Jul 18,2021 06:19

    ప్రభుత్వాలు ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేనప్పుడు... నిరసనలు, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ప్రజా ఉద్యమం అంటే ప్రజలు తమ జీవితాలను, స్థితిగతులను, భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకోడానికి ఐక్యంగా చేసే పోరాటం. నిరసనలైనా, ఉద్యమాలైనా సమాజంలో వచ్చిన అసంతప్తిని విభిన్నరూపాల్లో వ్యక్తీకరించడమే. ఈ నిరసనలను పట్టించుకోని ప్రభుత్వాలు... వాటి మూలాలను విస్మరించి, నిరసనలను అణచివేయ చూస్తున్నాయి. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఉద్యమాలను ఎంత కఠినంగా అణచివేయాలని చూస్తే... అంతే తీవ్రతతో ఉవ్వెత్తున వెల్లువెత్తుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం పౌరుల హక్కు. ఆ హక్కులను అణచివేయాలని చూస్తే... అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
    పౌరహక్కుల హననంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలకు పైగా నిరసన తెలుపుతున్న రైతులను అనేక రూపాల్లో అణచివేతకు గురిచేస్తోంది. హర్యానా ప్రభుత్వం ఈ వారంలోనే రెండు సార్లు రైతులపై లాఠీఛార్జి చేయించడమేగాక అన్నదాతలపై దేశద్రోహ నేరం మోపడం అమానుషం. 'ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి క్టసడీలో మరణించడం... భారత మానవ హక్కుల చరిత్రలో ఎప్పటికీ మాయని మచ్చ' అని ఐరాస మానవ హక్కుల నిపుణురాలు మేరీ లాలోర్‌ పేర్కొన్నారంటేనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పౌరహక్కులకు ఎంత హానికరంగా మారిందో అర్థమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యం, పౌరహక్కులపై దాడికి పూనుకుంటోంది. గురువారం విజయవాడ కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్ష కార్పొరేటర్లపై జరిగిన పోలీసు జులుం ఓ తాజా తార్కాణం. ఆస్తి విలువ ఆధారిత ఇంటిపన్ను, చెత్త పన్నులపై నిరసన తెలుపుతున్న విపక్షాలపై మూకుమ్మడిగా చుట్టుముట్టిన పోలీసులు... కార్పొరేటర్‌ను రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చారు. తాజా పన్నుల విధానం ప్రజలకు హానికరమని, దీనిపై నగర పాలకసంస్థ పాలకవర్గ సమావేశం సమగ్రంగా చర్చించాలని సభలో కోరడమే వారు చేసిన తప్పు. ప్రజాసమస్యలపై స్పందించే హక్కు, ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపే బాధ్యత తమకుందని మొత్తుకున్నా... పట్టించుకోలేదు. తద్వారా ఆ కార్పొరేటర్లను ఎన్నుకున్న ప్రజలందరి అభిప్రాయాన్ని పోలీసులు తుంగలో తొక్కారు. ఇటీవల విశాఖపట్నం, కర్నూలు తదితర కార్పొరేషన్లలోనూ నిరంకుశ చర్యలకు పాల్పడ్డారు. కార్మిక, కర్షక ఆందోళనలనూ ఇలాగే అణచివేస్తున్నారు.
     ప్రజారక్షణ, ప్రజల హక్కులను కాపాడటం ఎంత ప్రధానమైనదో భారతంలో భీష్ముడు చెబుతాడు. 'భీతులైన సజ్జనులకు అభయమొసగి, ఆలఘు సౌఖ్యాత్ములన్‌ చేత(రాజుకు) ఎంత యును విశిష్టము' అన్నాడు. ప్రజా సంక్షేమమే పాలకుడికి పరమావధి. రాజు చేసిన దానాలు, తపస్సులు, యాగాల వంటివేవీ ప్రజారక్షణను మించిన ఫలితాన్ని ఇవ్వలేవు. అలా రాజధర్మాన్ని విధిగా నిర్వర్తించిన రాజుకు ప్రజల మన్నన, ఉత్తమ గతులూ ప్రాప్తిస్తాయని భీష్ముడు ఉపదేశించాడు. కానీ కేంద్రంలోని పాలకులు... సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు. వారి ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా భావిస్తున్నారు. 'దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుషులోరు' అన్నాడు మహాకవి గురజాడ. ఆ మనుషుల్లో చైతన్యం రగిలితే ప్రజలు చోద్యం చూస్తూ కూర్చోరని, ప్రజాకంటక ప్రభుత్వాలను కూల్చివేస్తారని చరిత్ర చెబుతోన్న అనుభవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ప్రజా కంటక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం, ఉద్యమించడం ప్రజల హక్కు. ఆ హక్కులకు భంగం కలిగితే... ఎటువంటి అసుర పాలననైనా, పాలకుడ్ని అయినా తగు సమయంలో ప్రజలు సాగనంపుతారు. 'ఎఱుకలేని దొరల నెన్నాళ్లు కొలిచిన/ బ్రతుకు లేదు వట్టి భ్రాంతిగాని' అన్న వివేకం ప్రజలకు అర్థమైతే... ఈ పాశవిక ప్రభుత్వాలకు చెల్లుచీటి రాసేస్తారు.