Dec 28,2021 15:19

* నిర్బంధాలు తట్టుకుని నిలబడ్డాం..
* 2018 నుండి పరిణామాలపై ప్రతినిధుల చర్చ

ప్రజాశక్తి - జక్కావెంకయ్య, టి.నరసింహయ్య, సున్నం రాజయ్యనగర్‌ (తాడేపల్లి) : 2018లో భీమవరంలో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభల నుండి ఇప్పటివరకు గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నామని, అదే సమయంలో ప్రజాసమస్యలపై అనేక పోరాటాలను నిర్వహించామని సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలో సోమవారం సాయంత్రం జరిగిన చర్చల్లో పలువురు ప్రతినిధులు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టి.షడ్రక్‌, రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మహాసభ సోమవారం ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాజకీయ నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టగా ఆయా జిల్లాల ప్రతినిధులు గ్రూపు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ వారు మాట్లాడారు. సముద్రతీర, ఏజెన్సీ, ఏజెన్సీ సరిహద్దు, మైదాన మండలాలుగా ఉన్న విశాఖ గ్రామీణ జిల్లాలో రేషన్‌కార్డులు, పింఛన్లు, రోడ్ల సమస్యలపై పనిచేశామని, అందువల్ల ప్రజాదరణతో తాము ఒక జడ్పీటీసీ, 9 సర్పంచ్‌లు, 3 ఎంపిటిసిలు, 2 మండల ఉపాధ్యక్ష స్థానాలను గెలవగలిగామని ఆ జిల్లాకు చెందిన ఎం. అప్పలరాజు, పి అప్పలనర్స చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నామని, అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించే చర్యలను నిరసిస్తూ పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. చెరకు, కౌలు రైతు ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు వారు వివరించారు. కృష్ణాజిల్లా ప్రతినిధులు పివి ఆంజనేయులు, ఎస్‌. నాగమణి, ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ...పెనుగొలను నకిలీ మిర్చినారుకు సంబంధించి 18 నెలల పాటు సుదీర్ఘ పోరాటం నిర్వహించామని, 55 మందికి ఎకరానికి రూ.38 వేలు చొప్పున పరిహారం ఇప్పించామని చెప్పారు. నూజివీడు సిపి సీడ్స్‌ మొక్కజొన్న మొలకెత్తకపోవడంతో వందలాది ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, దీంతో తాము పోరాటం చేసి రూ.45 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించామని వివరించారు. జాతీయ రహదారి సహా పలుచోట్ల ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుచేయడానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేయగా, ఆరుగురిపై నాన్‌బెయిల్‌బుల్‌కేసులు నమోదు చేసి వేధించారని వారు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతమైన ఆకివీడు, భీమవరం, నర్సాపురం, ఇళ్లస్థలాల సమస్యలపైన పోరాటం నిర్వహించామని ఆ జిల్లా ప్రతినిధులు కళ్యాణి, కౌరు పెద్దిరాజు చెప్పారు. కరోనా మొదటివిడతలోనే వేలాదిమందికి నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశామని చెప్పారు. ఆక్వా, కాలుష్యం, కుల వివక్షపైన ఉద్యమాలు నిర్వహించినట్లు చెప్పారు. నెల్లూరు మున్సిపల్‌ కార్మికుల సమస్యలపైన, రైల్వే స్థలాల్లో పేదల ఇళ్ల తొలగింపుపైన, కృష్ణపట్నం కార్మికుల సమస్యలపైన పోరాటాలు నిర్వహించినట్లు ఆ జిల్లా ప్రతినిధులు ఎం. పుల్లయ్య,ó కత్తి శ్రీనివాసులు చెప్పారు. ఈ క్రమంలో అనేకమార్లు నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో ప్రత్యేక సహాయ శిబిరం నిర్వహించడమే గాక...నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశామని, తక్కువ ధరకు కూరగాయలు అందజేశామని, వరదలు వంటి ప్రత్యేక సందర్భాల్లో సిపిఎం తరపున అనేక సహాయ శిబిరాలు నిర్వహించడం పట్ల బాధితుల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. కర్నూలు జిల్లా ప్రతినిధులు నర్సింహా, నారాయణ మాట్లాడుతూ ...జిల్లాలో 36 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌ వద్ద ఆయా కుటుంబసభ్యులు సహా 48 గంటలపాటు నిరాహారదీక్షలు చేయడంతో...వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందిందని, అలాగే ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందించేటట్లుగా పార్టీ చొరవచేసిందని తెలిపారు. కర్నూలులో మన ప్రజాఉద్యమాల పట్ల సానుకూలత పెరిగిందని, పట్టణ ప్రాంతాల్లో మైనార్టీ రంగంపైన మరింత శ్రద్ద పెట్టాల్సి ఉందని వివరించారు. హెచ్‌పిసిఎల్‌ పైప్‌లైన్‌ వల్ల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. గురజాలలో కులదురంహకార ఆదిపత్యం ఇంకా కొనసాగుతోందని, అక్కడ భర్తను కోల్పోయిన ఓ బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో పార్టీ కృషి చేసిందని వివరించారు. ఎన్‌ఆర్‌సిపై 7 వేలమందితో పెద్దఎత్తున సభ నిర్వహించినట్లు చెప్పారు. తూర్పు కృష్ణాజిల్లాలో ఇటీవలి కాలంలో వంద గ్రామాల్లో కొత్తగా విస్తరించామని, కౌలురైతుల పాదయాత్ర, భూ పోరాటాలు ఈ కాలంలో అనేకం నిర్వహించామని ఆ జిల్లా ప్రతినిధి వై నరసింహారావు వివరించారు. కడప జిల్లాలోని 18 మండలాల్లో భూ పోరాటం చేసి...కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున ధర్నా చేసినట్లు ఆ జిల్లా ప్రతినిధి మనోహర్‌ చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని, విశాఖ ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిలిపివేయాలని డిమాండ్లతో పలుమార్లు ఆందోళన నిర్వహించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా ప్రతినిధులు సుబ్రమణ్యం, సాయిలక్ష్మీ మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, ఇతర సమస్యలపై పాదయాత్ర నిర్వహించి... వారిలో మనోధైర్యం నింపినట్లు చెప్పారు. టిటిడిలో 1400 మంది కార్మి కులను తొలగించడం పైన, వారికి మద్దతు పలికిన ముగ్గురు పర్మినెంట్‌ ఉద్యోగుల తొలగింపుపైన రాజీలేని పోరాటం నిర్వహిం చడం వల్ల వారందరినీ మళ్లీ తీసుకుందని తెలిపారు. కరోనా సమయంలో తిరుపతి కేంద్రంగా సేవలందించినట్లు చెప్పారు.