ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి నేడు ఎర్ర దండు కదలనుంది. సిపిఎం ఆధ్వర్యాన ఈనెల 15న విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభకు పయనమవుతున్నారు. మంగళవారం సాయంత్రం బస్సులు, రైళ్లలో బయలు దేరనున్నారు. ఎక్కువగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, చిరువ్యాపారులు, ప్రత్యేకించి మహిళలు కదిలేందుకు సిద్ధమౌతున్నారు. సిపిఎం కార్యకర్తలు, నాయకులు కూడా అధిక సంఖ్యలో కదలనున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు పూర్తయాయి. కొన్ని రైళ్లు రద్దు కావడంతో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాలంటీర్లుగా వ్యవహరిం చేందుకు ఇప్పటికే కొంతమంది విజయవాడకు చేరుకున్నారు.
అసమానతలు లేని అభివృద్ధి పేరిట సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను చేపట్టింది. గతనెల 30 నుంచి మూడు జాతాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ప్రారంభమైన ప్రజా రక్షణ భేరి యాత్ర పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, మక్కువ, సాలూరు, మెంటాడ, గజపతినగరం, బుడతనాపల్లి, బొడ్డవర జంక్షన్ల మీదుగా మూడు రోజులపాటు సాగింది. అటు శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన మరో యాత్ర పూసపాటిరేగ, విజయనగరం, భీమిసింగి, జామి మీదుగా ఎస్.కోట, కొత్తవలస వరకు సాగింది. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న సిపిఎం నాయకులకు వివిధ వృత్తులు, సామాజికవర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చిరుద్యోగులు, స్కీమ్‌వర్కర్లు, కార్మికులు, గిరిజనులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను ఏకరువు పెడుతూ పరిష్కారానికి పాలకులపై పోరాడాలంటూ విన్నవించారు. ఇందుకు సిపిఎం నాయకులు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాత్రల ముగింపు సందర్భంగా విజయవాడలో సిపిఎం ఆధ్వర్యాన జరుగనున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలంటూ నాయకులు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో సభను జయప్రదం చేయసేందుకు జిల్లాల్లో సిపిఎం నాయకులు ఆటో, బైకు ప్రచారాలు చేపట్టారు. పలుచోట్ల ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఫలితంగా జనంలో సిపిఎం చూపుతున్న ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఎం శ్రేణులతోపాటు అభిమానులు, వివిధ తరగతులకు చెందిన ప్రజానీకం విజయవాడకు పయనమౌ తున్నారు. పలు రైళ్లు రద్దు కావడంతో విజయనగరం, గరివిడి ప్రాంతాల నుంచి రెండు ప్రత్యేక బస్సులు బయలదేరనున్నాయి. వీటిని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ మంగళవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించ నున్నారు. మిగిలినవారు అందుబాటులో ఉన్న రైళ్లు, ఆర్టిసి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కదిలేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. అటు పార్వతీపురం జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో కదల నున్నారు. పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కదిలేందుకు సన్నద్ధమయ్యారు. అటు గిరిజన ప్రాంతం, ఇటు మైదాన ప్రాంతం నుంచి కూడా పయనమౌతున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు స్పష్టం చేశారు. సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరు కానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రత్యామ్నాయ విధానాలు ఉంచడంతో పాటు ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి, పాలకులకు హెచ్చరిక చేస్తారని నాయకులు చెబుతున్నారు. ప్రజలకు జరుగుతున్న కష్టనష్టాలపై మరో పోరుకై పార్టీ కేడర్‌కు దశ, దిశ నిర్ధేశం చేయనున్నారు. ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తోటపల్లి, జంఝావతి, తారకరామ తీర్థసాగర్ పూర్తికి నిధులు కేటాయించాలని ఇటీవల జిల్లాలో సాగిన ప్రజారక్షణ భేరీ యాత్రలో బృందం నాయకులు డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం, పీసా, 1/70 చట్టం పరిరక్షణకు పోరాడుతామని గిరిజనులకు హామీ ఇచ్చింది. జ్యూట్, ఫెర్రో ఎల్లాయీస్, చక్కెర తెరిపించాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టంలో భాగంగా ఏడాదికి 200రోజులు పని కల్పించడంతోపాటు రోజుకు రూ.600 వేతనం అందజేయాలని కోరింది. ఇలా ప్రాంతం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తించిన అనేక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా పోరాటాలు నడుపుతామని సిపిఎం నాయకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బహిరంగ సభకు మంచి స్పందన లభిస్తోంది.