Jan 09,2022 07:15

    'తిండి కలిగితె/ కండ కలదోయ్/ కండ కలవాడేను/ మనిషోయ్' అన్నాడు గురజాడ. ఆ తిండి శాకాహారమో, మాంసాహారమో చెప్పలేదుకదో అని చెప్పే అభినవ గిరీశంలకూ కొదవ లేదు. మనం తినే ఆహారాన్ని శాకాహారం చుట్టూ భక్తి చుట్టూ తిప్పే మహానుభావులు పెరిగారిప్పుడు. మాంసాహారాన్ని తీసుకోవడం హానికరమని సూత్రీకరణలు చేస్తూ 'నీచు' రాజకీయాలకు తెర తీస్తున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా తెలివిగా ఈ తరహా ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. దీనికి మత విశ్వాసాలు, సంప్రదాయాలను జోడించారు. దేవుళ్లనూ ప్రచారకర్తలుగా మార్చారు. ఆ రోజు ఆ దేవుడికి ఇష్టం... ఈ రోజు ఈ దేవుడికి ఇష్టం... కనుక ఆ రోజుల్లో మాంసాహారం భుజించరాదంటూ... భక్తుడ్ని భగవంతుడికి అనుసంథానం చేసేశారు. కానీ, 'నియుక్తస్తు యథా న్యాయం యో మాంసం నాత్తి మానవ:,/ స ప్రేత్య పశుతాం యాతి సంభవానేకవింశతిం?' అని వారు పవిత్రంగా భావించే మనుస్మృతే చెబుతోంది. అంటే-శ్రాద్ధ మధుపర్యములందు నియమింపబడిన ద్విజుడు మాంసాన్ని భక్షింపకపోతే అతడు దేహాంతమున అరవై ఒక్క జన్మలు పశువుగా జన్మిస్తాడని అర్థం. 'రంతిదేవుడనే రాజు రోజూ రెండు వేల గోవులు, మరో రెండు వేల ఇతర జంతువులను వధించి ఆ మాంసాన్ని అందరికీ దానం చేసేవాడ'ని మహాభారతంలో పేర్కొన్నట్లుగా రమేష్‌చంద్ర మజుందార్‌ 'ది హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ పీపుల్‌' అన్న గ్రంథంలో రాశాడు.
    మన దేశంలో ఆహారపు అలవాట్లు కుల, మతాలతో ముడిపడి ఉంటాయి. మతాల మధ్య విభజన తేవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశానికి మోడల్‌గా చెప్పే గుజరాత్‌లో మాంసాహారులే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. ఒకటి, రెండు కులాలు మాత్రమే అధికారికంగా మాంసాహారం తినరు. మరికొందరు గుడ్లను మాత్రమే తింటారు. బెంగాలీలు చేపలను శాకాహారంగా భావిస్తారు. విభిన్న ఆహార అలవాట్లున్న ప్రజలపై బలవంతంగా తమ భావాలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్‌లో మాంసాహార స్టాళ్లను మూసేయడం, బిజెపి పాలిత రాష్ట్రాల్లోని స్కూళ్లలో పిల్లలకు కోడిగుడ్లు అందించడాన్ని నిషేధించడం చాప కింద నీరులా సాగుతోంది. తాజాగా కర్నాటక బిజెపి ప్రభుత్వం పౌష్టికాహారమైన గుడ్లను పిల్లలకు ఇవ్వడానికి నిర్ణయిస్తే, దానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. మనుషుల ఆహారపుటలవాట్లతో పాటు పరిణామ క్రమం పెంపొందుతూ, వారి ఆయుర్థాయం పెరుగుతూ వచ్చింది. మనిషి శాకాహారంతో పాటు మాంసాహారం కూడా తీసుకోవడం వల్లే శరీరం, మెదడు, నాడీమండల వ్యవస్థ అభివృద్ధి చెంది, అవసరమైన ప్రొటీన్స్‌ లభ్యమౌతున్నాయి. మన అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాలను పండించుకు తినగలిగే పరిస్థితి ఈరోజుకీ లేదు. కానీ మాంసాహారాన్ని ఆదిమ కాలం నుంచీ తింటున్నాం. ఆ మాంసాహారాన్ని కాల్చినదో, ఉడికించినదో తినడం వల్లే... మనిషి ఆయుర్థాయం పెరిగింది. దాదాపు పదివేల సంవత్సరాల క్రితం మనిషి ఆయుర్థాయం 25 ఏళ్లు. ఆ తర్వాతే పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం.. ఒకటి పశుపోషణ, రెండు ఆహార లభ్యత. అలాగే పశుపోషణలోనూ రెండు అంశాలున్నాయి. ఒకటి మాంసాహారం, రెండు పాలు లభ్యం కావడం. శాకాహారం, మాంసాహారం కలిసిన సమగ్ర ఆహారం తీసుకోవడం వల్లనే మనిషికి దేహదారుఢ్యం సమకూరింది. ఇది సైన్సు. శాకాహారానికి సముచిత గౌరవం ఇవ్వాల్సిందే. ఐతే, మాంసాహారం లేకుండా మానవజాతి వికాసం జరగలేదన్నది సత్యం. అంతేకాదు... ఈ పరిణామ క్రమంలో రెండు నిర్ణయాత్మకమైన ముందడుగులు పడ్డాయి. ఒకటి, నిప్పు వినియోగం లోకి తేవడం, రెండు... పశుపోషణ. ఈ రెండూ మాంసాహార వినియోగం పెరగడానికి, తద్వారా నాడీమండలం పెంపొందడానికి తోడ్పడ్డాయి. మనిషి, సమాజం అభివృద్ధిలో ఈ రెండిటి పాత్ర కీలకం.
    అసలే మనదేశంలో పౌష్టికాహార లభ్యత చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో గుడ్లు, పాలు, చేపలు, మాంసం వంటి ఆహారం వినియోగం పెరగడం ఎంతో అవసరం. సరైన తిండి వున్నప్పుడే ఆరోగ్యకరమైన శరీరం, ఎదుగుదల వుంటుంది. ఇన్ని వాస్తవాలను కాదని సూళ్లల్లో అందించే పౌష్టికాహారమైన గుడ్డును అడ్డుకోవడమంటే, పిల్లల ఆరోగ్యానికి అడ్డుపడడమే. అతిగా తింటే ఏ ఆహారమైనా అనర్థమే. సమతుల ఆహారం ఆరోగ్యానికి మంచింది. అంతే తప్ప ఒక్క శాకాహారమే సమగ్రమని చెప్పడం... దానికి మతాన్ని జోడించడం మూర్ఖత్వం.