రాజధాని రైతులు బిజెపి వ్యూహ చతురతకు మరోసారి బలయ్యారు. ఉద్యమం ప్రారంభించిన ఎనిమిది నెలలకు గానీ బిజెపి నిజ స్వరూపం వారికి అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదేమీ కొత్త అనుభవం కాదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశాక రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 2019 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహావేశాలను బిజెపి చవిచూసింది. ఒకే మాట, ఒకే నీతి రాముడి ఆదర్శమైతే వివిధ మాటలు, వివిధ నీతులు బిజెపి బాట. ఏ రోటికాడ ఆ పాట పాడటం తర్వాత తప్పుకోవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. రాజధాని విషయంలోనూ అదే మరోసారి రుజువైంది. అమరావతిలో ఉంటుందని రాష్ట్ర నాయకులు చెప్తుంటారు. అందుకోసం ప్రాణాలిచ్చైనా పోరాడతామని భీకర ప్రతిజ్ఞలు చేస్తుంటారు. రాజధాని ఎక్కడుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని కేంద్ర నాయకులు ప్రకటిస్తుంటారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకొచ్చిన బిజెపి జాతీయ నాయకులు రాంమాధవ్ మరోసారి రాజధాని రైతుల చెవుల్లో పూలు పెట్టడానికి పూనుకున్నారు. మూడు రాజధానులకు తాను వ్యతిరేకమంటూనే ఎక్కడ రాజధాని కట్టుకోవాలనే విషయంలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే గవర్నరు అవలీలగా సంతకం పెట్టేశాడంటే కేంద్ర బిజెపి నాయకత్వం అనుమతి లేకుండానే గవర్నరు స్వతంత్రంగా వ్యవహరించాడని ఎవరన్నా అనుకుంటే వారి అమాయకత్వానికి జాలి పడాల్సిందే. అంటే ఇటు వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు రాజధాని వాసుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుష్ట రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యాన్ని ఉపయోగించుకొని బలపడాలని బిజెపి భావిస్తోంది. రాజధాని సమస్య ఆ రాజకీయ క్రీడలో పావు మాత్రమే.
అధికార దాహంతో ప్రజల మధ్య చీలికలు
మన రాష్ట్రంలో బిజెపి చాలా బలహీనమైన శక్తి. రాష్ట్రానికి అది చేసిన విద్రోహం మరింత బలహీనపరచింది. కాని డొంక దారిలో కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తహతహ బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర నాయకత్వం నుండి ఇన్‌చార్జిగా ఉన్న సునీల్ ధియోడర్ త్రిపుర, బెంగాల్ తరహాలో ఇక్కడ కూడా రాజకీయ వ్యూహరచన చేసి బలపడాలని చూస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదన్నా రాజకీయ పార్టీ బలపడాలంటే అత్యంత కీలకమైంది ప్రజాభిమానాన్ని చూరగొనడం. కాని బిజెపి రాజకీయాలు దానికి పూర్తిగా భిన్నమైనవి. కుల, మతాల ప్రాతిపదికపై భావోద్రేకాలు రెచ్చగొట్టి, ప్రజలను ముక్కలు ముక్కలుగా చీల్చి సోషల్ ఇంజనీరింగు ద్వారా కూడగట్టుకోవాలని చూస్తుంది. మన రాష్ట్రంలో వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ కులాల మధ్య చిచ్చు పెడితే ఒక తరగతి లేదా ముఠాను తాను రాబట్టుకోగలదో లెక్కలు వేసుకుంటోంది. ఆయా కులాల్లోని ఉపకులాలు, అంతర్గత వైరుధ్యాలను అధ్యయనం చేసి పదవుల కోసం ఆరాటపడుతున్న వారిని ఆకర్షించి బలపడటమనేదే దాని వ్యూహం.
బిజెపి రాష్ట్రానికి ఏం చేసింది?
ఈ ఏడాది కాలంలో బిజెపి పాలిత రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి తక్కువ నిధులే ఇచ్చింది. జిఎస్టీతో సహా రాష్ట్రం నుండి కేంద్రానికి పోతున్న నిధులే ఎక్కువగా ఉన్నాయి. బడ్జెట్ లోటును పూడ్చుకోడానికి నిధులివ్వలేదు. 2014లో చేసిన వాగ్దానం మేరకు రాజధాని నిర్మాణానికి నిధులిచ్చి ఉంటే ఈ రోజు అమరావతి రైతులు వీధుల్లో దిక్కులేనట్లు పడి ఉండాల్సిన గతి పట్టేది కాదు. దానికి తోడు చంద్రబాబు నాయుడు అలివిమాలిన రాజధాని ప్రణాళిక దాన్ని అసాధ్యం చేసింది. రాయలసీమపై మాటల్లో ప్రేమ కురిపిస్తూ ఆచరణలో వెనుకబడిన ప్రాంతాల నిధులను కట్ చేసింది. తిరుపతి ఐఐటీ, అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీల నిర్మాణం నత్తనడకలా సాగుతోంది. ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్శిటీకి పైసా విదల్చడం లేదు. ఇప్పటికీ అది ఎక్కడ కడతారో కూడా స్పష్టత లేదు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు అయినప్పటికీ నిర్వాసితుల బాధ్యత తనది కాదంటూ గాలికి వదిలేసింది. తాము చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా రాష్ట్రానికి మేలు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తోంది. కరోనాతో రాష్ట్రం తల్లడిల్లుతున్నా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. జనాన్ని గాలికొదిలేసింది.
