'వాటీజ్ ఇన్ ఎ నేమ్? దట్ విచ్ వియ్ కాల్ ఎ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ - వుడ్ స్మెల్ యాజ్ స్వీట్' అంటాడు షేక్‌స్పియర్. 'పేరులో ఏముంది? మనం గులాబీని ఏ పేరుతో పిలిచినా అదే సువాసన వస్తుంది' అని తాను రాసిన 'రోమియో అండ్ జూలియట్' నాటకంలో వస్తువులకు పేరు పెట్టే సందర్భంలో... ఈ వాక్యాన్ని ఉదహరిస్తాడు. తక్షశిల విద్యాపీఠంలో ఆచార్య బోధిసత్వుడి దగ్గర పాపకుడు అనే శిష్యుడున్నాడు. అందరూ 'పాపకా! పాపకా!' అని పిలుస్తుంటే అతడికది తిట్టులా అనిపించేది. దీంతో గురువు దగ్గరకు వెళ్లి... 'నాపేరంటే నాకే అసహ్యంగా ఉంది. దయచేసి పేరు మార్చండి' అనడిగాడు పాపకుడు. 'నాయనా, పేరు మనిషిని గుర్తించడానికి, పిలవడానికే తప్ప వేరే ప్రయోజనం లేదు. ఉన్న పేరుతో సంతప్తిపడు' అన్న గురువు హితబోధ శిష్యునికి నచ్చలేదు. అయితే, దేశమంతా తిరిగి మంచిపేరేదో చెప్పు, ఆ పేరే పెడతానన్నాడు గురువు. పాపకుడు సంతోషంగా ప్రపంచయాత్రకు బయల్దేరాడు. దారిలో పాపకుడికి శవయాత్ర ఎదురైంది. చనిపోయిన వ్యక్తి పేరేంటని అడిగాడు. జీవకుడని సమాధానమిచ్చారు. పాపకుడు ఆశ్చర్యంగా జీవకుడు కూడా చనిపోతాడా? అన్నాడు. వాళ్లు నవ్వి 'జీవకుడు చస్తాడు, అజీవకుడూ చస్తాడు. పేరులో ఏముంది?' అని వెళ్లియారు. అలా ఎదురైన అనేక అనుభవాలతో పాపకుడికి జ్ఞానోదయమౌతుంది. మంచి చెడు అనేవి మన ఆలోచనలోనే తప్ప, పేరులో కాదని తెలుసుకుంటాడు.
మతాలను విడదీసి, మత చిహ్నాల చుట్టూ రాజకీయాలు చేసే వారికి మాత్రం పేర్లు కూడా రాజకీయమే. దేశంలోని వ్యక్తులు, నగరాలు, ప్రాంతాల ఐకానిక్ పేర్లను మార్చాలని గోల పెడుతోంది ఆర్‌ఎస్‌ఎస్ పరివారం. అంబేద్కర్ విగ్రహం దళితుల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి చిహ్నం. పెత్తందార్లను ఎదిరించడానికి దళితుల్లో ఒక ఉత్తేజం నింపుతుంది ఆ విగ్రహం. తమ ఆధిపత్యానికి ఇది ప్రమాదమని పెత్తందార్లు భావిస్తారు. కనుకే అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి. ఆగ్రా కోట కట్టిన రాజులు ఇప్పుడు లేరు, ఆ రాచరికమూ లేదు. కానీ, ఆ కోట ఒక ఫ్యూడల్ చిహ్నం. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్‌మహల్ కూడా ఒక ఫ్యూడల్ చిహ్నమే. అలాగని వాటిని పడగొడతామా? కింగ్‌జార్జ్ హాస్పిటల్‌ను కట్టింది బ్రిటిష్ వారే కావొచ్చు. కానీ పేదప్రజలకు వైద్యసేవలు అందించే పెద్దాసుపత్రి అది. చేతనైతే ఆ వైద్యసేవలను మెరుగుపర్చాలిగాని, పేరు గురించి వివాదం దేనికి? కెజిహెచ్‌కు వీసమెత్తు సాయం చేయకుండా, నిధులన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతూ పేర్లు మార్చితే చేసిన, చేస్తున్న పాపం పోతుందా? జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని గట్టిగా ముందుకు తెచ్చి, పాకిస్తాన్ కావాలన్న డిమాండ్ లేవనెత్తాడు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా అదే ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచింది... బిజెపి అగ్రనేత అద్వానీ జిన్నాను ప్రశంసించిందీ అందుకే. మన రాష్ట్రంలో చిచ్చు రేపడం కోసం కాకపోతే... ఇప్పుడు అదే బిజెపి జిన్నా టవర్ పేరు గురించిన వివాదం ఎందుకు రేపుతున్నట్టు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది... కెజిహెచ్ పేరు మార్చడమో, జిన్నా టవర్ పేరు మార్చడమో కాదు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం నిర్మాణం వంటివి కావాలి. వీటన్నింటికీ ఎగనామం పెట్టిన పాపం బిజెపిది. ఇప్పుడు ప్రజాగ్రహాన్ని దృష్టి మరల్చడానికి ప్రజాగ్రహ సభ పెట్టింది. పేర్ల మార్పిడి నాటకానికి తెరలేపింది.
కొన్ని పేర్లు, చిహ్నాలను ప్రజలు అపురూపంగాను, మరికొన్నిటిని ఆధిపత్యానికి, దుర్మార్గానికి ప్రతీకలుగాను చూస్తారు. తిరుగుబాటు సమయాల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని ఆధిపత్య చిహ్నాలపై కూడా చూపిస్తారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి విగ్రహాన్ని కూల్చేసినట్లు కూల్చేస్తారు. మరికొన్ని చిహ్నాలను పదిలంగా కాపాడుకుంటారు. పేరులో పెన్నిధి లేకపోవచ్చు గానీ, పేరు మార్పు తగువులతో పెద్ద ప్రమాదం వుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. ఈ నూతన సంవత్సరంలో మత విద్వేషకుల ఆగడాలకు స్వస్తి చెప్పి, రాష్ట్రానికి సంబంధించిన హక్కులు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.










