డెబ్బై మూడేళ్ల స్వాతంత్య్రం తర్వాత కరోనా కరాళ నృత్యం, దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ఊడుతున్న ఉద్యోగాలు ఆందోళన కలిగిస్తున్న స్థితి. వీటన్నిటినీ వదిలిపెట్టి నరేంద్ర మోడీ ప్రధానిగా రికార్డు కాలం పూర్తి చేసుకున్నారనే ప్రచారం మోగించడం వ్యూహాత్మక వ్యవహారమే. వాజ్‌పేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2268 రోజులు పాలిస్తే మోడీ పాలనకు 2073 రోజులు అయ్యాయట. నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత ఆయనే అత్యధిక రోజులు పూర్తి చేశారట. కాస్త అటూ ఇటూ మరో నాలుగేళ్ల పదవీ కాలం ఆయనకు వుంది. అలాంటప్పుడు ఈ రోజుల ముచ్చట ఎందుకొచ్చింది? ఈ రెండు దఫాలు పూర్తి చేసినా మన్మోహన్‌తో పాలనా కాలంతో సమానమవుతారు. 'మౌన ముని' అనిపించుకున్న ఆయనే రెండు దఫాలు పాలిస్తే ప్రచార కళలో ఆరితేరిన మోడీ రెండవ సారి రావడం అసాధారణమేమీ కాదు. గతంలో వచ్చిన ప్రతిపక్ష ప్రభుత్వాలన్నిటినీ కాంగ్రెస్‌తో కలసి కూలదోసింది బిజెపి నే. అలాంటి పార్టీ తాను మాత్రమే సుస్థిర ప్రభుత్వం ఇవ్వగలనని అందులోనూ మోడీ తిరుగులేని శక్తి అని చెప్పబూనడం చరిత్రను పాక్షికంగా చూపడమే.
నాయకులు ఎవరైనా వారి స్వంత శక్తి సామర్థ్యాలతో పాటు పరిస్థితుల ప్రభావం కూడా కలిసి వస్తేనే చరిత్రలో స్థానం పొందుతారు. రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో ప్రధాని అయినా, వనప్రస్థానానికి సిద్ధమైన పి.వి.నరసింహారావు పదవి చేపట్టి పార్టీలను చీల్చి పూర్తి కాలం పాలించినా, గుజరాత్ మరకలు మరుగునపడి నరేంద్ర మోడీ శక్తివంతుడైన నాయకుడుగా ప్రజల ముందుంచబడినా అన్నీ అప్పటి రాజకీయ వాస్తవాల ఫలితమే. ప్రాంతీయ పార్టీల అనైక్యత, కాంగ్రెస్ క్షీణత, కార్పొరేట్ ఇండియా ఏకోన్ముఖ మద్దతు, మీడియా మేనేజిమెంటు...అన్నీ ఏకమై మోడీని త్రీడీలో చూపడం బాగా కలిసి వచ్చిన అంశం. బిజెపి రెండు సార్లు ఓడిపోయిన తర్వాత సైద్ధాంతిక మార్గదర్శిగా వుండే ఆర్‌ఎస్‌ఎస్ సంఘ పరివార్ కూడా హిందూత్వకు మోడీత్వను కప్పి నమో నినాదంతో ఆయనను ఎత్తుకుంది. ఈ రెండు శక్తుల భుజాల పైనే మోడీ దేశాధినేత కాగలిగారన్నది కాదనలేని నిజం. అందుకే తొలి రోజు నుంచి కార్పొరేట్ సామ్రాజ్యాలనూ కాషాయ కూటమి ఎజెండాను మోయడమే పనిగా పెట్టుకున్నారు. దానికి తోడు అమెరికా జూనియర్ భాగస్వామ్యాన్ని ఇంకా ఇంకా పెంచుతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ దాన్ని నిలవరించలేని స్థితిలో, ప్రాంతీయ పాలక పార్టీలు అవకాశవాదంతో మోకరిల్లుతున్న నేపథ్యంలో మోడీ మోత చూడవలసి వుంటుంది. విధానాల పరంగానూ, సమర్థత కోణం లోనూ చూస్తే పరిస్థితి అధ్వాన్నంగానూ అప్రజాస్వామికంగా తయారైంది గనకే దాన్ని కప్పిపుచ్చడానికి రికార్డుల ముచ్చట మొదలెట్టారు. కొంచెం వెనక్కు వెళితే గత నెలలో 78 శాతం ప్రజాదరణతో మోడీ సాటి లేని ప్రధానిగా వున్నాడని సర్వేలు చెప్పాయి. అదే సర్వేలో కరోనా కట్టడిలో విఫలమైనారని 25 శాతం మంది, వలస జీవులపై 23 శాతం మంది, ఆర్థిక సంక్షోభంపై 17 శాతం, ధరల పెరుగుదలపై 11 శాతం అసంతృప్తి వెలిబుచ్చారు. ఎ.