మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్ గాంగ్ మాట్లాడారు.'' మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్ రిపబ్లిక్ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.'' అని క్విన్ గాంగ్ చెప్పారు.
ఈ దశాబ్ది చివరినాటికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇటియాన్ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో చైనా విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.
సెమీకండక్టర్లు లేదా చిప్స్ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు. జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత సీ జింపింగ్ పిలుపునిచ్చారు. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తమ గతేం కాను అని అమెరికా, ఐరోపాలకు చెందిన బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !
ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హ్యువెయి టెక్నాలజీస్ సంస్ధకు అవసరమైన చిప్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అన్న ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్(అమెరికా) శాంసంగ్(దక్షిణ కొరియా, ఆర్మ్(బ్రిటన్) కంపెనీలకు సవాలు ఎదురైంది.
ప్రపంచంలో అత్యధికంగా సెమీకండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షింజియాంగ్ రాష్ట్రంలో ముస్లింలను అణచివేస్తున్నారని పశ్చిమ దేశాలు తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా విధించాయి.. తైవాన్‌ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్ నటుడు, అమెరికా రెజ్లర్ జాన్ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు. జెపి మోర్గాన్ బ్యాంకు సిఇఓ జామీ డైమన్ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారేసుకున్న సిఎన్‌ఎన్ తరువాత క్షమాపణలు చెప్పింది. షింజియాంగ్ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. బయటకు ఎన్ని వేషాలు వేసినా చైనాలోని విస్తారమైన మార్కెట్‌ను వదులుకోవడానికి అవి సిద్ధంగా లేవు. షింజియాంగ్ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, ఉంది. బీజింగ్‌లో దాని పరిశోధనా కేంద్రం ఉంది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచి ఆర్జించినదేనని మరచిపోరాదు.
రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చేశాయి.. ఇప్పుడు బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న చైనాను అడ్డుకొనేందుకు చిప్స్, సాంకేతిక పరిజ్ఞానం దానికి అందకుండా చేయాలని పశ్చిమ దేశాలు అన్ని రకాల కుతంత్రాలు పన్నుతున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీ లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగంలో సవాలు విసిరే స్థితికి వచ్చింది. జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ ఇప్పుడు చైనాను ఒంటరిపాటు చేయాలని చూస్తున్నాయి. . చైనా దీన్ని ముందుగానే పసిగట్టింది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్ చైనా 2025 కార్యక్రమం ఈ దేశాలను మరింత బెంబేలెత్తిస్తున్నది.
చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి అక్కడ జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు,.'' ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట '' అనే శీర్షికతో ఏపి వార్తా సంస్ధ తాజాగా ఒక వార్తా కధనాన్ని వెలువరించింది. అమెరికా నాలుగేళ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షలను సవాల్‌గా తీసుకుని చైనా సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పలు చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని పశ్చిమ దేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామన్నట్లుగా విర్రవీగిన ఈ దేశాలు. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నాయి.

ఎం. కోటేశ్వరరావు










