Aug 26,2020 07:52

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని కోరుతూ సోమవారం జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తీర్మానించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. నాయకత్వాన్ని మార్చడంతో పాటు, పార్టీని ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్‌ నేతలు రెండు వారాల క్రితం సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో ఏడు గంటలపాటు ఏకబిగిన సాగిన వీడియో సమావేశం చివరికి 'అన్యధా శరణం నాస్తి...' అని తేల్చేసింది. అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగాలని అభ్యర్థించడంతో పాటు అవసరమైన వ్యవస్థాగత మార్పులను చేసే అధికారాన్ని కూడా ఆమెకే సిడబ్ల్యుసి కట్టబెట్టింది. 'ఇటీవల కాలంలో సోనియా, రాహుల్‌ గాంధీ చొరవ వల్లనే కాంగ్రెస్‌ శ్రేణులు అనేక పోరాటాలు చేశాయని' తీర్మానం స్త్తోత్ర పాఠాలు వల్లించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాహుల్‌ గాంధీ ఎప్పటికప్పుడు పోరాడారని సిడబ్ల్యుసి భజంత్రీలు వాయించింది.
కరోనాతో పాటు, ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను, ఉద్యోగాల కోత, పెరుగుతున్న పేదరికం తదితర అంశాలను తీర్మానంలో ప్రస్తావించారు కాని వాటికి దారితీసిన నయా ఉదారవాద విధానాల గురించిగాని, అడ్డగోలుగా కార్పొరేట్లకు దోచిపెడుతున్న తీరును గురించి పల్లెత్తు మాట లేదు. వినాశకరమైన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను దేశంలోకి తెచ్చింది పి.వి. నరసింహారావు- మన్మోహన్‌ సింగ్‌- చిదంబరం నాయకత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే. కాని మూడు దశాబ్దాల తర్వాత ఆ విధానాల దుష్ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తూ కూడా వాటిని విమర్శించడానికి సిద్ధపడడంలేదంటే ఆ తీర్మానంలో నిజాయితీ గాని, ప్రజల పట్ల నిబద్ధత గాని ఏమీ లేవని స్పష్టం అవుతోంది. ఇక చైనా మన సరిహద్దుల్లోకి చొరబడుతున్నా మోడీ సర్కారు చేష్టలుడిగి కూర్చున్నదని తన దేశభక్తిని చాటుకోడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అమెరికాకు అడుగులకు మడుగులొత్తుతున్న మోడీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించలేదు. అంటే అమెరికా రేపిన చైనా వ్యతిరేక ప్రచారంలో కాంగ్రెస్‌ బిజెపి తో పోటీపడి వ్యవహరించదలచుకుందని భావించాలి. భారతీయ విద్యావంతులకు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు నష్టదాయకమైన ఇమిగ్రేషన్‌ నిబంధనలు విధించిన ట్రంప్‌ సర్కారు శైలిపై కాంగ్రెస్‌ మిన్నకుండి పోయింది అందుకే!
మతతత్వాన్ని పెంచి, విద్వేషాలు రగిల్చి స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మౌలిక విధానం. కాశ్మీర్‌ పరిణామాలు, పౌరసత్వ చట్ట సవరణ, రామాలయ వివాదం వంటి అన్ని అంశాల లోనూ బిజెపి మతతత్వ ఎజండాను వ్యతిరేకించకుండా మెతకగా వ్యవహరించడంగాని, రామాలయ శంకుస్థాపన సందర్భంలో తమ పార్టీ పాత్రనూ గుర్తించాలంటూ చేసిన ప్రకటనలు కాని కాంగ్రెస్‌ అనుసరిస్తున్న అవకాశవాద వైఖరికే అద్దం పడుతున్నాయి. గడచిన ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌ గాంధీ గుళ్లు గోపురాలు తిరగడం ద్వారా తానూ హిందుత్వ వాదినేనని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంగానే విశ్లేషకులు భావించారు. సుప్రీం కోర్టు తీర్పును ఉపయోగించుకొని శబరిమల విషయంలో వివాదం సృష్టించి, దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా మార్చాలని కుట్ర పన్నిన కాషాయ కూటమికి కాంగ్రెస్‌ కూడా తోడైన వైనం అతి జుగుప్సాకరమైనది. మత ఛాందసత్వ వైఖరిని చేపట్టడాన్ని ఆ పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. బిజెపి అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, మతతత్వ పోకడలను ఎదురొడ్డి నిలుస్తున్నది, శక్తి మేరకు నిలవరిస్తున్నదీ వామపక్షాలే. ఆ పార్టీల నాయకత్వం లోని కేరళ ప్రభుత్వం అటు కరోనా, ఇటు తుపాను బీభత్సాలను ఎదుర్కొంటూ ప్రజలకు సేవలందిస్తున్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం దాని దివాలాకోరుతనానికి నిదర్శనం.
గాంధీ-నెహ్రూ వారసత్వం మాదని చెప్పుకోవడమేగాని ఆ వారసత్వపు సారం ప్రస్తుత నాయకత్వంలో మచ్చుకైనా కనిపించడంలేదు. ఒక జాతీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా తాను మతతత్వ-కార్పొరేటు అనుకూల బిజెపికి ప్రత్యామ్నాయంగా ఉండగలుగుతానని ప్రజలలో ఏ మేరకైనా నమ్మకం కలిగించాలంటే, గాంధీ-నెహ్రూల పేర్లు చెప్పుకుని బతకడం కాదు. ఆనాటి సామ్రాజ్యవాద వ్యతిరేకతను, అలీన విధాన స్ఫూర్తిని, ప్రణాళికా విధానం ద్వారా దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిన తీరును, లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామిక విలువలను ఇప్పుడు కూడా కొనసాగించాలి. ఆచరణ ద్వారా ప్రజలకు విశ్వాసం కలిగించాలి. కాంగ్రెస్‌ సమావేశం అటువంటి విశ్వాసాన్ని ఆవగింజంతైనా కలిగించలేకపోయింది.