Jan 01,2022 07:25

ఏ పంట వేస్తే లాభం రాకపోయినా నష్టం రాకుండా చేయగలమో ప్రభుత్వాలు చెప్పడం లేదు. మరి రైతు ఏం పండించాలి? వ్యవసాయం వలన బతకడం కష్టం గనుక రైతు తన పిల్లలను వ్యవసాయంలో ఉంచడం లేదు. భూమి అమ్మైనా చదివించి ఎక్కడైనా బతకమని పంపించేస్తున్నారు. రైతులను ఉద్ధరిస్తామని బాసలు చేసిన వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్ధరణ ఇలా సాగుతుండగా టిడిపి కనీస స్పందన లేకుండా కునుకుతోంది. రైతులను దోచుకు తింటున్న రైస్‌ మిల్లు యజమానులు ఈ పార్టీల మనుషులే. పైగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికులు ఈ పార్టీల వాళ్ళే. రైతుకు ధర రానిస్తారా? కనుక రైతు ఆ పార్టీల మీద ఆధార పడకుండా తన పోరాటాన్ని నమ్ముకోవాలి. తక్షణమే ధాన్యం మద్దతు ధరకు సేకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

      రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా వుంది. కౌలురైతులు మరింత దుస్థితిలో వున్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రకృతి విపత్తులు తోడవడంతో దెబ్బతిన్న రైతులు కోలుకోలేకపోతున్నారు. సాగునీటి వనరులు మెరుగుపర్చడం లేదు. ఉన్న సాగునీటి వనరులతో చేస్తున్న సేద్యం వర్షాలకు దెబ్బతింటోంది. ఈ ఏడాది అధిక వర్షాలకు ధాన్యం పంట పాడైంది. వ్యవసాయ ఖర్చు పెరిగింది. ధాన్యం గింజ వదలకుండా కొంటామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో దర్శనమిస్తున్నారు. నూర్పులు జరుగుతున్నా, ప్రభుత్వం అత్యధిక ప్రాంతాల్లో ధాన్యం కొనడంలేదు. రైతును రైస్‌ మిల్లర్లు, బ్రోకర్లు దోచుకునేందుకు లైసెన్సులు ఇచ్చేస్తున్నది. రైతులు ఐక్యంగా కదిలి పోరాడి ప్రభుత్వంతో ధాన్యం కొనిపించాలి.
 

                                         ఒట్టి మాటలు వద్దు - ధాన్యం కొనుగోలు చేయాలి

నెల నుండి రైతు చేతికి ధాన్యం వస్తున్నది. కోత సమయంలో వర్షాలతో రైతు అష్టకష్టాలు పడి ధాన్యం కళ్లాలకు తేవాల్సి వచ్చింది. ఖర్చు రెండింతలు పెరిగింది. ధాన్యం రంగు మారింది. రైతుల్లో 70 శాతం కౌలు రైతులు. వీరి బాధలు అన్నీఇన్నీ కావు. కష్టపడి పండించిన రైతు ధాన్యం కొంటామని ప్రకటనలు తప్ప కొనుగోలుచేసి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటున్నట్లు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదు. క్షేత్ర స్థాయిలో తిరిగిచూసిన వారికి కొనుగోలు కేంద్రాల పని తీరు అర్ధమవుతోంది. మోడీ ధాన్యం సేకరించవద్దంటున్నాడు. జగన్‌ మోహన్‌ రెడ్డి కొనడం లేదు. ఇద్దరూ కలిసి రైతును సర్వనాశనం చేసేలా వున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనాలంటే రైతులు దండెత్తాల్సిందే. ధాన్యం కొనాలని రైతు భరోసా కేంద్రాల ముట్టడి, ధాన్యం కొనేంత వరకు గ్రామ సచివాలయాల దిగ్బంధం వంటివి చేయాల్సి వస్తుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లిలో రైతు సంఘం నాయకత్వంలో ఈ తరహా పోరాటం చేయడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం కొంటున్నారు. ప్రతీ గ్రామంలో రైెతులంతా పోరాడితే ప్రభుత్వం కొని తీరుతుంది. రైతును ఏ ప్రభుత్వమూ రక్షించదు. రైతులే పోరాడి తమను తాము రక్షించుకోవాలి. రైతు పోరాటానికి రైతు సంఘం అండగా వుంటోంది.
 

