May 03,2023 12:37

ప్రజాశక్తి-నందిగామ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం రాత్రి సిపిఎం నాయకులను నందిగామ పోలీసులు ముందస్తుగా  హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కటార్పు గోపాలు,  సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, బత్తల కూరలాజరు తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా గురువారం ఉదయం నందిగామ గాంధీ సెంటర్లో కౌలు రైతు సంఘం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, పలు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్రమ అరెస్టులను నాయకులు ఖండించారు. సిపిఎం నాయకులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని, తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైల్వే, ఎల్ఐసి, భారత్ టెలికం తదితర  ప్రభుత్వ, పబ్లిక్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్కరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు కనీసం స్పందించకుండా మౌనవహించటం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సయ్యద్ లాల్ సలాం, ప్రజా సంఘాల నాయకులు వి రవిశేఖర్, బత్తుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, ఎర్ర శ్రీనివాసరావు, ఉప్పు శీను పలువురు నాయకులు పాల్గొన్నారు.