Oct 24,2020 07:13

          పట్టణాలలో ప్రజలపై భారాలు ఎక్కువయ్యాయి. ఆస్తి పన్ను, విద్యుత్‌ చార్జీలు, యూజర్‌ చార్జీల పేరుతో భారాలు మోపడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు అంగీకరించి భారాలు మోపడానికి సిద్ధమవుతున్నది. ప్రతిఘటించకపోతే పౌర సదుపాయాల మనుగడ ప్రమాదంలో పడుతుంది.
         పట్టణాల అభివృద్ధికి ప్రజా సౌకర్యాల కల్పన అత్యంత ముఖ్యమైన అంశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ లక్ష్యంతోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పారిశుధ్య సౌకర్యం, ఉచితంగా మంచినీరు, రోడ్లు, విద్యుత్‌ మొదలగు సౌకర్యాలు కల్పించబడ్డాయి. పౌర సదుపాయాలు బాగా కల్పించడం ద్వారా వేగంగా పట్టణాల అభివృద్ధిని సాధించవచ్చని, పరిపాలనా కేంద్రంగాను, విద్య, వైద్య కేంద్రంగాను అభివృద్ధి కావడమే కాక పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయని నాడు భావించబడింది. పేదలు నివసించే ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటి కుళాయిలు వచ్చాయి. స్కూళ్లు, హాస్పిటళ్లు వచ్చాయి. మందులు ఉచితంగా ఇచ్చారు. ఇళ్ల స్థలాలను నల్ల డబ్బుతో అవసరానికి మించి కొనుక్కునే అవకాశం లేకుండా గతంలో సీలింగు విధించారు. ఇది కొందరికి స్థలాలు పొందే అవకాశం కలిగించింది.
           ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టణ ప్రజలను కార్పొరేట్‌ కంపెనీలు దోచుకోవడానికి వీలుగా పట్టణాల్లో పిపిపి ప్రాతిపదికన అద్దె ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతూ విధానాన్ని ప్రకటించింది. ఆస్తి పన్ను పెంచి పౌర సదుపాయాల ఖర్చు భారాన్నంతా ప్రజల మీద మోపుతోంది. యూజర్‌ చార్జీలు మరొక దొంతరే. చెత్తకు యూజర్‌ చార్జీలు, జనన, మరణ కాగితాలకు యూజర్‌ చార్జీలే. ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌, రోడ్డు ట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌, మార్కెట్‌ ట్యాక్స్‌ మొదలగు ఎన్నో రకాల పన్నులు స్థానిక సంస్థల పరిధి నుండి కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు పౌర సదుపాయాలన్నింటికీ అయ్యే ఖర్చునంతా ప్రజల మీద మోపడానికి కేంద్రం సిద్ధమైంది.
            స్థలం విలువ, భవనం విలువ లెక్కగట్టి ఆస్తి పన్ను విధించాలని కేంద్రం షరతు పెట్టింది. రాష్ట్రం అప్పులు తెచ్చుకోవాలన్నా, అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కేంద్రం షరతులు పాటించాలి. అలాగే మంచినీటి పంపులకు నీటి మీటర్లు వస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం జనం నెత్తిన వేసే విధానాలు వచ్చాయి. పట్టణాలలో ఇక పేదలకు కేంద్రం షరతుల ప్రకారం ఇళ్లు, ఇళ్ల స్థలాలు దొరకవు. కార్పొరేట్లు కట్టే అద్దె ఇళ్ళే గతి. లక్షల సంఖ్యలో ప్రభుత్వ స్థలాల్లో, కొండ పోరంబోకుల్లో ఇళ్ళు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలన్న డిమాండు పెండింగులోనే ఉన్నది. కేంద్ర షరతుల మేరకు కరెంటు చార్జీలూ పెరగనున్నాయి. రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థల నుండి వసూలు చేసిన పన్నులలో 40 శాతం వాటా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉన్నా అమలు చేయడం లేదు. రాష్ట్రాలకిచ్చే గ్రాంట్లు కోత పెట్టారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపపూనుకుంటున్నది.
            కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల పారిశుధ్యం, ప్రజారోగ్యం దెబ్బ తింటున్నది. మురుగు నీటి పారుదల, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, దోమల నివారణ అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. బ్రిటిషు ఇండియాలో పారిశుధ్య పాటింపుకు, దోమల నివారణకు మున్సిపల్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ కాలంలో ఈ లక్ష్యానికి ప్రభుత్వ విధానాలు దెబ్బ కొట్టాయి. అందరికీ ఇళ్లు, అందరికీ విద్య, వైద్యం, మంచి నీరు, రోడ్లు, విద్యుత్‌ సరఫరా ప్రభుత్వ బాధ్యత. పౌర సదుపాయాల కల్పనతోనే నగరాలు, పట్టణాలు అభివృద్ధి సాధ్యం.
            అరకొర సౌకర్యాలతో అస్తుబిస్తుగా ఉన్న నగరాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆటంకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఉన్న ఉపాధినీ దెబ్బ తీసింది. నూటికి యాభై మందికి ఉపాధి పోయింది. కార్మికులలో నూటికి తొంభై మందికి పైగా రకరకాల పనులు చేసుకునేవారే. ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర అసంఘటిత రంగంలో ఉన్న వారు పట్టణాలలో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కరోనా సహాయం అందిస్తామని బ్యాంకు అకౌంట్లు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనేలేదు. కనీస వేతనాల బోర్డు సిఫారసులతో దక్షిణాది రాష్ట్రాలలో కనీస వేతనాలు రూ.12 వేల నుండి రూ.18 వేల వరకు ఉంటే మన రాష్ట్రంలో అది రూ.5 వేలే. 15 సంవత్సరాల క్రితం నియమించిన కనీస వేతనాల బోర్డు రాష్ట్రంలో ఇప్పటికీ నియమించలేదు. పట్టణాలలో ఉపాధి తీవ్ర సమస్యగా ఉన్నది. షాపుల్లో పని చేసే వారికి 15 రోజులే ఉపాధి. వ్యాపారస్తులకు అమ్మకాలు తగ్గిపోయాయి. ఆదాయాలు తగ్గి అనేక వ్యాపారాలు దివాళా ఎత్తాయి. ఈ సమయంలోనే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాలలో ఈ కరోనా వైపరీత్యం వృత్తిదారులను, వ్యాపారస్తులను, ఆఖరుకు రైతులను ఎవరినీ వదల్లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి. ఆరు మాసాల పాటు కుటుంబానికి రూ.7,500, తలా ఒక్కింటికి 10 కిలోల బియ్యం ఇవ్వాలి. గ్రామాలలో వలే పట్టణాలలో కూడా ఉపాధిó హామీ పథకం ప్రవేశ పెట్టి పని దినాలు కల్పించాలి. ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి మీటర్లు ఆపాలి. నగరాలలో ప్రజల మీద భారాలు మోపడాన్ని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదు. బాధల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

( వ్యాసకర్త సిపి(ఐ)ఎం రాష్ట్ర కార్యదర్శి )

పెనుమల్లి మధు