- అమలుకాని విభజన హామీలు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ.33 వేల కోట్లే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాసలు చేసింది. విభజన హామీలను పక్కన పెట్టింది. పెట్రోలియం యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ మినహా మరే విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదు. వాటికి కూడా అరకొర నిధులే కేటాయించారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్, ఎన్‌ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటి, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు. ఇప్పటికే ఏపి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించింది.
ఏపికి కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్లు కేటాయించారు. ఏపి సెంట్రల్ యూనివర్శిటీకి రూ.56 కోట్లు, విశాఖ పెట్రోల్ యూనివర్శిటీకి రూ.150 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.910 కోట్లు, వైజాగ్ పోర్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.374.35 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లోని ఐఐటికి రూ.300 కోట్లు లోన్ కింద కేటాయించారు. సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.
కేంద్ర పన్నుల్లో ఏపి వాటా రూ. 33 వేల కోట్లే
కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. -0.37 కోట్లు, సెంట్రల్ జిఎస్‌టి రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.33.18 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి.
విభజన హామీల ప్రస్తావనే లేదు

కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపరిచింది. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల ప్రస్తావనే లేదు. సబ్ కా వికాస్ అసలు లేదు. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఎల్‌ఐసి, హెచ్‌పిసిఎల్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.
- విజయసాయిరెడ్డి, వైసిపి ఎంపి
ఆశాజనకంగా లేదు

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం లేదు. రైతులు, పేదల కోసం ఏం చేస్తారో చెప్పలేదు. వేతన జీవులకు మొండి చేయి చూపించారు. నదుల అనుసంధాన ప్రణాళికలు బావున్నాయి. డిజిటల్, సోలార్ సంస్కరణలు ఆహ్వానిస్తున్నాం.- చంద్రబాబు, టిడిపి అధినేత
రాష్ట్రాభివృద్ధిపై దెబ్బ

ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి ఇప్పుడు బడ్జెట్ ద్వారా రాష్ట్రాభివృద్ధిని కూడా దెబ్బ కొట్టిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి అన్యాయం జరిగిందని విమర్శించింది. - సిపిఎం రాష్ట్ర కమిటీ










