పొదుపు మహిళలు తోడ్పాటు అందించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : గ్రామాల అభివృద్ధికి పొదుపు మహిళలు తోడ్పాటు అందించాలని ఎపిఎం ఖాజా రహంతుల్లా పేర్కొన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో పొదుపు మహిళలతో పాటు సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులపాటు వినూత్నంగా జరిగే జాతీయ విజన్ కార్యక్రమంలో పొదుపు మహిళలు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు, ఐదు సంవత్సరాల తర్వాత గ్రామాల అభివృద్ధి విజయం తెలుసుకునేలా ఆవగాహన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. మహిళలు కేవలం పొదుపుపై కాకుండా సామాజిక స్పృహపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మండల మొత్తం 865 పొదుపు గ్రూపులు కలవని, అందులో 150 గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణం మంజూరు చేయించామన్నారు. స్త్రీ నిధి పథకంతో రూ.80 లక్షలు పొదుపు మహిళలకు అందించామన్నారు. ప్రభుత్వం అందించే పావలా వడ్డీ, 0 వడ్డీ సభ్యులందరికీ చేరాయన్నారు. నాలుగు రోజులు పాటు జరిగే జాతీయ విజన్ కార్యక్రమానికి మండలంలోని పోదుపు సభ్యులందరూ తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో సిసిలు సంఘ బంధం, సంఘమిత్ర, కార్యవర్గ సభ్యులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.










