''ఏటి బావూ ! పెద్దాస్పత్రి పేరు మార్సేత్తన్నారా?'' అడిగేడు అప్పలకొండ. ''కెజిహెచ్ పేరు మార్చాలని బిజెపి డిమాండ్'' అన్న వార్తను నేను టీ కొట్టు దగ్గర పైకి చదవగానేదగ్గరకొచ్చి నిలబడ్డాడు.
కెజిహెచ్ ని విశాఖపట్నం లోనే గాక, ఉత్తరాంధ్ర అంతా పెద్దాస్పత్రి అనే అంటారు. ఒకప్పుడు పెద్దాస్పత్రి డాట్రుబాబులు అంటే దేవుళ్ళతో సమానంగా జనాలు కొలుచుకునేవారు. పెద్దాస్పత్రిలో చిన్న బంట్రోతు ఉద్యోగం చేసినా, తోటీ, ఆయా వంటి ఉద్యోగాలు చేసినా వాళ్ళకి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ ఉండేది. కెజిహెచ్ ని ఆనుకుని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఒకప్పుడు దేశంలోనే ప్రామాణికమైన వైద్య కళాశాల. అక్కడ చదివిన వారిలో చాలామంది అంతర్జాతీయంగా ఉద్దండ పిండాలుగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు కార్పొరేట్ వైద్య వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఆరోగ్యం అనేది ఓ ఖరీదైన సరుకైపోయింది. దానితోబాటే కెజిహెచ్ ప్రాధాన్యత కూడా తగ్గిపోతూ వస్తోంది.
ఈ మధ్య కరోనా నేపథ్యంలో మళ్ళీ పెద్దాస్పత్రి ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. చాలా కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లు ప్రజలకు వైద్యం చేయకుండా చేతులెత్తేస్తే, నేనున్నానంటూ ఆదుకున్నది పెద్దాస్పత్రే.
అప్పుడూ, ఇప్పుడూ పేదవాళ్ళకి పెన్నిధి పెద్దాస్పత్రే.
మరి ఆ పెద్దాస్పత్రి పేరు మారుస్తారంటే అప్పలకొండకి ఆందోళనతో కూడిన ఉత్సుకత కలగకుండా ఎలా ఉంటుంది? అప్పలకొండ కెజిహెచ్ గోడ ఇవతల రిక్షాస్టాండ్‌లో రిక్షా పెట్టుకుని ఉంటాడు. అప్పలకొండ మాంఛి వయస్సులో ఉన్నప్పుడు రిక్షాబేరాలూ ఉండేవి. కండల్లో సత్తువా ఉండేది. ఇప్పుడు కండలూ కరిగిపోయేయి, బేరాలూ తగ్గిపోయేయి. రోజుకి రెండో, మూడో బేరాలు వస్తాయి. అవి కూడా సాటి పేదవాళ్ళ బేరాలే.
''ఇంకా అంతదాకా రాలేదు. కెజిహెచ్ పేరు మార్చాలని అడుగుతున్నారంతే.'' అని జవాబిచ్చేను.
''పేరు మారిస్తే మల్లా పెద్దాస్పత్రికి పాత రోజులొస్తాయా బావూ'' ఆశగా అడిగేడు అప్పలకొండ. ఆ పాత రోజులెలా ఉండేవో అతను వివరిస్తూ వుంటే...మరికొంతమంది మేం నిలుచున్న టీ కొట్టు దగ్గర చేరేరు. ఆ పూర్వవైభవాన్ని తలచుకున్నారు. ఎవరూ 'కెజిహెచ్' అన్న పేరే అనడం లేదు. పెద్దాస్పత్రి అనే అంటున్నారు. అందులోని ఎప్పటెప్పటి డాక్టర్లనో భక్తిపూర్వకంగా స్మరించుకుంటున్నారు.
''ఆ పాత రోజులు మళ్ళీ రావాలంటే ఢిల్లీ లో ఉన్న ప్రభుత్వం చేతుల్లో ఉంది. వైద్యం మొత్తం ప్రభుత్వానిదే పూచీ అని వాళ్ళు నిర్ణయించుకుంటే, దానికి తగ్గట్టు నిధులు కేటాయిస్తే పెద్దాస్పత్రి పాత రోజుల్లో మాదిరిగా కళకళలాడడం ఎంతసేపు'' అన్నాను నేను.
''ఐతే ఒకేల అలాటిదేదైనా ఢిల్లీలో అనుకున్నారేటి బావూ ?'' ఆశగా అడిగేడు అప్పలకొండ. ''అటాంటిదేమీ లేదయ్యా. ఇంకా ఇంకా కార్పొరేట్లకే అన్నింటినీ కట్టబెట్టేస్తున్నారు'' అని చెప్పేను.
''హమ్మ! దొంగనా...అయితేటి? స్టీలుప్లాంటునాగే పెద్దాస్పత్రిని కూడా అమ్మేస్తారేటి కొంపదీసి?'' గట్టిగా అడిగేడు అప్పలకొండ.
''అమ్మినా అమ్మేస్తారెరు ! అలాటివన్నీ మనం అడక్కుండా ఉండడానికే సవగ్గా సారా ఇప్పిత్తానంటన్నాడు సారా రాజుగోరు'' అన్నాడు ఆ పక్కన చేరినవాడు.
''అయితేటి? మందు కొట్టగానే మన బుర్రలు పని సెయ్యడం మానేత్తాయనుకుంటన్నాడేటి? మందేసే కదా మాంఛి పాటలు రాత్తారు?'' అన్నాడో మందుబాబు.
''పెద్దాస్పత్రిని మల్లీ బాగా నడిపించడానికి ఏటీ సెయ్యనోడు, కుదిరితే అమ్మేద్దామనుకునేవోడు పేరు మార్సడం ఎందుకు?''
''ఏవోు మంచి బేరంగాని వొస్తాదని అనుకుంటన్నాడేటో''
''మొన్న కరోనా వొచ్చినప్పుడు ఈడు ఏటైనా మనకి సాయంగాని సేసేడేట్రా''? అడిగేడు ఇంకొకడు.
'' కరోనా వొచ్చినప్పుడు ఎక్కడ కనపడ్డాడ్రా ఈడు? ఏం సేసినా, అప్పుడు ఎర్రజెండావోల్లే కదా సేసింది?'' అన్నాడు అప్పలకొండ.
''అయితే ఏమంటారర్రా మీరంతా?'' అడిగేను.
''ఏటంతామండీ? నాను అప్పలకొండ పేరు మార్సీసుకుని అదానీ అని పేరెట్టుకున్నాననుకోండి, నాకేవైునా ఓ వొంద కోట్లు ఒచ్చీస్తాయా ఏటి? సెప్పండి? అది సేసేస్తాం, ఇది సేసేస్తాం అన్సెప్పి ఢిల్లీలో గవుర్మెంటు లోకి రాగానే అన్నీ వొగ్గీసి మనకి ఎగనామం పెట్టీసినోళ్ళు, ఇప్పుడు ఏకంగా మన స్టీలుప్లాంటునే అమ్మేడానికి తయారైపోయినోళ్ళు ఈ పేర్లు మార్చే తగువు లెందుకెడతన్నారో తెలీనంత ఎర్రి పప్పలం కాదండి. ఢిల్లీలో రైతులు సుక్కలు సూపించినా బుద్ధి రాలేదంటే అలాంటోడిని ఏం సేయాలో మాకు ఆ మాత్రం తెల్దనుకుంటన్నారా?'' అన్నాడు అప్పలకొండ.
సుబ్రమణ్యం










