Mar 09,2022 07:02

ఈ అసెంబ్లీ సమావేశాలలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, అమలు చేస్తామని, రాజధానిగా అమరావతి నే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం అమరావతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. రైతులకు, ఇతర వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఉద్యమకారులపై, రైతులు,ప్రజల పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అమరావతిలో రాజధాని కొనసాగించాలని విధానానికి సిపిఎం కట్టుబడి ఉంది. హైకోర్టు రాజధానిలో భాగం కాదు. పరిపాలన, శాసనసభ, సచివాలయం ఇవన్నీ అమరావతి లోనే కొనసాగాలి. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలన్నది సిపిఎం వైఖరి.

     రాజధాని అమరావతిపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్థూలంగా సిపిఎం తో సహా అత్యధిక పార్టీలు, సంఘాలు స్వాగతించాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వివాదానికి స్వస్తి పలికి కోర్టు తీర్పు అమలుకు పూనుకోవాలని డిమాండ్‌ చేశాయి.
భూ సమీకరణపై పాలకవర్గ పార్టీలన్నీ ఒకటే
2014 సంవత్సరంలో అసెంబ్లీలో వైసిపి తో సహా అందరూ అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. సుమారు 34 వేల ఎకరాల భూమిని భూ సమీకరణ పద్ధతిలో రైతుల నుండి భూములు తీసుకున్నారు. ఎకరం భూమి (4840 చదరపు గజాలు) రైతు నుండి తీసుకుని రైతుకి అభివృద్ధి చేసిన ప్లాట్లు 1200 నుండి 1450 చదరపు గజాల వరకు వారికి తిరిగి ఇవ్వటం భూ సమీకరణలో ముఖ్యాంశం. భూమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ వైఖరి, పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము కాబట్టి భూమి ఇవ్వడానికి ముందే తగు నష్టపరిహారం, నష్టపోయే ప్రజలందరికీ పరిహారం, సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే భూమి ఇచ్చే భూసేకరణ చట్ట ప్రకారం సేకరించాలని సిపిఎం చెప్పింది. అయినా బిజెపి, టిడిపి, వైసిపి తో సహా అందరూ పూలింగ్‌ ను సమర్థించారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రమంతా పేదల ఇళ్ల స్థలాల కోసం భూ సమీకరణ జీవో లు ఇచ్చింది. విశాఖలో వేల ఎకరాల భూమి పూలింగ్‌ పద్ధతిలో తీసుకోవడానికి ఆదేశాలిస్తే సిపిఎం, ప్రజా సంఘాలు రైతుల పక్షాన కోర్టులకు వెళ్లి అండగా నిలబడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రైతులకు అండగా నిలబడి పూలింగ్‌ వద్దన్నందుకు సిపిఎం పై నిందలు మోపారు. జరిగిన పరిణామాలన్నీ పూలింగ్‌ విధానం లోపభూయిష్టంగా ఉందని, నష్టాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతోంది.
వివాదాలతో సమయం, ప్రజాధనం వృధా
వైసిపి ప్రభుత్వం మూడేళ్ళ విలువైన సమయాన్ని రాజధాని వివాదంతో వృధా చేసింది. అమరావతిలో ఖర్చు చేసిన వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. రాజధాని విభజన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పక్కనపెట్టి, ప్రజల దష్టిని మళ్లించి, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుంది. అభివద్ధి పైన పరిపాలన పైన దష్టి పెట్టలేదు. హైకోర్టు తీర్పు ఊహించిందే అని మంత్రి బొత్స చెప్పారు. అంటే ఒప్పందానికి భిన్నంగా రాజధానిని మార్చటం న్యాయపరంగా చెల్లదని ప్రభుత్వం ముందుగానే ఊహించిందని అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ఎందుకు వివాదం చేసింది? అటు అమరావతి, ఇటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయకుండా అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం గా కనబడుతోంది. ఈ వివాదాన్ని కేంద్రం ప్రోత్సహించింది. రాజధాని లేకపోతే నిధులు గురించి అడిగే వారే ఉండరు కనుక కేంద్రానికి, బిజెపికి ఈ వివాదం సంతోషమే.
హైకోర్టు తీర్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికీ గుణపాఠంగా ఉండాలి. అమరావతి రాజధాని కి తమకు సంబంధం లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రం తన బాధ్యత నుండి తప్పించుకోలేదని ఈ తీర్పును బట్టి అర్థమవుతున్నది.
నిధులు ఎక్కడ?
