Nov 10,2023 20:23

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  ఎటువంటి తప్పులూ లేకుండా, అత్యంత పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్‌డిఒలు, వివిధ మండలాల తాహశీల్దార్లతో శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అక్టోబరు 31వరకు వచ్చిన క్లెయిములన్నిటినీ పది రోజుల్లో విచారణ జరపాలని చెప్పారు. ఫారమ్‌ 6 సుమారు 5,100, ఫారం ఏడు 4668, ఫారమ్‌ 8 లు 1569 పెండింగ్‌ ఉన్నాయని చెప్పారు. క్లెయిములు పెండింగ్‌ ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న క్లెయిములు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటవెంటనే కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ఒకే డోర్‌ నెంబరుతో ఉన్న ఓట్లు, ఒకే ఇంటిలో పదికి పైగా ఉన్న ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి, విచారణ జరపాలని ఆదేశించారు. పై పోర్షన్‌, ప్రక్కపోర్షన్‌లో ఉంటున్నవారికి వేరే డోర్‌ నంబరు కేటాయించాలని సూచించారు. ఓటు తొలగించేముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. కళాశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్ధిని కూడా వదలకుండా ఓటుహక్కు కల్పించాలని చెప్పారు. ఓటర్లలో సుమారుగా 3.5 శాతం మంది 18 లేదా 19 ఏళ్ల వారు ఉంటారని, ఈ నిష్పత్తి ప్రకారం మన జిల్లాలో యువ ఓటర్లు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నియోజకవర్గ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.