Feb 02,2022 03:30

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ వై.సాంబశివరావు, సిపిఐ(ఎంఎల్‌) జాస్తికిషోర్‌బాబు, ఎం సిపిఐ కాటం నాగభూషణం, సిపిఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ బి.బంగార్‌రావు, ఎస్‌యుసిఐ(సి) బిఎస్‌ అమర్‌నాథ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పివి సుందరరామరాజు, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జానకి రాములు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యి చూపిందని, ప్రత్యేకహోదా, ఇతర విభజన హామీల ప్రస్తావన పూర్తిగా వదిలేశారన్నారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ఏ ప్రాజెక్టులు ఇవ్వలేదన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, పోలవరం నిర్వాసితుల సమస్యలకు కేంద్రం గాలికొదిలేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన నిధులు గురించి మాట్లాడకుండా, నదుల అనుసంధానం గురించి ప్రకటించడం అప్రస్తుతమే కాక అనుచితం కూడా అనే అభిప్రాయాన్ని వామపక్షనేతలు వ్యక్తం చేశారు. కేంద్ర, విద్యా, వైద్యసంస్థల గురించి , మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ప్రసంగంలో ఏమీ చెప్పలేదన్నారు. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్‌లో రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యానికి, వివక్షతకు గురైెందన్నారు. ప్రజాసంక్షేమానిు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టేదిగా ఉందన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తిరస్కరించాలని వామపక్షపార్టీలు పిలుపునిచ్చాయి.