగా వున్నాయంటూ... సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. దీంతో ఈ ప్రకటనను నిలిపివేశారు.
       ఇక్కడ రెండు ప్రకటనలనూ నిలిపివేశారు. అయితే వీటిలో ఒకటి వేర్వేరు మతాలు, సంప్రదాయాల అందమైన కలయికను చాటేదయితే, రెండోది... సజనాత్మకత పేరుతో ఆరేళ్ల చిన్నారుల భవితను వధ్యశిల పైకి నెట్టేది. దేశ సౌభ్రాతత్వాన్ని, మత సామరస్యాన్ని చాటి చెప్పే ప్రకటనను నిలిపివేసే వరకు ఈ మతతత్వ శక్తులు నిద్రపోలేదు. ఆ ప్రకటనకర్తలపై దాడులకు సైతం తెగబడ్డారు. దేశ భవితకు పట్టుగొమ్మలైన భావిభారత పౌరులను.. యంత్రాలుగా మార్చే ప్రక్రియను అడ్డుకోవడంలో... ఎక్కడా వీరు కనబడలేదు. కనబడరు కూడా. ఈ వైట్‌ హ్యాట్‌ సంస్థ ఏడాదిన్నర కాలంలోనే పెద్ద కంపెనీగా ఎదిగింది. 150 మిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించింది. అకడమిక్‌ ఎడ్యుకేషన్‌లో దేశంలోనే అతిపెద్ద ఈలెర్నింగ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థగా వున్న 'బైజూస్‌'కి 300 మిలియన్‌ డాలర్లకు అమ్ముడు పోయింది. ఈ విద్యాసంస్థలకున్నది లాభాపేక్ష, వ్యాపార ప్రయోజనాలే తప్ప పిల్లల భవిష్యత్‌ కాదు. పిల్లలను కోడింగ్‌ నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షా వీరికి లేదు. ఐదు దశలుగా నేర్పించే ఈ కోడింగ్‌ కోర్సుల్లో... కోడింగ్‌ ప్రాథమికాంశాలైన లాజిక్‌, స్ట్రక్చర్‌, సీక్వెన్స్‌, అల్గారిథమిక్‌ థింకింగ్‌ వంటి అంశాలను నేర్పుతారు. వారంలో రెండుసార్లు మాత్రమే జరిగే ఈ క్లాసులకు భారీగా ఫీజులను వసూలు చేస్తారు. కార్పొరేట్‌ విద్యను పెంచి పోషించే మన ప్రభుత్వాలకు... కోడింగ్‌ కోరల్లో చిక్కుంటున్న చిన్నారుల సుదీర్ఘ భవిష్యత్‌ మాత్రం పట్టడంలేదు. 'ఇక్కడ చెట్టు చిగర్చడానికి భయపడుతుంది/ పువ్వు వికసించడానికి అనుమానిస్తుంది/ పెదవి నవ్వడానికి సంశయిస్తుంది/ ...ఇక్కడ బాల్యం/ వధ్యశిల ముందు తల వంచిన మూగజీవం' అన్నాడో కవి. దీనిపై గట్టిగానే స్పందించిన టెక్కీలు...నగల ప్రకటనపై చిమ్మిన మతతత్వంపై కూడా స్పందించి వుంటే... స్ఫూర్తివంతంగా వుండేది.