ఎ.కొండూరు మండలంలో డయాలిసిస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించాలి : ప్రజా ఆరోగ్య వేదిక
ప్రజాశక్తి-ఎ.కొండూరు : ఎ.కొండూరు మండలంలో కిడ్నీ జబ్బులు వేగంగా పెరుగుతున్నందున వెంటనే డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించాలని, అక్కడే వారానికి ఒకరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను చూసే విధంగా ఎ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నెఫ్రాలజిస్ట్ను నియమించాలని ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ్ ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కె సాయి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ్ ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ మామిడి సీతారామారావు, కోశాధికారి లీలా, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు తదితరులతో కూడిన ప్రజా ఆరోగ్యవేదిక బృందం ఎ.కొండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. ఆసుపత్రిలో ఉన్నా రోగులను, రోగుల బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లుగా ఏ కొండూరు ప్రాంతంలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఎ.కొండూరు లో డయాలిసిస్ సెంటర్ ను వెంటనే ప్రారంభించటం చాలా అవసరమన్నారు. మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని , వైద్యం కొరకు వారందరూ దూర ప్రయాణాలు చేయటం కష్టంగా మారింది. ఇక్కడే డయాలిసిస్ సెంటర్ ఉంటే రోగులకు సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. కిడ్నీ కేసులలో వ్యాధి ముదిరిపోయి డయాలిసిస్ వరకు రాక మునుపే వ్యాధిని అరికట్టేందుకు కృషి చేయాల్సుందని అన్నారు. వ్యాధి తీవ్రత పెరగక ముందే వైద్యం ఇవ్వగలిగితే అత్యధిక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అందుకొరకు వారానికో రోజు ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులను చూసే విధంగా నెఫ్రాలజిస్ట్ ను నియమించాలని కోరారు. ప్రస్తుతం మండలంలోని కొన్ని తండాలకు మాత్రమే కృష్ణా నది నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారని మండలంలోని అన్ని గ్రామాలకు వాటిని విస్తరించాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన కృష్ణా నది నీటిని అందించే ఏర్పాట్లను చేయాలని కోరారు. అప్పుడే ఫ్లోరైడ్, సిలికా ప్రభావం ప్రజలపైన పడదని, కిడ్నీ జబ్బులను నివారించగలమన్నారు.










