Jul 16,2021 06:11

   మ్మడి రాష్ట్ర ఉపాధ్యాయ నియామకాలలో '2008 డిఎస్‌సి' సుమారు 52 వేల పోస్టులతో పెద్ద డిఎస్‌సి గా చరిత్రకెక్కింది. ఈ డిఎస్‌సి ఉపాధ్యాయుల నియామకాలకూ సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉంది. ప్రభుత్వ విధానాల కారణంగా ఈ డిఎస్‌సి కోర్టులపాలైంది.
 

                                                              నియామకాలకై పోరాటం

    2008 డిఎస్‌సి నియామక ఉత్తర్వులు ఇప్పించాలని సుదీర్ఘకాల పోరాటం జరిగింది. నాడు ఉమ్మడి రాష్ట్ర యు.టి.ఎఫ్‌ కార్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగా చేసుకొని నిరంతరం ధర్నాలు, చలో సెక్రటేరియట్లు, అరెస్టులు జరుగుతూ ఉండేవి. నోటిఫికేషన్‌ ప్రకారమే నియామకాలు చేయాలని యుటిఎఫ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాడు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఏడుగురు ఈ పోరాటానికి మద్దతునిచ్చారు. 2008 డిఎస్‌సి నోటిఫికేషన్‌లో గతంలో వలెనే ఎస్‌.జి.టి పోస్టులకు డి.ఎడ్‌, బి.ఎడ్‌ అభ్యర్థులకు రాత పరీక్షకు అర్హత కల్పించారు. నియామకాలకు వచ్చేసరికి ఎస్‌.జి.టి పోస్టులు డి.ఎడ్‌ వారికి మాత్రమే ఇవ్వాలనే వివాదం రాజుకుంది. దీనికి జాతీయ విద్యామండలి మార్గదర్శకాలు, డి.ఎడ్‌, బి.ఎడ్‌ కాలేజిల మేనేజిమెంట్లు, అభ్యర్ధుల ప్రయోజనాలతో వివాదాల పాలైంది. కేసులు నడిచాయి. హైకోర్టు కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు...హైకోర్టు తీర్పుకు అనుకూలంగా చెబుతూ హైకోర్టు లోనే ప్రొసీడ్‌ కావాలని చెప్పింది. ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ కూడా నోటిఫికేషన్‌ ప్రకారం భర్తీ చేయాలని చెప్పింది. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు 161 మరియు 27 ప్రకారం కామన్‌ మెరిట్‌ లిస్టు, సెలక్షన్‌ లిస్టు తయారుచేసి సెలెక్టయిన వారికి వెరిఫికేషన్‌ కూడా పూర్తిచేశారు. మళ్ళీ ప్రభుత్వం జీవో 28 ఇచ్చి 30:70 రేషియోలో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం 30 శాతం పోస్టులు డి.ఎడ్‌ మెరిట్‌ వారితో భర్తీ చేసి, 70 శాతం డి.ఎడ్‌, బి.ఎడ్‌ కామన్‌ మెరిట్‌తో భర్తీ చేయాలి. ఈ ఉత్తర్వులు కూడా అమలు కాలేదు. చివరకు ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు 70:30 రేషియోలో నియామకాలకు ప్రభుత్వం నిర్ణయించింది. 70 శాతం డి.ఎడ్‌., బిఎడ్‌ కామన్‌ మెరిట్‌తో భర్తీ చేసి తదుపరి 30 శాతం డి.ఎడ్‌ వారికి మాత్రమే ఇవ్వడం వలన డి.ఎడ్‌ అభ్యర్ధులు అతి తక్కువ మార్కులు (ఉదా: మెదక్‌ జిల్లాలో 4.5 మార్కులు) వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారు. దీనివలన బి.ఎడ్‌ మెరిట్‌ అభ్యర్ధులు ఉద్యోగాలు కోల్పోయారు. తమకు న్యాయం చేయాలని అప్పటి నుండి ఆందోళన చేస్తూ వచ్చారు.
 

                                                        హామీ పత్రాల ద్వారా నియామకం

    నాడు వై.యస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శిగా వున్న సి.బి.ఎస్‌ వెంకటరమణ ఒంటి చేత్తో 52 వేల డిఎస్‌సి లెక్కలు తయారు చేశారు. ఒకేసారి వీటిని తయారు చేయడంతో లెక్కలు తప్పాయి. క్షేత్రస్థాయిలో డిఎస్‌సి కి సరిపడ పోస్టులు ఖాళీలు లేకుండా పోయాయి. దీనివలన మిగిలిపోయిన అభ్యర్ధులకు హామీపత్రాలు ఇచ్చి నియామకాలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, అభ్యర్ధులు పోరాటం చేసి నియామకాలు సాధించారు. రెగ్యులర్‌ ఖాళీలు ఏర్పడినప్పుడల్లా రెగ్యులర్‌ పోస్టులలో వీరిని నియమిస్తూ వచ్చారు. హామీ పత్రాలతో నియామకమైన వారికి వేతన వ్యత్యాసం రావడంతో ఉపాధ్యాయ ఉద్యమ పోరాట ఫలితంగా వారికి వేతన రక్షణ కల్పించడం జరిగింది.
 

