Mar 08,2022 07:07

     వర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ పథకాల పునరుక్తులతో నిండిపోయింది. ఏడాదికోమారు రాజ్‌పాల్‌ చేసే ప్రసంగం రాబోయే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ విధాన పత్రం కావాలి. సర్కారీ దశా దిశ ప్రజలకు బహిర్గతం చేయాలి. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగమే అయినప్పటికీ రేఖామాత్రమైనా ప్రభుత్వ భవిష్యత్‌ కార్యాచరణ గవర్నర్‌ ప్రసంగంలో లేదు. ఆడంబరాలకు, గొప్పలకు మాత్రం కొదవ లేదు. మాంద్యం, కరోనా ఏకకాలంలో ప్రజల జీవనోపాధిపై దాడి చేసిందని గగ్గోలు పెడుతుండగా 2020-21లో ఎపి తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగిందన్నారు. ప్రపంచ జిడిపి వృద్ధి 3 శాతం సైతం అనుమానమేనని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు కుండబద్దలు కొడుతుండగా, మన దేశ జిడిపి మైనస్‌ 7.3 శాతమని ఆందోళన పడుతుండగా, మన రాష్ట్ర జిడిపి వృద్ధి 0.22 శాతమని టముకేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఏ పూటకాపూటకు వెతుక్కోవాల్సిన దారుణ స్థితి అని, అప్పుల కుప్పలు కాస్తా కొండలవుతున్నాయని ఒక వైపు ప్రభుత్వమే చెబుతూ, మరోవైపు గవర్నర్‌ ప్రసంగంలో ఆ విషయాలకు ముసుగేసి, పారదర్శకతపై తమకే పేటేంట్‌ అనడం హాస్యాస్పదం. ఉద్యోగుల పిఆర్‌సిపై అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ రిపోర్టును మొన్నటి వరకు దాచిపెట్టడం సుపరిపాలన కాగలదా ?
    కోవిడ్‌లో కొన్ని వర్గాలకు, అదీ పలు కోతలతో చేసిన నగదు బదిలీలు ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నాయని ప్రభుత్వం చెప్పుకుంది. ఆ వాదనలో కొంత నిజమున్నా, ఈ కాలంలో పెరిగిన ధరలు, ప్రభుత్వం వేసిన భారాలు, ఉద్యోగ, ఉపాధిలేమి, జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రంలో ఆ రంగంలో సంక్షోభం తీవ్రమవుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కాదు కదా పెట్టుబడులు రాని దుస్థితి నెలకొంది. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గవర్నర్‌ ప్రసంగంలో రైతుల కడగండ్లు, కౌలు రైతులకు రక్షణ ప్రస్తావనకు సైతం రాలేదు. రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా నగదు సహాయమే సర్వస్వంగా పేర్కొనడం వాస్తవాల నుండి పక్కదారి పట్టించడమే. కోవిడ్‌తో విద్యావస్థ ధ్వంసం కాగా, నాడు-నేడును పొగుడూతూనే, విద్యార్ధులకు చదువును దూరం చేసే కేంద్ర నూతన విద్యా విధానాన్నే రాష్ట్రం తలకెత్తుకుంది. ఆంగ్ల మాధ్యమంపై ముందుకేనంది. ఉన్నత విద్య ప్రైవేటీకరణకు సై అంది. ప్రజారోగ్యంపై ఆరోగ్యశ్రీని చూపించి కార్పొరేట్‌ దారేనంది. ఇంధన రంగంలో గత ప్రభుత్వాలు చేసిన సంస్కరణలను పరుగులు పెట్టిస్తామంది. మహిళల అభివృద్ధిపై ఆకాశమే హద్దుగా చెప్పిన ప్రభుత్వం దశలవారీ మద్యపాన నిషేధం హామీ ఏమైందో చెపితే బాగుండేది. ఉద్యోగుల సిపిఎస్‌ రద్దు హామీ అంతే. స్కీం వర్కర్ల ఆందోళనలపై స్పందన లేదు. ఇళ్ల పథకంపై ఘనం పోయి, నిధుల లభ్యత, ఒటిఎస్‌, టిడ్కో ఇళ్ల వ్యవహారంపై వెల్లడించకుండా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుందో అర్థం కాదు.
    రాష్ట్రానికి కేంద్రం చేసిన విద్రోహం, వంచనపై గవర్నర్‌ మాట మాత్రం తెలపలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలైన వెనకబడ్డ ప్రాంతాల అభివద్ధి నిధులు, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు, పాశ్రామిక కేరిడార్లు, ఆంధ్రసీమ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం నిర్వాసితుల పరిహారంపై రాష్ట్ర వైఖరేంటో పేర్కొనలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొని దాన్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలని చెప్పలేదు. హైకోర్టు తీర్పు దరిమిలా రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏమీ చెప్పకుండా ఇంకా అయోమయాన్నే కొనసాగించింది. జిఎస్‌టి పరిహారం సహా పన్నుల్లో వాటాల పంపిణీలో వివక్ష, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల విడుదలలో జాప్యం, రాష్ట్రాల అధికారాల కబ్జా, ఇత్యాది ఫెడరల్‌ వ్యవస్థకు గండికొట్టే చర్యలను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దుతున్న వేళ ఆ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గవర్నర్‌ ప్రసంగంలో కాగడా వేసి వెతికినా కనిపించదు. నవరత్నాల చిట్టా తప్ప రాష్ట్రాభివృద్ధికి, ప్రజలందరి సంక్షేమానికి కనీస భరోసా లేదు.