                                              ప్రకటించిన ధర చెల్లించేవరకు పోరాడాలి

ప్రభుత్వం రైతు నుండి ధాన్యం కొనకుండా బ్రోకర్లను ప్రోత్సహిస్తున్నది. మిల్లులకు నేరుగా ధాన్యం తీసుకుపొమ్మంటూ ఉచిత సలహా ఇస్తున్నది. ప్రభుత్వ మద్దతుతో బ్రోకర్లు, మిల్లు యజమానులు రైతును దారుణంగా దోచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రంగు మారిన ధాన్యం మొదలు మంచి ధాన్యం వరకు 77 కిలోల ధాన్యం రూ.900 నుండి రూ.1200కు కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1950 ప్రకటించింది. ఆ ప్రకారం కిలోకు రూ. 19.50 రైతుకు చెల్లించాలి. 77 కిలోలకు రూ. 1500 చెల్లించాలి. కానీ రైతుకు రూ. 900 నుండి రూ. 1200 చెల్లిస్తున్నారు. 77 కిలోలకు రైతు నుండి రూ.300 నుంచి రూ. 600 వరకు దోచేస్తున్నారు. ఇది రైతును లూటీ చేయడం కాదా? విజయనగరం జిల్లాలో క్వింటాల్‌కు రెండు నుండి మూడు వందలు కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా జిల్లాకు ఈ దోపిడీ తీరు మారుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చినంత వరకు రైతులు పోరాడాలి. తక్కువ ధరకు అమ్మకుండా కనీస మద్దతు ధర సాధించుకొనే వరకు ధాన్యం అమ్మకుండా రైతు నిలబడాలి.
 

                                                         ఎన్ని రకాల దోపిడీ ?

ధర చెల్లింపులో తేడాలు ఇలా వుంటే, తూకం లోనూ మరిన్ని మోసాలు బయటపడుతున్నాయి. 75 కిలోలకు బదులు 77 నుండి 80 కిలోల వరకు ధాన్యం తీసుకుంటున్నారు. అనగా రెండు నుండి ఐదు కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. కిలో రూ.19.50లు ప్రభుత్వ మద్దతు ధర గనుక రైతు నుండి రూ. 39 నుండి రూ. 98 కాజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా వాడుతున్న చోట బస్తా బరువుతో కలిపి 41 కిలోలు తీసుకోవాలి. కానీ 43 కిలోల వరకు తీసుకుంటున్నారు. అనగా క్వింటాలుకు 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా రైతు నుండి రూ. 100 కాజేస్తున్నారు. గోనె సంచి బరువు 700 గ్రాములు. మైకా/సింథటిక్‌ సంచి 150 గ్రాముల బరువుంటుంది. కానీ రెండింటికీ రైతు నుండి బస్తాకి కిలో ధాన్యం చొప్పున అదనంగా తీసుకుంటున్నారు. 75 కిలోలకు గాను 80 కిలోలు తీసుకుంటున్న చోట...ఒక్క మైకా సంచిలో తీసుకువెళ్ళినా...అదనపు బరువుగా రెండు కిలోలు ధాన్యం తీసుకుంటున్నారు. ఇక్కడ మరో కిలోన్నరకి 33 రూపాయలు లాగేస్తున్నారు. టన్ను ధాన్యానికి వే బ్రిడ్జి దగ్గర 5 కిలోలు కోసేస్తున్నారు. రైతు నుండి మరో రూ. 100 వరకు కాజేస్తున్నారన్నమాట. రైతును కొనుగోలు కేంద్రాల నుండి రైస్‌ మిల్లులకు ధాన్యం తోలమంటున్నారు. క్వింటాలుకు రూ. 28 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలను కొనుగోలు కేంద్రాలు కాజేస్తున్నాయి. రైతుకు చెల్లించాల్సిన దానిని అధికార్లు, ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారు. ఇక తూకంలో మోసాలకు అంతే లేదు. రైతును వ్యాపారుల దోపిడీకి ప్రభుత్వం బలిచేస్తున్నది.
 

