Jan 07,2022 07:07

ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పి.ఆర్‌.సి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చేతికి నివేదిక చేరి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ఉలుకూ, పలుకూ లేదు. బకాయి డీఏ లు, పి.ఆర్‌.సి, అమలు, సి.పి.ఎస్‌ రద్దు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సమస్యలపైనా అడుగులు ముందుకు పడటం లేదు. గురువారం నాడు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నా పరిష్కారం లభించలేదు.

    త్వరలో పి.ఆర్‌.సి ప్రకటిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఊరిస్తున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందోనన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో నెలకొంది. ప్రభుత్వ పెద్దలతో వ్యవహరిస్తున్న వివిధ సంఘాల నాయకత్వాల వ్యవహార శైలిపైనా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఉద్యోగులపై హామీల వర్షాన్ని కురిపించిన వైసిపి నాయకత్వం ఆ హామీలను అమలు చెయ్యకపోగా, వేతనాలు, పెన్షన్ల ఖర్చు గురించి ఉద్యోగ వర్గాలపై నిందలు మోపుతున్నది. అసత్యాలు ప్రచారం చేస్తోంది. నేడు ప్రభుత్వోద్యోగులు, సి.పి.ఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లు కోరుతున్నవన్నీ ఎన్నికల ముందు వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలే. ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. ఉద్యోగుల డిమాండ్లలో కొత్తవేమీ లేవు. ఇచ్చిన హామీలను అమలు చెయ్యాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది.
 

                                                    జగన్‌ హామీలు నీటిపై రాతలేనా ?

''మాట తప్పను మడం తిప్పను'' అంటూ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా మన ప్రభుత్వం వచ్చాక కరువు భత్యానికి వాయిదాల జిడ్డు ఉండదన్నారు. కాల దోషం పట్టకుండా వేతన సవరణ చేసి, ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. వారంలో సి.పి.ఎస్‌ రద్దన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సిగ్‌ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు, అర్హత, సీనియార్టీ ప్రాతిపదికన రెగ్యులరైజేషన్‌, ఆధునిక బానిసత్వానికి అసలు సిసలు నమూనాగా నిలిచిన ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థకు చెల్లు చీటీ పలుకుతామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మీరు రెగ్యులరైజ్‌ చేయలేకపోతే చెప్పండి. మా ప్రభుత్వం వచ్చి వారినందర్నీ రెగ్యులరైజ్‌ చేస్తుందంటూ అసెంబ్లీ లోనే టిడిపి అధినేత చంద్రబాబుకు సవాలు విసిరారు. కాని ఆచరణలో ఏం జరిగింది? వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాల పేరుతో అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా పరుగు తెప్పించే అధికారుల జులుం ఉండదని, ప్రతి ఉద్యోగి సాయంత్రానికి ఇంటికి చేరి భార్యా బిడ్డలతో సంతోషంగా గడిపే రోజులు తీసుకు వస్తామన్నారు. అధికారం లోకి వచ్చాక పోలీసులకూ ఆదివారం సెలవన్నారు. కాని నేటి పరిస్థితి ?
 

                                                       మాట తడబడుతోందా ?

2018 జులై ఒకటితో 10వ పి.ఆర్‌.సి గడువు పూర్తయ్యింది. అశుతోష్‌ మిశ్రా కమిటీ దాదాపు 2 సంవత్సరాల అధ్యయనం తరువాత అక్టోబర్‌ 5, 2020న పి.ఆర్‌.సి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పి.ఆర్‌.సి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి చేతికి నివేదిక చేరి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ఉలుకూ, పలుకూ లేదు. బకాయి డీఏ లు, పి.ఆర్‌.సి, అమలు, సి.పి.ఎస్‌ రద్దు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సమస్యలపైనా ముందుకు అడుగులు పడటం లేదు. గురువారం నాడు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నా పరిష్కారం లభించలేదు.
    వాస్తవంగా గత ప్రభుత్వాలు సక్రమంగా పి.ఆర్‌.సి లు ఇచ్చి ఉంటే నేడు ఉద్యోగులు 13వ పి.ఆర్‌.సి ని అందుకోవాలి. పాలకుల తాత్సారం వల్ల నేడు 11వ పి.ఆర్‌.సి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే ఉద్యోగులు 2 పి.ఆర్‌.సి లు, 10 సంవత్సరాల సమయం కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్‌.సి నివేదికపై మళ్ళీ అధ్యయనం చెయ్యాలంటూ కమిటీని నియమించింది. ఫలితంగా 11వ పి.ఆర్‌.సి అందని ద్రాక్షలా ఉద్యోగులను ఊరిస్తోంది.
 

                                                             భిక్ష కాదు...హక్కు...

