Dec 28,2021 15:21

- ప్రజలపై అదనపు భారం మోపొద్దు
- ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి
-సిపిఎం 26వ రాష్ట్ర మహాసభ డిమాండ్‌

ప్రజాశక్తి-జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్‌ చేసింది. సోమవారం నాడిక్కడ జరిగిన సిపిఎం 26వ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన తీరని ద్రోహాన్ని తిప్పికొట్టి, ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం, రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర విశ్వ విద్యాలయాలకు నిధులు సాధించుకోవడానికి సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చి ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానం ఇంకా ఇలా పేర్కొంది. 'రాష్ట్రాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. విభజనానంతరం ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం దగా చేసింది. మరోవైపు ఎన్‌ఆర్‌సి, రామజన్మభూమి, కాశ్మీర్‌, మతమార్పిడుల పేరుతో ప్రజల మధ్య చీలికలు తెస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. బిజెపి విద్రోహ, విద్వేష రాజకీయాలను ఎదుర్కోవాల్సిన రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లంగిపోతోంది. 25 మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్‌ హామీ గాల్లో కలిసిపోయింది. వైసిపి, టిడిపి పోటీపడి కేంద్రానికి వత్తాసునిస్తుండటంతో రాష్ట్రంలో మతోన్మాద బిజెపి పేట్రేగిపోతోంది. మనరాష్ట్రం హక్కుల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని పక్షాలను కలుపుకుని కేంద్రంపై పోరాడాలి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. టిడిపి, జనసేన పార్టీలు బిజెపి మతోన్మాద ఎజెండా నుండి విడగొట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలకు అండగా నిలవాలని మహాసభ విజ్ఞప్తి చేస్తోంది.
రాజధాని వివాదానికి స్వస్తి చెప్పి విభజనానంతరం వైసిపి సహా రాజకీయ పార్టీలన్నీ వచ్చిన ఏకాభిప్రాయాన్ని గౌరవించి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, కర్నూలులో హైకోర్టు పెట్టాలని మహాసభ డిమాండ్‌ చేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ 10 నెలలుగా సాగిస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తక్షణం ఆపాలి.
పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, చట్ట ప్రకారం పునరావాసం కల్పించకుండా కేంద్రం బాధ్యతారహితంగా తప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఆదివాసీ ప్రజలను గెంటేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. వారి ఆందోళనలకు ఈ మహాసభ సంఘీభావం ప్రకటిస్తోంది. త్వరితగతిన పునరావాసం పూర్తిచేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష, విద్రోహపూరిత దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా సకల పక్షాలు ఏకమై పోరాడాలని ఈ మహాసభ పిలుపునిస్తోంది.
వైసిపి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలకు కూడా కోతలు పెడుతోంది. మరోవైపు వీటితోనే అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయన్న భ్రమలు సృష్టించి అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ధరలు, పన్నులు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతోంది. జగన్‌ పాదయాత్ర సందర్భంగా వివిధ తరగతుల, ప్రాంతాల ప్రజలకిచ్చిన హామీలను విస్మరించింది. ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కింది. నాడు ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటానని, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడతానని చెప్పి, నేడు అదే టిడిపి బాటలో నిరంకుశంగా అణచివేస్తోంది. ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి.
ఎయిడెడ్‌ విద్యాసంస్థల రక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలకు సిపిఎం రాష్ట్ర మహాసభ సంఘీభావం ప్రకటిస్తోంది. పిఆర్‌సి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు సాగిస్తున్న ఆందోళన న్యాయబద్దమైంది. వెంటనే నివేదికను బయటపెట్టి, అమలు చేయాలి. సిపిఎస్‌ రద్దు చేస్తామని మాట తప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కరించాలి. సినిమా టిక్కెట్ల ధర నిర్ణయంలో వచ్చిన వివాదాన్ని థియేటర్‌ యజమానులతో చర్చించి పరిష్కారానికి రావాలని ఈ మహాసభ సూచిస్తోంది.
ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచింది. కేంద్రం తెచ్చిన సంస్కరణలను జగన్‌ ప్రభుత్వం భుజాన మోస్తూ ప్రజలపై భారాలు మోపుతోంది. ఇసుక ధర సామాన్యులకు అందనంత ఎత్తుకు పోయింది. స్టీలు, సిమెంట్‌ ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణ పనులు మందగించాయి. ఉపాధి పడిపోయింది. నిత్యజీవితావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి.
విద్యుత్‌ ఛార్జీలు భారంగా మారాయి. స్లాబుల మార్పు, ఇంటికొక్క మీటరు విధానాన్ని ఆపాలి. ఆస్తిపన్ను పెంచారు. కొత్తగా చెత్తపన్ను వేస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. మద్యం షాపులు, ధరల పెంపుతో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీ అమలు చేయాలి.
రైతుభరోసా కేంద్రాలు పెట్టినా పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కౌలురైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గిపోతోంది. వలసలు పెరిగాయి. మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించి రైతుల బకాయిలు చెల్లించాలి. సహకార డెయిరీలకు ప్రభుత్వ ప్రోత్సాహమిచ్చి పాల ఉత్పత్తిదారులకు చేసిన వాగ్ధానం ప్రకారం లీటరుకు రూ.10 బోనస్‌ ఇవ్వాలి.
కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. యువతకు ఉద్యోగాల్లేవు. జాబ్‌ కేలండరు ఫార్సుగా మారింది. 2022 సంవత్సర ప్రారంభంలోనే కొత్త జాబ్‌ కేలండరు ప్రకటించి వివిధ శాఖల్లో ఉన్న రెండున్నర లక్షల ఖాళీ పోస్టులన్నీ పూరించాలి. బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నీ నింపాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి.
కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానంతో పేదలకు చదువు దూరమవుతుంది. డ్రాపౌట్స్‌ పెరుగుతాయి. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలి.
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలి. జగనన్న ఇళ్లకు పెండింగ్‌ నిధులు వెంటనే మంజూరు చేయాలి. 1980లో కట్టించిన ప్రభుత్వ గృహ రుణాలను మాఫీ చేసి ఇంటిపట్టా ఇవ్వాలి. ఒటిఎస్‌ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం తక్షణం ఆపాలి.
అటవీరక్షణ చట్టం అమలు చేసి ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలి. దళితులపై దాడుల్ని అరికట్టాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. దిశ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలి. బిసిలకు కులాల వారీ కార్పొరేషన్లు పెట్టినా నిధులివ్వలేదు. వృత్తిదారుల పథకాలు మూలనబడ్డాయి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇవ్వనందున సర్పంచులు ఆందోళనబాట పట్టారు. అధికారాలను వికేంద్రీకరించి స్థానిక సంస్థలను, సహకార సంఘాలను బలోపేతం చేయాలి.
వెనుకబడిన ప్రాంతాల ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలి. అందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించాలి. కేంద్రం అన్యాయంగా పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులకు తక్షణం అనుమతులు ఇవ్వాలి.
పై డిమాండ్ల సాధనకు రానున్న కాలంలో అన్ని వర్గాల, తరగతుల ప్రజానీకం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభ పిలుపునిస్తోంది.