Jan 28,2021 20:05

న్యూఢిల్లీ : దేశ స్వయం ప్రతిపత్తి, ఆహారాం రక్షణ భద్రత వంటి మన రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులను రక్షించడానికి రిపబ్లిక్‌ డే నాడు దేశరాజధానిలోనూ, దేశంలో వందలాది జిల్లాలోనూ విజయవంతంగా పరేడ్‌ నిర్వహించినందుకు రైతులకు సిఐటియు అభినందనలు తెలిపింది. రిపబ్లిక్‌ డేన నిర్వహించిన కిసాన్‌ పరేడ్‌ రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులనే కాకుండా దేశంలోని అన్ని వర్గాల కోట్లాది ప్రజలను ఆకర్షించిందని సిఐటియు ఒక ప్రకటనలో ప్రశంసించింది. పరేడ్‌ జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు రహదారుల పక్కన ఎదురుచూసి పరేడ్‌కు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. ఇది రైతులు పోరాటానికి, డిమాండ్లకు మద్దతును అదేవిధంగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ విధ్వంసకర విధానాలపై తీవ్ర వ్యతిరేకతను స్పష్టం చేస్తుందని తెలిపింది. అలాగే అధికార పార్టీకి చెందిన ఏజెంట్లు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను సిఐటియు ఖండించింది.
      అధిక సంఖ్యలో ట్రాక్టర్లు, రైతులు పరేడ్‌లో శాంతియుతంగానే పాల్గన్నారని సిఐటియు ప్రశంసించింది. అయితే ప్రశాంతంగా సాగుతున్న రైతులపై లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌, జల ఫిరంగులు ఉపయోగించడాన్ని సిఐటియు ఖండించింది. ప్రభుత్వం తక్షణమే రైతుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని, మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలని సిఐటియు ఈ ప్రకటనలో డిమాండ్‌ చేసింది.