నిరంకుశత్వానికి మరోపేరు బిజెపి
రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాత పోషించాలన్న తపనకు అనుగుణంగానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడ్ని కూడా మార్చి కొత్త వారికి పగ్గాలు అప్పగించారు. కాంగ్రెసు లాగానే బిజెపి లోనూ నామినేటెడ్ నాయకత్వ సంస్కృతే కొనసాగుతోంది. నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో స్థానిక కార్యకర్తలకు ఎలాంటి పాత్రా లేదు. పై నుండి కింది దాకా అదే సంస్కృతి. ఈ దేశంలో ఒక రాజ్యాంగేతర సంస్థకు అనుబంధంగా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ బిజేపీ. ఒకవైపు ఒకే దేశం, ఒకే ప్రజ అంటూ అన్ని అధికారాలు కేంద్రీకరిస్తూ నిరంకుశ పోకడలకు తెరతీసింది. మరోవైపు బాధ్యతలన్నీ రాష్ట్రాలపై నెడుతోంది.
మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండా
మన రాష్ట్రంలోనూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బిజెపి పూనుకుంటోంది. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. ఏదో ఒక మిషతో అన్యమతస్తులని, దేవునికి అపచారం జరిగిందని రకరకాల పేర్లతో మెజారిటీ మతస్తులైన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మతవిద్వేషాలు రగుల్చుతున్నా మాట్లాడక పోవడం క్షంతవ్యం కాదు. లౌకిక భావాలకు ప్రతినిధులమని చెప్పుకునేవారు స్వార్థ రాజకీయ సుడిగుండంలో పడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బిజేపీకి ఈ రాష్ట్రంలో పోటీలు పడి సాష్టాంగ పడుతున్నారు.
లొంగిపోతున్న ప్రాంతీయ పార్టీలు
రాష్ట్రంలో తన వ్యూహ రచనకు అనుగుణంగా తొలుత జనసేనను రాబట్టుకుంది. పవన్ కళ్యాణ్ బలహీనతలను ఉపయోగించుకొని ఆ పార్టీని దాదాపు లోబర్చుకుంది. ప్రస్తుతం జనసేన బిజెపి ఉపాంగంగా మారింది. జనసేన యూత్‌ను పవన్ కళ్యాణ్ గాలికొదిలేస్తే ఆర్.యస్.యస్ వారిని మతోన్మాదులుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. బిజెపి నిర్ణయాలే జనసేన నిర్ణయాలుగా మారిపోయాయి. అయితే ఈశక్తి మాత్రమే చాలదు. అందుకే ఇతర పార్టీలపై ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలపై కేంద్రీకరించింది. రెండు ప్రాంతీయ పార్టీలలో ప్రముఖులుగా ఉండే వారి కోసం గాలం వేస్తోంది. చిన్న చిన్న చేపలు మినహా పెద్ద చేపలు దొరకడం లేదు. అధికారమే పరమావధిగా అది చేస్తున్న రాజకీయ యజ్ఞంలో ప్రాంతీయ పార్టీలే కాదు ప్రజలు కూడా బలిపశువులవుతారు.