రైతుల పాట్లు అభివృద్ధి చేయడానికి, రాజధాని అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతుల భూములు ఇచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయ్యింది. పూలింగ్‌ చట్టప్రకారం మూడేళ్లలో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి. టిడిపి ప్రభుత్వం సకాలంలో చేయకుండా తాత్కాలిక నిర్మాణాల పైనే దృష్టి పెట్టింది. వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం (విభజన చట్టం) ప్రకారం రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. 2014 లోనే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 50 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని నివేదికలు పంపింది. 50 వేల కోట్ల రూపాయలు అవసరమైన రాజధానికి 5 లక్షల రూపాయలు మొక్కుబడిగా కేంద్రం కేటాయించింది. ఇది పచ్చి మోసం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అవమానించడమే. అమరావతి రైలు ప్రాజెక్టుకు 1700 కోట్ల రూపాయలు అవసరం కాగా కేంద్రం 1000 రూపాయలు కేటాయించింది. విజయవాడ నుండి అమరావతి కి మెట్రో రైలు ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్నా, దాని ఊసే కేంద్రం మరిచింది. అమరావతిలో రిజర్వు బ్యాంకు తో సహా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు, భూములు కొనుగోలు చేశారు. ఆ భూములలో కేంద్ర సంస్థలు నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. బిజెపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. ఇక్కడ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తూ, కేంద్రం గత ఆరు సంవత్సరాల నుండి నిధులు కేటాయించలేదు. బిజెపి, కేంద్రం ద్రోహం గురించి వైసిపి,టిడిపి, జనసేన తదితర పార్టీలు నోరుమెదపవు. ఈ ప్రమాదాన్ని అందరూ గుర్తించాలి.
ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజాకోర్టులో ఓడిపోక తప్పదు
రాజధాని అమరావతి పై రైతులతో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా కొత్త చట్టం చేసే అధికారం, ఉన్న చట్టాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇతర చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదు. రాష్ట్రాల హక్కులు ఉండాల్సిందే. శాసనసభలకు చట్టాలు చేసే అధికారం ఉండాల్సిందే. గతంలో అమరావతి చట్టం రైతుల భూములు తీసుకున్న పూలింగ్‌ చట్టం చేసింది కూడా అసెంబ్లీనే. ఆ అసెంబ్లీలో టిడిపి, బిజెపితో పాటు వైసిపి అందరూ కలిసి చట్టం చేసిన విషయం మర్చిపోకూడదు. రైతులతో ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వాలు మార్చుకుంటూ పోతే ప్రజల గతి ఏమవుతుంది? 2024 లో మరో ప్రభుత్వం వస్తే మళ్లీ మార్చవచ్చా? మళ్లీ చట్టం చేయవచ్చా? కేంద్రమైనా, రాష్ట్రమైనా చేసిన చట్టాలను న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే అధికారం ఉంది. అయితే న్యాయస్థానాలకూ పరిమితులుంటాయి. ఢిల్లీలో రైతులు ప్రజాకోర్టులో నల్ల వ్యవసాయ చట్టాల సంగతి తేల్చుకున్నారు. కేంద్రం ఆ చట్టాలను రద్దు చేయక తప్పలేదు. ఢిల్లీలోనూ, అమరావతిలో ప్రజా ఉద్యమం, ప్రజల ఒత్తిడి కీలక అంశాలు. అమరావతి రైతులు 810 పది రోజుల నుండి జరుపుతున్న ఉద్యమం, మరోవైపు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు జరిగిన యాత్ర, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నైతిక మద్దతు ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణను గమనించాల్సి ఉంటుంది. కాబట్టే ప్రజా మద్దతు, ప్రజా ఉద్యమం, ఒత్తిడే అన్నిటికీ కీలకం.