వేతన సవరణ (పి.ఆర్‌.సి) ఉద్యోగులకిచ్చే భిక్ష కాదు. ఉద్యోగుల హక్కు. ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న ధరలు, ఇంటి అద్దెలు, రవాణా చార్జీలు, ఇంధన ఖర్చులు, మారుతున్న జీవితావసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చెయ్యాలి. పెరుగుతున్న ధరలకనుగుణంగా ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అమలు హక్కును ఉద్యోగులు పోరాడి సాధించుకున్నారు. గత 7 దశాబ్దాలుగా ఈ హక్కును రాష్ట్రంలో ఉద్యోగులు ముందూ, వెనుకగా అమలు చేయించుకుంటున్నారు. గత 10వ పి.ఆర్‌.సి లు ఈ ప్రాతిపదికనే అమలయ్యాయి. పి.ఆర్‌.సి నివేదిక ఇచ్చాక, ఆ నివేదికను బహిర్గతం చేసి, దానిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చిన తర్వాత ఆ సిఫార్సులను అమలు చేయడం ఇప్పటివరకు అమలవుతున్న పద్ధతి. కాని నేడు ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహంగా వున్నారు. ఇటీవల వారు చేపట్టిన ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పి.ఆర్‌.సి నివేదికను ఉద్యోగులకివ్వకపోగా అధ్యయనం పేరుతో సి.ఎస్‌ కమిటీ వేసి, ఆ కమిటీ నివేదికను బయట పెట్టింది. సి.ఎస్‌ సిఫార్సులను ఆమోదించాలని ఒత్తిడి తెచ్చింది. ఉద్యోగులు ఇప్పటికే 27 శాతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌ తీసుకుంటుండగా, 14.29 శాతం మాత్రమే ఫిట్‌మెంట్‌గా ప్రతిపాదించడం అన్యాయం. దీనివల్ల వేతన సవరణ తర్వాత కూడా వేతనాలు పెరగకపోగా మరింత తగ్గుతాయి. గత 10 పి.ఆర్‌.సి ల కాలంలో ఏ ప్రభుత్వమూ ఐ.ఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించలేదు. ఎక్కువే ప్రతిపాదించేది. 2018 నుండీ నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్యా, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సి.ఎస్‌ కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో సరిపెట్టుకోమనడం అన్యాయం. అంతేకాకుండా హెచ్‌.ఆర్‌.ఏ తగ్గించడం, సిసిఎ రద్దు, పి.ఆర్‌.సి కాలాన్ని ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు పెంచడం వంటి సీఎస్‌ కమిటీ సిఫార్సులు ఉద్యోగులకు నష్టదాయకం. రాష్ట్ర ప్రభుత్వం గత సాంప్రదాయాల ప్రకారం పి.ఆర్‌.సి సమస్యను వెంటనే పరిష్కరించడం శ్రేయస్కరం.
     2020 నుండి ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ బకాయిలను వెంటనే అందించాలి. రిటైర్‌ అయిన ఉద్యోగులు దాచుకున్న జి.పి.ఎఫ్‌, ఎ.పి.జి.ఎల్‌.ఐ, క్లైములు గత 2 సంతవ్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం పెట్టుకున్న జి.పి.ఎఫ్‌ లోన్లకు కూడా నగదు మంజూరు కాక సి.ఎఫ్‌.ఎం.ఎస్‌ లో మూల్గుతున్నాయి. సరెండర్‌ లీవులు, మంజూరు అయిన కరువు భత్యం జమలకూ మోక్షం లభించాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ దాదాపు రూ. 1600 కోట్లు పైమాటే. రాష్ట్రంలో ఉద్యోగుల కరువు భత్యానికే కరువు ఏర్పడింది. ఇంకా 5 విడతల కరువు భత్యం బకాయిలు అలాగే ఉన్నాయి. వీటన్నింటినీ వెంటనే పరిష్కరించాలి.
 

