Nov 24,2022 21:53

రైతుసంఘం, సిఐటియు నాయకులతో గోడు వెల్లబోసుకుంటున్న రైతులు

         ప్రజాశక్తి-కనగానపల్లి   'సాగు చేస్తుంటే కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు.. పెట్టుబడులు ఎక్కువయ్యాయి.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు.. చేసేది లేక సోలార్‌ ప్రాజెక్టుకు భూములను లీజుకు ఇస్తున్నాం..' అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జె.వి రమణ, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తల కదిరప్ప నేతత్వంలో గురువారం మండల పరిధిలో సోలార్‌కు భూములు సేకరిస్తున్న గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ పదేళ్లుగా పంటలు లేక.. పెట్టిన పెట్టుబడులు రాక.. నష్టపోయి వ్యవసాయం బరువై సోలార్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి అంగీకరిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సిన వనరులు, రాయితీ పనిముట్లు, సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఈనేపథ్యంలో సోలార్‌పవర్‌ ప్రాజెక్టుకి భూమి ఇస్తే సంవత్సరానికి రూ.30వేలు ఇస్తామని చెబుతున్నార తప్ప గ్రామాల్లో ఎక్కడా రైతులను కూర్చోబెట్టి చర్చించి అభిప్రాయ సేకరణ చేయలేదన్నారు. మరోవైపు బోర్లు బావులు, పలు వక్షాలకు అంచనా వేయకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రధానంగా పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకోవడానికి వందల ఎకరాలు భూమి కోల్పోయిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధి స్పందించి పరిహారం ఇప్పిచ్చే విధంగా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నామాల నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.