                                                 ఖర్చులకే చాలక భూమి పడావు

ధాన్యం రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. విజయనగరం జిల్లాలో సుధీర్‌ అనే రైతు వరి సాగుకు ఎకరానికయ్యే ఖర్చులు వివరంగా రాశాడు. గొర్రెల మంద, ఆకుమడి తయారు చేయడం, విత్తనం, ఎరువులు, పురుగు మందులు, గాబు మందు, దమ్ము, ఉడుపు, కోత, నూర్పిడి, రైస్‌ మిల్లుకు తోలుడుతో అన్ని ఖర్చులు ఎకరం వరి పంటకు రూ. 43,750 తేలింది. ఈ సంవత్సరం తుఫాన్లు వలన చేలు పడిపోవడం, చెడిపోవడం వలన కోత, మూత, నూర్పిడి ఖర్చు రెట్టింపు పెరిగింది. ఈ ఖర్చులు జిల్లా జిల్లాకు మారతాయి. సుధీర్‌ ఒక కూలికి రూ.300 లెక్కగట్టాడు. అదే కూలికి తూర్పు గోదావరిలో రూ. 500 పైనే ఉంది. పంట సరాసరి 20-25 బస్తాల మధ్య ఉంటుంది. ఈ సంవత్సరం 20 బస్తాలు దిగుబడి అనుకుంటే అందుకు రైతుకు రూ.29000 ఆదాయం వస్తుంది. రైతు 10 - 15 వేల రూపాయలు నష్టపోతున్నాడు. పంట పండించడమే నష్టం అనే నిర్ధారణకు వచ్చిన రైతులు ఈ సంవత్సరం లక్షల ఎకరాలు సాగు కూడా చేయకుండా పడావు పెట్టారు.
 

                                                    కౌలు రైతుకు ఆత్మహత్యే శరణ్యం

కూలి మీద బతకడం కంటే భూమి కౌలుకు తీసుకొని రైతుగా జీవించడం గౌరవప్రదంగా భావించి చాలా మంది విషవలయంలో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో భూమి సారాన్ని బట్టి ధాన్యం పండే భూమికి ఎకరాకు 14 బస్తాల నుండి 28 బస్తాల వరకు కౌలు చెల్లిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లోనే కౌలుదారుకు ఏమీ మిగలడం లేదు. కరువు, వరదలు, తుఫాన్లు, విత్తన మోసాలు తదితర పరిస్థితుల్లో కౌలు రైతు పూర్తి నష్టాల పాలవుతున్నాడు. జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి చేసిన కౌలు చట్టాన్ని మార్చేసి కౌలు రైతుకు తీరని అన్యాయం చేశారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని అంగీకారం ఉండాలని మెలిక పెట్టారు. ఫలితంగా కౌలు రైతుకు నష్టపరిహారం రాదు. బ్యాంకు అప్పు రాదు. అప్పుల పాలై అప్పు తీర్చలేక ఆత్మహత్యే శరణ్యం అనే స్థితికి కౌలు రైతు వచ్చాడు.
 

                                                ఏ పంట వేస్తే మద్దతు ధర ఇస్తారో ?

వరి వద్దు. వేరే పంట వేయమంటున్నారు. చెరుకు వేస్తే నష్టం, మొక్కజొన్న వేసినా నష్టమే. మరి ఏ పంట వేస్తే లాభం రాకపోయినా నష్టం రాకుండా చేయగలమో ప్రభుత్వాలు చెప్పడం లేదు. మరి రైతు ఏం పండించాలి? వ్యవసాయం వలన బతకడం కష్టం గనుక రైతు తన పిల్లలను వ్యవసాయంలో ఉంచడం లేదు. భూమి అమ్మైనా చదివించి ఎక్కడైనా బతకమని పంపించేస్తున్నారు. రైతులను ఉద్ధరిస్తామని బాసలు చేసిన వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్ధరణ ఇలా సాగుతుండగా టిడిపి కనీస స్పందన లేకుండా కునుకుతోంది. సారా ధర తగ్గించి అమ్ముతామన్న బిజెపి అసలు ధాన్యం కొనొద్దని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నది. రైతులను దోచుకు తింటున్న రైస్‌ మిల్లు యజమానులు ఈ పార్టీల మనుషులే. పైగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికులు ఈ పార్టీల వాళ్ళే. రైతుకు ధర రానిస్తారా? కనుక రైతు ఆ పార్టీల మీద ఆధార పడకుండా తన పోరాటాన్ని నమ్ముకోవాలి. తక్షణమే ధాన్యం మద్దతు ధరకు సేకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం సేకరించేంత వరకు రైతులు ఐక్యంగా పోరాడాలి. అలా పోరాడకపోతే రైతు బతుకు మరీ దుర్భరంగా మారుతుంది.

ఎం. కృష్ణమూర్తి

1