                                            కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ పి.ఆర్‌.సి

కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే మినిమం టైమ్‌ స్కేల్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం వేతన పెంపులను సి.ఎస్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఇది చట్టాలకు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధం. కాంట్రాక్టు లేబర్‌ (ఎబాలిషన్‌, రెగ్యులేషన్‌) చట్టం 1970 ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు వర్తింపజేయాలి. సుప్రీంకోర్టు సివిల్‌ అప్పీల్‌ 213 ఆఫ్‌ 2013లో ఇచ్చిన తీర్పు ప్రకారం సంబంధిత కేడర్ల రెగ్యులర్‌ ఉద్యోగుల మినిమం బేసిక్‌ వర్తింపచేయాలి. దీనిని అమలు చేస్తామనే వైసిపి ప్రభుత్వం హామీనిచ్చింది. నోటి మాటగా కాకుండా వారి మేనిఫెస్టోలో పొందుపర్చారు. గత పి.ఆర్‌.సి తర్వాత రెగ్యులర్‌ ఉద్యోగులకు డీఏ లు 64 శాతం పెరిగాయి. ఐ.ఆర్‌ 27 శాతం చెల్లిస్తున్నారు. పి.ఆర్‌.సి ఫిట్‌మెంట్‌ తర్వాత పై డిఏ (64 శాతం) + ఐ.ఆర్‌ (ఉదాహరణకు ప్రస్తుత ఐ.ఆర్‌ 27 శాతం) మొత్తం 91 శాతం ప్రస్తుత బేసిక్‌ పై కలిపి నూతన బేసిక్‌లను నిర్ణయిస్తారు. ఇది కాకుండా కేవలం 30 శాతం వేతన పెంపు ప్రతిపాదించడం అంటే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మరింత దోపిడికి గురిచేయడమే. ఆదర్శ యజమానిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు. సి.ఎస్‌ కమిటీ ప్రతిపాదించినట్లు కనీస మూల వేతనం రూ. 20 వేలుగా కాకుండా పై అంశాలను పరిగణించాలి. క్లాస్‌ 4 క్యాడర్లకు కనీస వేతనం రూ. 25 వేలుగా నిర్ణయించాలి. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా పి.ఆర్‌.సి ని ప్రారంభ తేదీ నుండి వర్తింపచేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న టైమ్‌ స్కేల్‌, మినిమం టైమ్‌స్కేల్‌, డైలీ వేజ్‌, పార్ట్‌టైమ్‌ కంటింజెంట్‌, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు పి.ఆర్‌.సి ని వర్తింపజేయాలి. రెగ్యులరైజ్‌ చేయాలి.
 

                                                 స్కీమ్‌ వర్కర్లకు వేతన పెంపు చేయాలి

మన రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, అర్బన్‌ హెల్త్‌, ఎస్‌.ఎస్‌.ఏ, తదితర అనేక పథకాల్లో పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మహిళలు, బలహీన వర్గాల వారే. వీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వేతన పెంపు విషయంలో నిర్దిష్ట విధానం లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి పి.ఆర్‌.సి వర్తింపచేయాలి (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీమ్‌ వర్కర్లకు 30 శాతం వేతన పెంపు అమలు చేసింది). కనీస వేతనాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, కనీస పెన్షన్‌ సౌకర్యాలు వర్తింపచేయాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం శోచనీయం.
 

                                                          ఐక్య పోరాటాలే మార్గం

ప్రభుత్వాలు ఎంత బలంగా ఉన్నా ఐక్య ఉద్యమాలకు తల వంచక తప్పదని ఢిల్లీ రైతాంగ ఉద్యమ అనుభవం మనకు తెలుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు నేడు పొందుతున్న పి.ఆర్‌.సి, డీఏ, ఇతర సౌకర్యాలు అన్నీ ఉద్యమాలతోటే వచ్చాయే తప్ప ఏ ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదన్న సత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు దృష్టిలో ఉంచుకోవాలి. కనీసం చర్చలకు కూడా చొరవ చూపని ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక రావడానికి కారణం ఉద్యోగులు డిసెంబర్‌ రెండో వారంలో చేపట్టిన ఉద్యమాలే. ఈ ఉద్యమ పిలుపులకు కింది స్థాయి ఉద్యోగుల నుండి లభించిన అనూహ్య స్పందనే కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం దారికి రావాలంటే ఐక్య ఉద్యమానికి సిద్ధం కావడమే పరిష్కారమని ఉద్యోగులు, వారి సంఘ నాయకులు గమనించాలి. ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న అనైక్యత ఉద్యోగుల ప్రయోజాలకు నష్టం. వివిధ కారణాల రీత్యా ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య సయోధ్య లేకపోయినా వారి వెనక ఉన్న ఉద్యోగుల ప్రయోజనాలన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని నాయకత్వం గుర్తించాలి. ఉద్యోగుల ప్రయోజనాలు ఒక్కటే అయినప్పుడు ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం కలసి పోరాడటం నేటి అవసరం. ప్రభుత్వం మీద భ్రమలు పెంచుకోవడం ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టమే కాదు. వారి భవిష్యత్తు భద్రతకు కూడా విఘాతం కలిగిస్తున్నది. కనుక ఉద్యోగ హక్కుల కోసం సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలి.
 

/ వ్యాసకర్త : సి.ఐ.టి.యు రాష్ట్ర కోశాధికారి /
ఏ.వి.నాగేశ్వరరావు

ఏ.వి.నాగేశ్వరరావు