రాయలసీమ...ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది చాలీచాలని వర్షపాతం. పారని వాగులు, వంకలు, ఎండిన డొక్కలు, నిండని చెరువులు, వెంటాడే కరువు! కానీ, ఇప్పుడు భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వద్దన్నా విడవకుండా పడుతున్న వర్షం స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. వాగులు, వంకలు ఎక్కడివక్కడ పొంగుతున్నాయి. ఫలితంగా పంటపొలాలతో పాటు, రైతు కూడా నిండా మునిగే పరిస్థితి ఏర్పడింది. రోజుల తరబడి కురుస్తున్న వర్షాలతో సీమలో నెలకొన్న పరిస్థితిని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం ఇటీవల కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని 15 మండలాల్లో విస్తృతంగా పర్యటించింది. స్థానిక రైతులతో చర్చించింది. వారి కష్టాలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించింది. దాదాపుగా ఈ అన్ని ప్రాంతాల్లోనూ జులై 15 నుండి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. సాధారణ వర్షపాతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వర్షం ఈ కాలంలో ఇక్కడ కురిసింది. భారీ వర్షం వల్ల పంటలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. కానీ, చిత్రమేమిటంటే అవసరమైన చెరువుల్లో మాత్రం నీరు చేరలేదు. అక్కడక్కడ ఒకటి, రెండు చెరువులకు నీరు చేరినప్పటికీ, గేట్లు లేనందువల్ల ఫలితం లేకుండా పోయింది. పైగా చెరువుల్లోని నీరు పంట పొలాలను ముంచెత్తాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వేరుశనగ రైతుది ఒకటే వ్యథ. అనేక చోట్ల పంట వేర్లు బయటకు వచ్చేశాయి. వేరుశనగకాయ కుళ్లిపోవడమో, మొలకలెత్తడమో జరిగింది. ఈ పంటను ఏమి చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా 8 నుండి 10 క్వింటాళ్లు పంట వచ్చే వేరుశనగ ఇప్పుడు రెండు క్వింటాళ్లకు పరిమితమైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు చిక్కుకున్నారు. రైతులు ఎకరాకు రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టారు. పంట నాణ్యత లేకపోవడంతో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. నికరంగా ఎకరాకు రూ.15 వేల నష్టం వస్తోంది. పీకిన పంటకు అనేక చోట్ల నూనె పీల్చే పురుగు పట్టింది. వచ్చిన కొద్ది పంటకు కనీస మద్దతు ధర రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం రూ.5,600 క్వింటాకు రావాల్సి ఉండగా, రూ. 3 నుండి రూ. 4 వేలకు మించి కొనడం లేదు. ఎక్కువ మంది రూ. 3 వేలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. కర్నూలు జిల్లాలో ప్రధాన పంటలుగా ఉన్న పత్తి, మిర్చి సాగు చేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారు. పూత, పిందె దశలో ఇవి వర్షం బారిన పడి ఎందుకు పనికిరాకుండా పోయాయి.
టమాటా వేసిన రైతులు పూర్తిగా మునిగిపోయారు. వర్షాలకు తెగుళ్లు ఆవరించాయి. మచ్చలు వచ్చాయి. వచ్చిన కాపు రాలిపోయింది. మదనపల్లి మార్కెట్ కానీ, స్థానిక మార్కెట్లోగానీ, వ్యాపారుల మాయాజాలంతో రైతులు చిత్తవుతున్నారు. మదనపల్లి మార్కెట్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. వ్యాపారులు ఇష్టారాజ్యంగా తూకం వేస్తారు. వారు చెప్పిన దానిని ఒప్పుకుని తీరాల్సిందే. 40 కిలోల తూకం రాయిని గుర్తుగా పెడతారు. కానీ, 43 నుండి 45 కిలోలు తీసుకుంటారు. పది కిలోలు ఒక లాట్‌గా పెడతారు. వేలం వేసిన తరువాత జాక్‌పాట్ అని రెండు క్రేట్‌లు అదనంగా తీసుకుంటారు. ఇలా ప్రతి 400 కిలోలకు అదనంగా 150 కిలోల దాకా వ్యాపారులు పొందుతారు. ధర సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రైతుకు దక్కేదేముంది?
పండ్ల తోటలు వేసిన రైతుల దుస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. బొప్పాయి, జామ, బత్తాయి తదితర పళ్ల తోటలు వేసిన రైతులు లాక్‌డౌన్ సమయంలో తీవ్రంగా నష్టపోయారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే అవకాశం అప్పట్లో వారికి లేకుండా పోయింది. ఇప్పుడు వర్షాలతో తెగుళ్లు వస్తున్నాయి. దీతో పండ్ల తోటల రైతులను ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. మరోవైపు నీటిపారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది. కృష్ణా, పెన్నా నదుల్లోకి ప్రవహించే అనేక వాగుల్లోకి చేరిన వర్షపు నీరు పూడిక కారణంగా ప్రవాహ దిశను మార్చుకుని పంట పొలాలను ముంచెత్తాయి. ఉదాహరణకు ఆత్మకూరు, నందికొట్కూరు మండలాల్లో ప్రవహించే భవనాశి వాగు! నల్లమల అడవుల నుండి పశ్చిమ-తూర్పుకు ప్రవహిస్తుంది. దీనికి సమాంతరంగా ఎస్‌ఆర్‌ఎంసి ప్రధాన కాలువ పశ్చిమం నుండి తూర్పుకు వస్తుంది. భవనాశి వాగు నుండి ఎస్‌ఆర్‌ఎంసి కి ఇన్‌లెట్ కావాలని ఎప్పటి నుండో రైతులు అడుగుతున్నారు. కానీ, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముంపు నివారణ చర్యలు తీసుకోలేదు.
వర్షాభావంతో పంటలు వేసుకోకపోతే ఇబ్బందులు, నష్టాలు ఒకరకం. కానీ ఇప్పుడు పంటలు వేసుకుని, పెట్టుబడులన్నీ పెట్టిన తరువాత పంట చేతికి రాకపోవడంతో కరువును మించి 'పచ్చి కరవు' వచ్చిందని రైతులు రోదిస్తున్నారు. రాయలసీమలో వర్షాలు పడుతున్నాయని ప్రభుత్వం సంతోషం ప్రకటిస్తోంది తప్ప, రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించడం లేదు. పంట నష్టాన్ని నమోదు చేసేందుకు ఇంతవరకు ఎన్యూమరేషన్ ప్రారంభించలేదు. వాస్తవానికి ఎన్యూమరేషన్ కూడా అవసరం లేదు. అన్ని రకాల పంటలకూ దిగుబడులు లేవు కనక...వర్షపాతాన్ని బట్టి మొత్తం పంట నష్టపోయినట్టుగా గుర్తించవచ్చు. మరో ముఖ్యమైన విషయం. పంటల బీమా గురించి ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. వాతావరణ బీమా అమలు చేస్తారా...పంటల బీమా అమలు చేస్తారా...అనే విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. రైతులకు జరిగిన ఈ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం తక్షణం సహాయాన్ని ప్రకటించాలి. వేరుశనగకు రూ. 25 వేలు, టమాటాకు రూ. లక్ష, పత్తి, మిర్చికి రూ. 50 వేలు, బొప్పాయికి రూ.లక్ష పరిహారంగా ప్రకటిస్తేనే రైతులు నిలదొక్కుకోగలరు. అందుకే, రైతులను ఆదుకోవాలని కోరుతూ 'ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం' ఉద్యమ బాట పట్టింది. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలి.
(వ్యాసకర్త ఎ.పి. రైతుసంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షుడు)










