Jan 01,2022 07:30

     క్షిణాఫ్రికాలో మొదలైన కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బ్రిటన్‌, ఐరోపా యూనియన్‌, అమెరికా తదితర దేశాల్లో వేగంగా, తీవ్రంగా వ్యాపిస్తోంది. భారత్‌లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్లీ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ సోకుతున్న వైనం ఆందోళన కలిగించే మరో అంశం. అయితే టీకా రెండు డోసులూ వేయించుకున్నవారికి ఒమిక్రాన్‌ సోకినా వారి ఆరోగ్యం సంక్లిష్టం కాకపోవడం కొంత నయమనిపిస్తోంది. అంటే వ్యాక్సిన్‌ మూలంగా గాని, సహజసిద్ధంగా గాని వారిలో కరోనాతో పోరాడే శక్తి పెరిగిందని విదితమవుతోంది. అయితే, ఇప్పుడు బ్రిటన్‌ లోని ఆస్పత్రుల్లో సీరియస్‌ అవుతున్న కేసులన్నీ వ్యాక్సినేషన్‌ వేయించుకోనివారివే. కనుక ఒమిక్రాన్‌ విస్తరించకుండానూ, ఒకవేళ సోకినా ముదిరిపోకుండా కాసుకోడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడం కీలకమన్నది స్పష్టం.
    శాస్త్రవేత్తలు కోవిడ్‌ ను నియంత్రించే వ్యాక్సిన్‌లను, ఔషధాలను శరవేగంగా కనుగొన్నా ఇప్పటికీ ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ అందించలేకపోవడం దయనీయమైన విషయం. సంపన్న దేశాలలో వ్యాక్సిన్‌ నిల్వలు పేరుకుపోగా, పేద దేశాలలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే వ్యాక్సిన్‌ అందింది. వ్యాక్సిన్‌లపై, యాంటీ వైరల్స్‌పై పేటెంట్లను రద్దు చేసి ఆ పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని మూడవ ప్రపంచ దేశాలన్నీ కలిసి సంపన్న దేశాలపై గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం పెద్ద బలహీనత. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో పేటెంటు చట్టాలను పక్కన పెట్టవచ్చునని చెప్పినా, ఆ విధంగా జరగకపోవడం గమనార్హం. సంపన్న దేశాల యావంతా తమ ఫార్మా కంపెనీలకు వచ్చే భారీ లాభాలపైన మాత్రమే! ఆ లాభాలు కొనసాగాలంటే కరోనా మహమ్మారి కొనసాగుతూనే వుండాలి. ఈ మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ, మరోవైపు సంపన్న దేశాల ప్రజలు నిరంతరం వ్యాక్సిన్‌లపై, ఔషధాలపై ఆధారపడుతూ వుండాలి. అప్పుడే ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతూ వుంటుంది. ఇదీ సంపన్న దేశాల కుట్ర. శత కోటీశ్వరుల లాభాలకోసం పని చేసే నయా ఉదారవాద విధానాలు ప్రజారోగ్య వ్యవస్థను కుప్పకూల్చాయి. అందరికీ చౌకగా మందులు, టీకాలు పొందడానికి పేటెంట్‌ వ్యవస్థ ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలు ముఖ్యంగా వర్థమాన దేశాల జనం ఈ దుర్విధానాలను ఎదిరించి పోరాడాలి. అప్పుడే ప్రపంచ జనాభాకంతటికీ వ్యాక్సిన్‌ అందుతుంది. కరోనా పీడ వదులుతుంది.
     ప్రపంచానికే ఔషధ ప్రదాత అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న మన దేశంలో ఇప్పటిదాకా అందరికీ వ్యాక్సిన్‌లను అందించలేదు. దేశంలోని వయోజనులలో 56 శాతం మంది మాత్రమే టీకా రెండు డోసులు పొందగలిగారు. మన దేశంలో ఉన్న పూర్తి సామర్ధ్యం మేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తి 2020 ఆగస్టు నెలలోనే మొదలుపెట్టివుంటే ఈపాటికి దేశ జనాభా మొత్తానికి నూరు శాతం వ్యాక్సిన్‌ అందివుండేది. ఒమిక్రాన్‌ ఇంతగా భయపెట్టేది కాదు. ఇప్పటి దుస్థితి పూర్తిగా మోడీ ప్రభుత్వ చలవే. పేటెంట్‌ వ్యవస్థను తోసిపుచ్చలేని చేతకానితనమే! ఇప్పటికైనా అవసరమైనన్ని టీకా డోసులను కేంద్ర ప్రభుత్వమే సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలి. ఒమిక్రాన్‌ ఈలోగా విజృంభిస్తే ప్రజల అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసియు, ఆక్సిజన్‌ బెడ్లు, ఇతర సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలి. కరోనా రెండవ దశలో ప్రజలెదుర్కొన్న దుస్థితి పునరావృతం కారాదు. కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన టీకాలు, నిధులను సాధించడంతోపాటు రాష్ట్రంలో వైద్య మౌలిక సౌకర్యాల కల్పన, మందుల సరఫరా, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాల వంటివి చేపట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం సర్కారు తక్షణ కర్తవ్యం.పేటెంటు వ్యవస్థను ఎదిరించలేని మోడీ అశక్తత వల్లే ఒమిక్రాన్‌ మనల్ని భయపెడుతోంది.