Jul 21,2021 06:53

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి కొత్త జాబ్‌ కేలండర్‌ విడుదల జేయాలని కోరుతూ విద్యార్థులు, యువజనులు మరోసారి రోడ్డెక్కారు. గత నెల రోజులుగా దశలవారీగా చేస్తున్న ఆందోళన సోమవారం పతాక స్థాయికి చేరింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు,టిఎన్‌ఎస్‌ఎఫ్‌, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌, తెలుగు యువత, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌ వంటి పది సంఘాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు చలో తాడేపల్లికి నిరుద్యోగ యువత పెద్దయెత్తున తరలివచ్చింది. ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు, గృహ నిర్బంధాలు, ప్రతి కదలికపైనా నిఘా పెట్టిన వేగులు, ముందస్తు అరెస్టులు, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, తాడేపల్లిలో సిఎం ఇంటి సమీపంలో రోడ్లు రణరంగంగా మారాయి. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ప్రదర్శకులను అడ్డుకోవడం, బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కడం వంటి చర్యలు నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ అమానవీయతకు నిదర్శనం. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ యువత పట్ల వాటి వైఖరిలో ఇసుమంత కూడా మార్పు లేదనడానికి ఇదొక నిదర్శనం. నిరుద్యోగ యువత గొంతెమ్మ కోర్కెలేమీ కోరలేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలోను, పాదయాత్ర సందర్భంగాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని మాత్రమే డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని, తాము అధికారంలోకి వస్తే ఏడాదికొకసారి జాబ్‌ కేలండర్‌, ప్రతి యేటా డిఎస్సీ అని యువతలో ఆశలు రేపారు. మాట తప్పను, మడం తిప్పను అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి అధినేత ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు.

యువతలో అసంతృప్తికి ఇదే కారణం. రెండేళ్లు ఆలస్యంగానైనా 2.3 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తారని ఆశించిన యువత కేవలం 10,143 పోస్టుల భర్తీకే కేలండర్‌ విడుదలజేయడంతో హతాశులయ్యారు. ప్రకటించిన పోస్టుల్లో కూడా గ్రూప్‌-1, గ్రూప్‌-2 కలిపితే 30 పోస్టులకు మించి లేవు. రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు పాతిక లక్షల మందికిపైనే ఉన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించడానికి బదులు గడచిన రెండు సంవత్సరాల్లో 1.8 లక్షల పర్మినెంట్‌ ఉద్యోగాలతో సహా 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పడం నిరుద్యోగ యువత పట్ల క్రూర పరిహాసమే. ఖాళీగా వున్న వేలాది ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం ఇటువంటి జిమ్మిక్కులతో మసిపూసి మారేడుకాయ చేసేలా వ్యవహరించింది. ప్రభుత్వం కల్పించామని చెబుతున్న పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కొత్తగా భర్తీ చేసింది ఒక్కటీ లేదు. ఆర్టీసి కార్పొరేషన్‌ కింద ఉన్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడాన్ని కొత్త ఉద్యోగాల కింద చూపడం ఎంతవరకు సబబు? కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న హెల్త్‌ సిబ్బందిని, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను రెన్యూవల్‌ చేయడం, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది నియామకం ఇవన్నీ కలిపి వాగ్దానం చేసినదానికన్నా ఎక్కువే ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం టామ్‌టామ్‌ వేసుకోవడం హాస్యాస్పదం.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 'పకోడా జాబ్స్‌' ను ఉద్యోగాల కిందే లెక్కేసి యువతను ఎలా దగా చేసిందీ చూశాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీని ఆదర్శంగా తీసుకోదలిచిందా? ప్రభుత్వ వ్యవహార తీరు అలానే ఉందని యువత భావిస్తోంది. ప్రతి యేటా డిఎస్సీ అన్నారు. రెండేళ్లు అయినా ఇంతవరకు నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కరోనాతో కుంగిపోయిన కుటుంబాలకు ఆసరా కల్పించాలన్నా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవాలన్నా ఉపాధి కల్పన అత్యంత కీలకం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడానికి, కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ప్రత్యేక హోదాను సాధించేందుకు అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రంతో గట్టిగా పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, తగదునమ్మా అంటూ వైసిపి ప్రభుత్వం దానిని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ నూతన విద్యావిధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ మాట ఇక మరచిపోవాల్సిందే. దీనివల్ల ఉన్న టీచర్ల ఉద్యోగాలకే ఎసరొచ్చే ప్రమాదముంది. యువత ఉద్యోగాల కోసం ఉద్యమించే పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది. తమ ఆందోళనను తెలియజేసేందుకు రోడ్డెక్కితే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. యువత సహనానికి పరీక్ష పెట్టకుండా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగ యువతపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారితో చర్చలు జరపాలి. ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి కొత్త జాబ్‌ కేలండర్‌ను ప్రకటించి యువతలో నెలకొన్న అశాంతిని తొలగించాలి.