అనంతపురం ప్రతినిధి : ఉపాధి కల్పించే పరిశ్రమ వస్తే... మీరు తరిమేసారంటే.. మీరు తరిమేసారంటూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి చేస్తున్న ప్రత్యారోపణలతో రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ రగడ రాజుకుంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరింపులతో పేజ్ ఇండిస్టీస్ (జాకీ) పరిశ్రమ తరలి వెళ్లిందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కూడా పరిశ్రమ స్థలంలోకెళ్లి మంగళవారం నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బుధవారం నాడు మీడియా టూర్ ఏర్పాటు చేసి పరిశ్రమ స్థలంతోపాటు, ఆలమూరులో ఏర్పాటు చేస్తున్న సహకార డైయిరీ చూపించారు. ఈ సమయంలో టిడిపి హయాంలోనే మాజీ మంత్రి పరిటాల సునీత బంధువుల బెదిరింపులకు 2018లోనే ఆ పరిశ్రమ పోయిందని చెబుతూనే, ఆ పరిశ్రమ చెత్త పరిశ్రమ అన్నట్టుగా ప్రకటించారు. గడిచిన నాలుగైదు రోజులుగా నియోజకవర్గంలో పేజ్ ఇండిస్టీస్ చుట్టూ రాజకీయ రగడ సాగుతుండటం, అది కూడా పరిశ్రమ తరలివెళ్లటానికి మీరు కారణమంటే.. మీరు కారణమన్న ప్రత్యారోపణలు సాగుతుండటం నియోజకవర్గంతో పాటు జిల్లావాసులు విస్తుపోయి చూసే పరిస్థితి ఏర్పడిండి. ఎక్కడైనా అభివృద్ధి మా హయాంలో జరిగిందంటే, మా హయాంలో జరిగిదంటూ వారి కాలంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవడం పరిపాటి. కాని రాప్తాడులో మాత్రం పరిశ్రమ తరలివెళ్లడానికి కారణంపై చర్చ సాగుతుండటం గమనార్హం.
రాప్తాడులో సమస్యల తిష్ట
రాప్తాడు నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేశాయి. వీటికి పరిష్కారాలు దశాబ్ధాలుగా లభించడం లేదు. తాగునీటికి సైతం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాజకీయ రగడ జరుగుతున్న సమయంలో మంగళవారం నాడు ఆత్మకూరు మండల కేంద్రంలో కొంత మంది తాగునీటి కోసం రాస్తారోకో చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు గడిచిన దశబ్ధకాలంగా పరిష్కారం లభించలేదు. వీటితోపాటు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పేరూరుకు నీరున్నా దిగువకు నీరు వెళ్లదు..!
రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలంలో పేరూరు డ్యామ్ నిర్మాణాన్ని 1950లో పూర్తిచేశారు. ఈ డ్యామ్ పూర్తయినా దిగువ చెరువులకు నీరందించే కాలువలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఈ డ్యామ్‌కు నీరివ్వడంపై దశబ్ధకాలంగా ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో డ్యామ్‌కు రంగులేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచ్చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్యామ్‌కు హంద్రీనీవా నీరిస్తామని ప్రకటించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఏడాది మంచి వర్షాలకు డ్యామ్ నిండి పొంగింది. అయితే ఇప్పటికీ పిల్ల కాలువలు పూర్తవకపోవడంతో నీరు దిగువకు ఇవ్వలేని పరిస్థితి ఉంది.
హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతలే....
హంద్రీనీవా ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పేరూరు డ్యామ్‌కు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి పనులూ ప్రారంభమయ్యాయి. వైసిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని ఆపింది. ఆ తరవాత మూడు రిజర్వాయర్లు అదనంగా చేర్చి నిర్మిస్తామని రెండేళ్ల క్రితం అప్పటి ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అయితే ఆ పనులు ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భూసేకరణ కూడా పూర్తవకుండానే ఆగిపోయి ఉన్నాయి.
బంగారు గనులు అంతేనా .?
ఎక్కడా లేనటువంటి బంగారు సంపద రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూతపడిన ఈ గనులను తెరిపిస్తామని టిడిపి అధికారంలో ఉండగా అప్పటి మంత్రి పరిటాల సునీత, భూగర్భ గనుల శాఖమంత్రి పీతల సుజాతను రామగిరి పిలిపించి చూపించారు. దీనిని తెరిపించి ఈ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చారు. అయితే ఐదేళ్లలో అది జరగలేదు. వైసిపి అధికారంలోకి వచ్చాకా ఇటువంటి ప్రకటనలే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేశారు. విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటూ హడావుడి చేశారు. కేంద్రం దేశ వ్యాప్తంగా కొత్త గనుల తవ్వకాలకు పిలిచిన టెండర్లను చూపించారు. అయితే ఇప్పటికి అవి ఏమయ్యాయో తెలీయదు. గనుల మాత్రం మూతపడినవి మూతపడినట్టుగానే ఉన్నాయి. ఇలా రాప్తాడులో ప్రధానమైన సమస్యలన్నీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దశాబ్ధాలుగా ఉంటున్నాయి. వాటి పరిష్కారానికి నేతలు దృష్టి సారించకుండా పరిశ్రమలను తరిమివేయడంపై పోటీ పడి విమర్శలు చేసుకుంటూ ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.










