శనివారం జరగనున్న రాజస్థాన్ శాసనసభ సమావేశంతో గత నెల రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోవచ్చు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పూర్వ పిసిసి అధ్యక్షుడైన సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ ముసలానికి మూల కారణమైనా, విపక్షాల నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలన్న బిజెపి కుట్రకూ కీలక పాత్ర వుంది. ఎట్టకేలకు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అలాగే ముఖ్యమంత్రి గెహ్లాట్ చాలా ఎదురుదెబ్బలు తినవలసి వచ్చింది. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్‌ను, కేంద్ర మంత్రులను, వారి కార్యాలయాలను నిర్లజ్జగా దుర్వినియోగం చేసిన బిజెపి కి భంగపాటు తప్పలేదు. శాసనసభను సమావేశపరచాలంటూ రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం పంపినా, ముఖ్యమంత్రి స్వయంగా కలిసి విన్నవించినా కల్‌రాజ్ మిశ్రా అందుకు తిరస్కరించి గవర్నర్ పదవిని, రాజ్‌భవన్ ప్రతిష్టనూ మంటగలిపారు (తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డాక మాత్రమే అంగీకరించారు). 'తిలా పాపం తలా పిడికెడు' అన్న చందంగా ఈ వివాదంలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని సంప్రదాయాలకు తూట్లు పొడవడం శోచనీయం.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరుపై అసంతృప్తితో తిరుగుబాటు చేశానన్న మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎన్నో మలుపులు, రాహుల్‌్, ప్రియాంక గాంధీల మంతనాల అనంతరం సొంత గూటి లోనే ఉన్నట్లు ప్రకటించారు. తమను వ్యక్తిగతంగా దూషించినా తాను, తన మద్దతుదారులు పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నామని, తాము బిజెపి వైపు చూడలేదని, కనీసం చర్చలు కూడా జరపలేదని ఆయన చెప్పడం బూటకమే! బిజెపి నేతల 'సహాయ, సహకారాలు' లేకుండానే హర్యానా లోని రిసార్టులలో పైలట్ వర్గం విడిది చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అదీ రాజస్థాన్ పోలీసు శాఖ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు పట్టుకోలేని విధంగా ఆ ఎమ్మెల్యేలు దాక్కోవడం సాధ్యమా? ఏది ఏమైనా సోమవారంనాడు రెండు గంటలపాటు రాహుల్, ప్రియాంకలతో పైలట్ భేటీ అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. పైలట్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు, ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు పిసిసి అధ్యక్ష పదవి తిరిగి లభించేలా రాజీ కుదిరింది. తద్వారా 2018లో రాజస్థాన్ ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ఏర్పడిన ప్రభుత్వం ఇకపైనా కొనసాగనుంది. ఆ మేరకు ఇది ప్రజాస్వామ్యానికి సానుకూల అంశంగా పరిగణించవచ్చు.
రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి సకల యత్నాలూ సాగించింది. అది కాంగ్రెస్ అంతర్గత కీచులాట అంటూనే అసమ్మతి ఎమ్మెల్యేలకు హర్యానాలో రిసార్టులను సమకూర్చింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పరిచారు. ఆ సంభాషణల టేపులు బహిరంగం కావడంతో 'కన్నం లోని దొంగకు తేలు కుట్టిన' చందమైంది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని గుజరాత్ లోని పోరుబందర్‌కు తరలించింది. గవర్నర్‌ను, న్యాయ వ్యవస్థనూ ప్రభావితం చేసిందన్నది జనవాక్యం.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు రాజస్థాన్ లోనూ 2018లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మోడీ రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక గత ఏడాది కర్ణాటకలోనూ, లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు (మార్చిలో) మధ్యప్రదేశ్‌లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కమలనాథులు ఫిరాయింపుల ద్వారా పడగొట్టారు. ఈ దెబ్బలు తిన్నాక కూడా కాంగ్రెస్ అధిష్టానం పాఠాలు నేర్వలేదని రాజస్థాన్ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య అనుభవంతోనైనా సచిన్ పైలట్ వ్యవహారం ఎలా పరిణమిస్తుందో ఊహించాలి కదా! ఉప ముఖ్యమంత్రితో తాను గడచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా ముఖాముఖీ మాట్లాడలేదని గెహ్లాట్ బహిరంగంగానే చెప్పారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందీ విదితమవుతోంది. ఇలాంటివి కూడా పరిశీలించలేని అధిష్టానం వున్నా లేనట్టే కదా! బిజెపితో విధానాల పరంగా కాంగ్రెస్ ఎటూ ఢ కొట్టలేదు. కనీసం వారు వేసే పాచికలనైనా తిప్పికొట్టే స్థితి కూడా లేనట్టుంది. ఇప్పటికి రాజస్థాన్‌లో గట్టెక్కినా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను దెబ్బ తీసే కుట్రల పట్ల అప్రమత్తంగా వుండడం అవసరం. ప్రజా తీర్పునకు అనుగుణంగా ఏర్పడిన ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలి. ఈపాటి కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ పడిన తిప్పలు చూస్తే బిజెపి దాడిని రాజకీయంగానే గాక నిర్మాణపరంగా కూడా తట్టుకోలేని అశక్తతతో వుందని స్పష్టమవుతోంది. ఇది ఆ పార్టీ స్వయంకృతమే!