సంక్షేమ నిబంధనలను గాలికొదిలేసిన ప్రభుత్వాలు
సి ఆర్‌ డి ఏ చట్టం పూలింగ్‌ నిబంధనలోని రాజధాని నిర్మాణం తో కూడిన రైతుల ప్లాట్లు అభివృద్ధి ముఖ్యాంశం. కాబట్టి నిలిచిపోయిన పనులను పునరుద్ధరించాలి. రైతులకు ప్లాట్లు నిబంధనల మేరకు అభివృద్ధి చేసి కోర్టు తీర్పు ప్రకారం సకాలంలో ఇవ్వాలి. రైతులకు 10 సంవత్సరాల పాటు కౌలు చెల్లించాలి. భూమిలేని వారందరికీ కుటుంబానికి నెలకు 2,500 రూపాయల చొప్పున ప్రత్యేకంగా రాజధానిలో పెన్షన్‌ ఇవ్వాలని నిబంధనలున్నాయి. ఏడేళ్లయినా పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క నయా పైసా పెంచలేదు. పారిశుధ్య కార్మికులకు, అంగన్వాడి ఇతర స్కీం వర్కర్లకు,వాలంటీర్లకు ఉద్యోగాలు ఉన్నాయనే సాకుతో ఇచ్చే పెన్షన్లు నిలిపివేశారు. పెన్షన్‌ ను ఐదు వేల రూపాయలకు పెంచుతామని వైసిపి హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. దళితులు, బలహీనవర్గాల నుండి అసైన్డ్‌ భూములు తీసుకొని గత ప్రభుత్వం ఇతరులతో సమానంగా కాకుండా తక్కువ ప్యాకేజీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరితో సమానంగా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. అసైన్డ్‌ రైతులు కొందరికి ఈ సంవత్సరం కౌలు కూడా నిలిపివేశారు. 2014 రాజధాని ఏర్పాటుకు ముందు అమరావతి లో నివసిస్తున్న ఇల్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చట్టంలోనే పేర్కొన్నారు. 5024 టిడ్కో ఇళ్లు కట్టి ఖాళీగా ఉన్నాయి. లక్ష రూపాయలు డిపాజిట్‌ చెల్లించారు. ప్రభుత్వం వాటిని కేటాయించటం లేదు. కూలీలు,పేదలకు ఉపాధి హామీ పనులు 365 రోజులూ చూపించాలని, వడ్డీ లేకుండా 25 లక్షల రూపాయలు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని, వృద్ధాశ్రమాలు, క్యాంటీన్లు ఏర్పాటు, ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు, ఉపాధి శిక్షణ తదితర అనేక అంశాలు చట్టం, నిబంధనలలో ఉన్నాయి. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వాటన్నిటినీ తక్షణమే అమలు చేయాలి.
రాజధాని ముక్కలు కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది. వికేంద్రీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. వికేంద్రీకరణ పేరుతో రాజధానిని ముక్కలు చేయడం సరికాదు. అమరావతి వివాదాన్ని తెచ్చి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి బుందెల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కడప ఉక్కు, కేంద్ర విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు తదితర అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టింది. ప్రజలు వద్దంటున్నా అణు విద్యుత్‌ ప్లాంట్‌ మాత్రం శ్రీకాకుళంలో పెడతానంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటు అమరావతి, ఇటు వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిని నిర్లక్ష్యం చేశాయి. ఒకదానితో మరొకదానికి పోటీ పెట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ప్రజలందరూ అటు అమరావతి, ఇటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఐక్య ఉద్యమాలు చేయాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు పొందాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
వివాదాలతో ప్రజలను బలి చేయవద్దు
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని వివాదానికి స్వస్తి పలకాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, అమలు చేస్తామని, రాజధానిగా అమరావతి నే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం అమరావతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. రైతులకు, ఇతర వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఉద్యమకారులపై, రైతులు,ప్రజల పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అమరావతిలో రాజధాని కొనసాగించాలని విధానానికి సిపిఎం కట్టుబడి ఉంది. హైకోర్టు రాజధానిలో భాగం కాదు. పరిపాలన, శాసనసభ, సచివాలయం ఇవన్నీ అమరావతి లోనే కొనసాగాలి. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలన్నది సిపిఎం వైఖరి. ప్రజా రాజధానిగా నమూనాలో మార్పు చేయవలసిన అంశాలలో తన అభిప్రాయాన్ని సిపిఎం చెబుతూనే, రాజధాని ప్రజల తరఫున నికరంగా నిలబడింది. గత ప్రభుత్వం రైతులు, కూలీలకు న్యాయం చేయనప్పుడు అనేక ఉద్యమాలు నడిపింది. వైసిపి ప్రభుత్వం యొక్క మూడు రాజధానులు చట్టాన్ని వ్యతిరేకించి అమరావతి రాజధానిగా కొనసాగించాలని విస్పష్టంగా ప్రకటించింది. కేంద్రం కపట నాటకాన్ని ప్రజలు ముందు ఎండగడుతోంది. ప్రజా సమస్యగా అమరావతి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు భవిష్యత్తులోనూ పోరు సాగిస్తుంది .
                                  రాజధాని వివాదానికి స్వస్తి పలకాలి

           సిహెచ్. బాబూరావు -  సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.