                                   ముప్పై శాతం డి.ఎడ్‌ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థుల పోరాటం

    ముప్పై శాతం మొత్తం డి.ఎడ్‌ కోటాతో భర్తీ చేయడం వలన నష్టపోయిన బి.ఇడి అభ్యర్ధులు ఉమ్మడి రాష్ట్రం లోనూ, రాష్ట్ర విభజన తర్వాత పోరాడుతూనే వచ్చారు. చివరకు ప్రభుత్వం 2018లో కమిటీ వేసింది. తదుపరి అధికారుల కమిటీ సమీక్ష చేసి టైమ్‌ స్కేలులో వీరి నియామకాలు చేయాలని నాడు నిర్ణయించింది. దీని అమలుకోసం మళ్ళీ అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరికి 2021 జులై 11వ తేదిన 2193 మందితో అంగీకార పత్రం ఇచ్చినవారు జాయిన్‌ కావడంతో '2008 డిఎస్‌సి' కథ కంచికి చేరింది. అయినా లిస్టుల తయారీలో లోపాలు జరిగాయని, జాయిన్‌ కానివారి ఖాళీలను మెరిట్‌లో ఉన్నవారితో భర్తీ చేయాలని మరికొందరు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిఎస్‌సి కోర్టు కేసు ఉమ్మడి హైకోర్టు హైదరాబద్‌లో విచారణ జరుగుతున్నది. జులై 22న తుది తీర్పు వెలువడవచ్చు.
 

                                                        ప్రభుత్వం గుణపాఠం నేర్వాలి

    2008 డిఎస్‌సి కి సంబంధించి నోటిఫికేషన్‌కు కట్టుబడి నియామకాలు చేసి వుంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. ప్రభుత్వం నోటిఫికేషన్‌కు భిన్నంగా వచ్చిన వాదనల వైపు ఒరిగిపోయింది. దీనితో ఈ సమస్య పరిష్కారం క్షిష్టతరంగా మారింది. 2008 డిఎస్‌సి తరువాత కూడా నోటిఫికేషన్లు వివాదాలకు తావివ్వడంతో అనేక కోర్టు కేసులు వచ్చాయి. 2002 తర్వాత జరిగిన డిఎస్‌సి లకు పాలకులు ఎవరైనా 2, 3, 4 సంవత్సరాల గ్యాప్‌తో నోటిఫికేషన్లు ఇస్తూ వచ్చారు. నోటిఫికేషన్ల తర్వాత నియామకాలకు రెండేళ్ళు, మూడేళ్ళు పట్టింది. 2018 డిఎస్‌సి కి మూడేళ్ళు గడిచినా తెలుగు పండితుల నియామకాలు నేటికీ జరగలేదు. నోటిఫకేషన్లకు అమలుకు గ్యాప్‌ ఏర్పడి పాఠశాల విద్యా శాఖలో ఎప్పుడూ ఖాళీలు ఖాళీలుగానే వుండిపోతున్నాయి. నోటిఫికేషన్లలో లోపాలు, స్పష్టత లేకపోవడం, వివాదాలకు తావుండడం, కోర్టు కేసులు సత్వర పరిష్కారానికి ప్రభుత్వాలు శ్రద్ధపెట్టక పోవడంతో డిఎస్‌సి నియామకాలలో విపరీత జాప్యం జరగుతుంది. నేడు పాఠశాల విద్యాశాఖలో సుమారు 25 వేల పోస్టులు ఖాళీలున్నా డిఎస్‌సి ప్రకటించకుండా పాఠశాల విద్యను ముక్కలు, విలీనం చేసే పనిలో ప్రభుత్వం వుంది.
 

                                                        కఠిన షరతులతో నియామకాలు

    2008 డిఎస్‌సి మినిమం టైంస్కేలులో చేరిన ఉపాధ్యాయులు వెంటనే రెగ్యులర్‌ స్కేలు అడుగుతారని, మళ్ళీ కోర్టులకు వెళతారని... ప్రతి ఏడాది కటాఫ్‌ సర్వీసుతో, బాండ్‌ పేపర్‌పై కండిషన్లతో నియామక ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఈ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మినిమం టైంస్కేలుతోనే గొప్ప న్యాయం చేసినట్లు ప్రభుత్వాలు భావిస్తే... పదకొండేళ్ళ సర్వీసు పోగొట్టుకున్న అభ్యర్ధుల నష్టం మాటేమిటి? వీరివి దొడ్డిదారి నియామకాలు కాదు. పదకొండేళ్ళ క్రితం జరగాల్సిన నియామకాలు. ఈ నియామకాలు ఉపశమనమే తప్ప పూర్తి న్యాయం చేసినట్టు కాదు. జరిగిన నష్టం ఏమైనా కాలానుగుణంగా వారికి సమన్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెగ్యులర్‌ జీతాలతోపాటు అన్ని రాయితీలు వీరికి వర్తింపచేయాలి.
    డిఎస్‌సి చరిత్రలో ఈ నియామకాలు సుదీర్ఘ పోరాటాలతో సాధించిన విజయంగా చూడాలి. పట్టు విడవని పోరాటాలతో, కోర్టు ఆదేశాలతో పాలకుల, అధికారుల మెడలు వంచి సాధించిన విజయంగా చూడాలి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విధులలో చేరిన ఉపాధ్యాయులకు పిడియఫ్‌ ఎమ్మెల్సీల తరఫున శుభాకాంక్షలు. సంతృప్తికరమైన బోధనతో పిల్లలు, సమాజం అభిమానించే విధంగా మంచి ఉపాధ్యాయులుగా రాణించాలని, గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం.
 

/ వ్యాసకర్త ఎమ్మెల్సీ /
ఐ.వెంకటేశ్వరరావు

ఐ.వెంకటేశ్వరరావు