ప్రజాశక్తి- జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్ (తాడేపల్లి) :జాతీయోద్యమ కాలం నుంచి ఉద్యమాలకు అడ్డాగా ఉన్న గుంటూరు జిల్లాలో జరుగుతున్న సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మించే ప్రజా పోరాటాలకు వేదిక కావాలని సిపిఎం 26వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్ (సిఎస్‌ఆర్ కళ్యాణ మండపం)లో జరుగుతున్న మహాసభల ప్రారంభ సభలో కృష్ణయ్య స్వాగతోపన్యాసం చేశారు. మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, కొరటాల సత్యనారాయణ, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వేములపల్లి శ్రీకృష్ణ లాంటి కమ్యూనిస్టు యోధులను అందించిన గుంటూరు జిల్లాలో 900 ఏళ్ల క్రితమే సామాజిక వివక్షను రూపుమాపేందుకు పల్నాడులో బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతంతో సహపంక్తి భోజనాలకు శ్రీకారం చుట్టారన్నారు. కన్నెగంటి హనుమంతు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, గుర్రం జాషువా లాంటి ఉద్దండులకు నిలయమైన ఈ జిల్లాలో 1935లోనే కమ్యూనిస్టు ఉద్యమానికి శ్రీకారం జరిగిందన్నారు. చల్లపల్లి జమీందారీ వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు జమీందారీ దోపిడీ నుంచి విముక్తి పొందారన్నారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి పూర్తి స్థాయిలో అండదండలు ఈ ప్రాంతం నుంచి అందాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం, పొగాకు రైతుల సమస్యలపై వీరోచిత ఉద్యమాలు నడిచాయన్నారు. ఇప్పుడు మహాసభలు జరుగుతున్న ఈ తాడేపల్లిలోనూ బలమైన కమ్యూనిస్టు ఉద్యమం నిర్మితమై ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఎర్రజెండాను పటిష్టం చేయడం కోసం మేకా అమరారెడ్డి, బండారు ముత్యాలు, వెన్నపూస మాలకొండారెడ్డి రక్తతర్పణం చేశారని తెలిపారు. అలాంటి కమ్యూనిస్టు యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో బలమైన ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్మించాలన్నారు.