వైయస్సార్ కాంగ్రెసు లోపాయికారి మద్దతు
రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టి పోరాడాల్సిన ముఖ్యమంత్రి మోడీ దగ్గర నీళ్లు నములుతూ మాట్లాడటం రాష్ట్ర ప్రజలను తలదించుకునేట్లు చేస్తోంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా చెప్పాల్సింది చెప్పాను. నా పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను డమ్మీలుగా మారుస్తున్నా భరించడం తప్ప ప్రశ్నించడం లేదు. పైగా కేంద్రం కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా ఎదురు ప్రశ్నిస్తే కేసులు బయటకు లాగి జైల్లో పెడతారని భయం పీడిస్తున్నట్లుంది. యంపీ రఘురామరాజు లాంటి వారు పార్టీలో ఉంటూనే బిజేపీ దన్నుతో సెగ పెడుతుంటే మారు మాట్లాడటం లేదు. మోడీకి జగన్‌కు మధ్య యంపీ విజయ సాయిరెడ్డి సంధానకర్తగా పనులు చక్కబెడుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షా లకు తెలియకుండా మేము ఏ పనీ చేయడం లేదని ఆయన బహిరంగంగానే సెలవిచ్చారు. అంటే బిజెపి నీడ లోనే వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వం నడుస్తోందని అర్థమవుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణకు విజయసాయిరెడ్డికి మధ్య ఆ మధ్య కొంతకాలం మాటల యుద్ధం నడిచింది. ఫలితంగా ఆయన అధ్యక్ష పదవిని కోల్పోయాడని పరిశీలకులంటున్నారు. కొత్త అధ్య క్షుడు జగన్ ప్రభుత్వంతో అలాంటి గ్యాప్ రాకుండా చూసు కుంటారని కూడా వినిపిస్తోంది. పైకి విమర్శిస్తూ లోపాయి కారిగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈ స్థితిలో బిజెపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని రాజద óాని లేదా మరొకరెవరైనా భావిస్తే అది పెద్ద భ్రమ అవుతుంది.
తెలుగుదేశం అవకాశవాదం
తెలుగుదేశం నేతకు బిజెపి కి మధ్య టిడిపి మాజీ నాయకుడు సృజనా చౌదరి సామరస్యం కుదిర్చాడన్న వార్తలొస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గితే భౌతికంగా బిజెపి నాయకుల్ని కలసి సయోధ్య చేసుకుంటారన్న వార్తలొస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు అనే భూతాన్ని ఎదుర్కోడానికి బిజెపి అనే బ్రహ్మరాక్షసిని శరణు వేడటం రేపు తెలుగుదేశం ఉనికికే ప్రమాదమన్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. బిజేపీ చరిత్ర చూస్తే ఏ రాష్ట్రంలోనూ వారు ప్రాంతీయ పార్టీలను వదల్లేదు. వారితో మొదట స్నేహం చేయడం ఆ తర్వాత నాశనం చేయడం వారి వ్యూహం. తెలుగుదేశం అనుభవం కూడా అదే. 1999లో బిజెపి తో కలసి పోటీ చేశారు. 2004లో టిడిపి ఇంటి ముఖం పట్టింది. 2014లో మరల పొత్తు పెట్టుకున్నారు. 2019లో ఘోర ఓటమి చవిచూశారు. అయినా తెలుగుదేశం పాఠం నేర్చుకోవడం లేదు. బిజెపి కి లొంగిపోయి పార్టీని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి అవకాశవాద వైఖరి తెలుగుదేశానికి మరణశాసనం అవుతుంది.
బిజెపి తో నికరంగా పోరాడేది వామపక్షాలే
అటు వైయస్సార్, ఇటు తెలుగుదేశం రెండు పార్టీలూ బిజెపి తో రాజీ పడుతున్నాయి. బిజెపి తో రాజీ అంటే రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడటమే. బిజెపి ఈ రెండు పార్టీలను రెండు చేతులతో పట్టుకొని నడిపిస్తున్నది. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం బిజెపి కి రాష్ట్రంలో స్థానం కల్పిస్తే ఆ పాపం వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది. మైనారిటీలను ఉద్ధరిస్తామంటూ ఉపన్యాసాలు చేస్తూ అదే మైనారిటీల అభద్రతకు కారకులైన బిజెపి తో దోస్తీకి వైయస్సార్ కాంగ్రెసు ఏ రకంగా సమర్ధించుకుంటుంది? కేంద్ర నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి బలపడిన తెలుగుదేశం నేడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ తెలుగువారి ఆత్మగౌరవాన్ని అదే కేంద్రం ముందు తాకట్టు పెట్టడానికి సిద్ధమవడం ఆత్మహత్యా సదశ్యం కాదా? దేశంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా లొంగిపోతున్న స్థితిలో వామపక్షాలు మాత్రమే బిజెపి దూకుడుకు కళ్లెం వేయడానికి శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాయి. దాని ఆర్థిక విధానాలను సవాలు చేసి నిలబడుతున్నాయి. కేరళ ప్రభుత్వంపై కుట్రలు సాగుతున్నా ప్రజల్ని కూడగట్టి ఎదిరించి నిలబడి పోరాడుతోంది. నేటి దేశ రాజకీయ అనుభవం చూస్తే వామపక్షాలు మాత్రమే బిజెపి దూకుడుకు కళ్లెం వేసి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపగలవని రూఢ అవుతోంది. ఆర్థిక సంక్షోభమనే సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని వామపక్షాలు మాత్రమే దరిచేర్చగలవు.
- వి. శ్రీనివాసరావు
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు)










