Jul 30,2022 20:34

- విద్యుత్‌ మీటర్‌ రీడర్ల ధర్నా, ప్రదర్శన
ప్రజాశక్తి - ఏలూరు కల్చరల్‌ :తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీస్‌ రేట్‌ రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులో శనివారం విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇపిడిసిఎల్‌ సూపరిటెండెంటింగ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మీటర్‌ రీడింగ్‌కు రోజులను పెంచాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, డైరెక్ట్‌ పేమెంట్‌ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఎపి విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడారు. 20 ఏళ్లుగా విద్యుత్‌ సంస్థల్లో మీటర్‌ రీడర్లు ఎనలేని సేవలందిస్తున్నారని, కానీ సంస్థ మాత్రం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తోందని తెలిపారు. మీటర్‌ రీడింగ్‌ కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న మీటర్‌ రీడర్లకు వచ్చే ఆదాయం సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అధికారులు మాత్రం మీటర్‌ రీడర్లకు వస్తున్న ఆదాయాన్ని తగ్గించేలా నిర్ణయాలు చేయడం అన్యాయమన్నారు. స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెట్టే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఒ.శ్రీనివాస్‌, కోశాధికారి మల్లేశ్వరరావు, నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌, జాకబ్‌, దుర్గారావు పాల్గొన్నారు.