కోవిడ్ మహమ్మారితో దేశమంతటా విషాదం ఆవరించివున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ క్రోనీల సేవ లోనే నిత్యం తలమునకలౌతోంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ప్రయత్నాలను వేగవంతం చేయడం కూడా ఇందులో భాగమే. ఉక్కు ప్రయివేటీకరణ లావాదేవీల వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఒక సలహాదారు, ఈ విషయంలో న్యాయ చిక్కులు తొలగించేందుకు ఇంకొక సలహాదారు కావాలంటూ బిడ్‌లను ఆహ్వానించింది. బహుశా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు బలిపెట్టడంలో నైపుణ్యత ప్రధాన అర్హత అయివుండవచ్చు. అర్హత కలిగియున్న సంస్థల కోసం ఈ నెల 15న ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ధరఖాస్తుకు 28 ఆఖరి తేదీ. 29న బిడ్‌లను తెరిచి సలహాదారులను ఎంపిక చేస్తారు. ముంచుకొచ్చిన ప్రకృతి విపత్తులను ఎదుర్కోడానికి ఇంతటి పకడ్బందీ వ్యూహంతో మోడీ సర్కార్ ఏనాడూ కదిలింది లేదు. కోవిడ్ విషయంలోనూ న్యాయస్థానాలు పదేపదే చీవాట్లు పెడితే కానీ చలనం రాలేదు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ, నగర పాలక ఎన్నికల్లో బిజెపి ని జనం చీకొట్టారు. విశాఖ నగర పాలక సంస్థలో కనీసం చోటు కూడా లేకుండా ఓడించినా దానికి బుద్ధిరాలేదు. ప్రజాస్వామ్య విలువలకు ఏనాడో వలువలొదిలేసిన బిజెపి చట్టసభల నిర్ణయాలను కూడా గౌరవించడం లేదు. విశాఖ ప్రయివేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని వామపక్షాల చొరవతో విశాఖ నగర పాలక మండలి ఏకగ్రీవంగా తొలి తీర్మానం చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తూ శాసనసభ కూడా తీర్మానం చేసింది. ప్రజాస్వామ్య దేవాలయాలుగా పరిగణించే ఈ చట్టసభల తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం కనీసంగానైనా పట్టించుకోకపోవడం కేంద్ర ఏకపక్ష నిరంకుశ వైఖరికి నిదర్శనం.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కదలాల్సినరీతిలో కదలడం లేదన్న విమర్శలూ సహేతుకమైనవే. నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు విశాఖలో ర్యాలీ నిర్వహించిన ఆ పార్టీ నేతలు ఎన్నికల తర్వాత కాడి పడేశారు. శాసనసభలో తీర్మానం చేయడం, ప్రధానమంత్రికి లేఖలు రాయడంతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని నిలదీసే చర్యలకు ఉపక్రమించకపోవడమే ఇప్పుడీ దుస్థితికి కారణం. నూతన విద్యావిధానం, మున్సిపల్ సంస్కరణల విషయంలో కేంద్రం చెప్పిందే తడవుగా చేసుకుపోతుండటం వల్లే అలుసైపోతున్నామన్న సంగతిని కూడా వైసిపి ప్రభుత్వం గుర్తించితీరాలి. ప్రత్యేక హోదా విషయంలో నాటి టిడిపి ప్రభుత్వం కూడా ఇలాగే మీనమేషాలు లెక్కించి ఎన్నికల వేళ 'ఉత్తర కుమార' ప్రగల్భాలతో ప్రజాక్షేత్రంలో భంగపడిన వాస్తవాన్ని ప్రస్తుత పాలకులు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పురుడుపోసుకున్న టిడిపి ఎంత సేపూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంలోనే పబ్బం గడుపుకుంటోందే మినహా విశాఖ స్టీల్ ప్రయివేటీకరణలో అసలు దోషిగా నిలబడ్డ బిజెపి ని పల్లెత్తు మాట అనడం లేదు. సరికదా..ఇటీవల జరిగిన మహానాడులో బిజెపి కి అంశాలవారీ మద్దతు ఇస్తామంటూ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. ఈ మద్దతు దేనికోసం. రాజధాని నిర్మాణానికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చినందుకా? విశాఖ స్టీల్‌ను ప్రయివేటుకు బలిపెడుతున్నందుకా? అనేది టిడిపి చెప్పాలి. ఇప్పటికైనా టిడిపి, వైసిపి లు రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తున్న బిజెపి ని నిలదీసే చర్యలకు పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాలను కలుపుకొని కేంద్రంపై పోరుకు సిద్ధమవ్వాలి. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడమే. ఇది అన్ని పార్టీల బాధ్యత.
విశాఖ ఉక్కు ప్రయివేటు కత్తికి బలైపోకుండా పరిరక్షించుకునేందుకు నడుం బిగించి పోరాడుతున్నది మాత్రం కార్మికులే. అఖిలపక్ష కార్మిక సంఘాల పోరాట కమిటీ దీక్షలకు రేపటి ఆదివారంతో 150 రోజులు పూర్తి కానున్నాయి. అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సాగుతున్న దీక్షలు కూడా నేటితో వంద రోజులు పూర్తి చేసుకోనున్నాయి. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పోరాట దీక్ష పట్టు సడలకుండా సాగించడం ద్వారా నాటి 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' మహోజ్వల ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయం. పోరుబాటే ఇప్పుడు శరణ్యం. ఆ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలి.










