రెండవ దశ కరోనా మార్చి నుంచి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ కార్యక్రమాల్లో కూరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమగమై...ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించాయి. అధికారం కోసం సకల ప్రయత్నాలు చేసి, దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది పైబడి మరణాలకు కారణం అయ్యాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కరోనా నియమాలను తుంగలో తొక్కారు. కనీసం మాస్కులు ధరించకుండా పైస్థాయి నాయకుల నుంచి కింది స్థాయి వరకూ ఎన్నికల సభలు, ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. దేశ, విదేశాల్లో మన పాలకులు దోషులుగా నిలబడ్డారు. కనీసం అందరికీ 'వ్యాక్సినేషన్' సకాలంలో అందించే విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడం అత్యంత గర్హనీయం.
ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిన సమయంలో మన రాష్ట్రం లోని 13 జిల్లాలలో ప్రజా సంఘాలు 24 ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. సుమారు 6500 మంది ప్రాణాలు కాపాడి ప్రాణదాతలుగా నిలబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ కేంద్రాల నిర్వహణ లోను, ఆర్థిక తోడ్పాటు అందించడం లోను చురుకైన పాత్ర పోషించింది. కొన్ని చోట్ల తమ కార్యాలయాలనే ఐసొలేషన్ సెంటర్లుగా మార్చి సేవలు అందించారు. వీరితోపాటు ఎస్.ఎఫ్.ఐ, సిఐటియు, అంగన్వాడీ, ఐద్వా...తదితర ప్రజా సంఘాల కార్యకర్తలు, ఉపాధ్యాయులు సైతం సేవలు అందించారు. రోగులను అక్కున చేర్చుకుని...చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి పంపారు. కరోనా సోకిన వారిని, కొన్నిచోట్ల తమ కుటుంబ సభ్యులే ఇంట్లోకి రాకుండా బహిష్కరిస్తున్న సమయమిది. ఈ క్లిష్ట సమయంలో ప్రజాసంఘాలు మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలే పెద్ద దిక్కుగా నిలబడి, ఆపన్నహస్తం అందించడం పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
కోవిడ్ రెండో దశ విలయం ధాటికి ప్రత్యేకించి ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది పైబడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం. దీనిని దృష్టిలో ఉంచుకొని నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఐసొలేషన్ కేంద్రాలకు భారీ విరాళాలు ప్రకటించి...సామాజిక స్పృహతో, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి పలువురి ప్రాణాలు నిలిపారు. అదే విధంగా వివిధ ప్రజా సంఘాల వారు తమ వంతు సహాయ సహకారాలు అందించి, ఐసొలేషన్ కేంద్రాలు జయప్రదం కావడానికి కారణమయ్యారు. ప్రజాసంఘాల నాయకులు, పి.డి.ఎఫ్ ఎమ్మెల్సీలు పలు కేంద్రాలను దర్శించి, కోవిడ్ రోగులలో మనోధైర్యం నింపారు.
ఇక ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో కోవిడ్ మూడవ వేవ్ విరుచుకు పడబోతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని రాబోయే ఉపద్రవాన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఆస్పత్రుల నిర్మాణం, బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు, డాక్టర్లు, నర్సులు, మందులు, వంటివి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా చేయాలి. అదే సమయంలో కర్ఫ్యూలు లాక్‌డౌన్లు ఎత్తివేశారని ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగరాదు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువగా గుమిగూడరాదు. అవసరమైన మేరకే ప్రయాణాలు చేయాలి. ఈవిధంగా ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో పని చేసినప్పుడు మాత్రమే ఈ కరోనా మహమ్మారిని పారదోలగలం. ప్రశాంతంగా జీవించగలం.
/ వ్యాసకర్త సెల్ : 9948272919 /
ఐ. ప్రసాదరావు