పి ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వేలో మూడో స్థానం పొందినా కరోనా కట్టడిపై అత్యధికులు అసంతృప్తి వెలిబుచ్చారని ఒక పత్రిక కథనం ఇచ్చింది. మోడీ సర్కారుపై స్పందనలకూ అది వర్తిస్తుంది. మిగిలిన వారి హయాంలో తప్పొప్పులు, ప్రజా వ్యతిరేక విధానాలు ఒక తరహా అయితే మోడీ ప్రత్యేకించి నోట్ల రద్దు, కాశ్మీర్ 370 రద్దు, ప్రభుత్వ సంస్థల సామూహిక అమ్మకం, సకల రంగాల లోకి విదేశీ ప్రవేశం వంటి నిర్ణయాలు అంతకు ముందు కన్నా ఏకపక్షంగా నిర్బంధంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రాల అధికారాలు, హక్కులు, వనరులను కేంద్రం గుప్పిట్లోకి తీసుకుని అక్కడ కూడా క్యాబినెట్ తరహా లోనే పిఎంవో కేంద్రిత విధానం అమలు చేస్తున్నారు. కార్పొరేట్ ఎజెండా అమలుకు వ్యక్తి కేంద్రిత విధానం తప్పనిసరి. దేశీయంగానేగాక అంతర్జాతీయంగానూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అతి విధేయంగా మెలిగే మోడీ మాటలలో చెప్పే ఆత్మ నిర్భరతను కాస్త పూర్తి పరాధీనతగా మార్చేయడం కళ్ల ముందు జరుగుతున్నది. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటివన్నీ శుష్క నినాదాలుగా మారి గతంలో వలే పని చేయడం మానేశాయి. తాజాగా కరోనా కట్టడిలో ఆయన మొదట అనుసరించిన ప్రచార ప్రహసనాలు చప్పట్లు కొట్టడం, దీపాలు పెట్టడం, వంటివి హాస్యాస్పదంగా విఫలమైపోయాయి. మృతుల సంఖ్య 48 వేలు దాటింది. ఇంకా పెరగడమే గాని తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. జిడిపి పెరుగుదల రేటు మైనస్ 4 నుంచి 7 శాతానికి పడిపోయింది. ఏ ఒక్క అంశం లోనూ ఆశాజనకమైన పరిస్థితులు గోచరించడం లేదు. ఇలాంటి తరుణంలో మోడీ వ్యక్తిగత ఇమేజ్‌ను కాపాడటం, మరింత పెంచడం పాలక పక్షానికి వ్యూహాత్మక అవసరంగా తయారైంది. ఎన్నికల తరుణంలో వలె రోజుకో ఆన్‌లైన్ ఆర్భాటం సాగుతున్నది.
ప్రపంచ వ్యాపితంగా మితవాద మతవాద శక్తుల దాడి పెరుగుతున్న పూర్వ రంగం లోనే మోడీ సర్కారు విన్యాసాలను చూడవలసి వుంటుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నిటిపై వత్తిడి పెంచిన ఈ ప్రభుత్వం పాలనా పరంగానే గాక సైద్ధాంతికంగానూ అదే భావజాలాన్ని రుద్దడం నిత్యకృత్యమైంది. ఆగష్టు నెల ప్రశస్తి గురించిన వ్యాసంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాతంత్య్ర పోరాటం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే గాక గజనీ మహ్మద్‌తో ప్రారంభమైన గత దురాక్రమణలకు కూడా వ్యతిరేకమని ప్రవచించారు. బ్రిటిష్ వారి పెత్తనం కన్నా తురుష్కుల దండయాత్రలే పెద్ద సవాలని ఇప్పటికీ చెప్పే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఇందులో స్పష్టం. అత్యంత అనుభవజ్ఞుడైన ఉప రాష్ట్రపతి స్వాతంత్య్ర పోరాటం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాత్రమే జరిగింది కాదని, మొఘలులు తదితరులను కూడా వ్యతిరేకించిందని చెప్పడానికి ఏమైనా ఆధారాలు చూపగలరా? వెంకయ్య అదే వ్యాసంలో అయోధ్య రామాలయ శంకుస్థాపనను కూడా ఆగష్టు విశిష్టతలో కలిపి చెప్పారు. ఎర్రకోట పైనుంచి జెండా ఎగరేసిన ప్రధాని మోడీ కూడా దాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ 370 అధికరణం రద్దు చేసి ఏడాది గడిచిన తేదీని రామాలయ శంకుస్థాపన కోసం ఎంచుకున్న ప్రధాని ఈ ఏడాదిలో అక్కడ గొప్ప అభివృద్ధి జరిగిపోతున్నట్టు చెప్పారు. వాస్తవంలో కాశ్మీర్‌లో సమాచార సంబంధాలపై ఆంక్షలు విధించి, హక్కులు హరించి నిర్బంధం కొనసాగించడంపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతున్నది. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కాశ్మీర్‌లో చాలాకాలం ముందే మొదలైంది. అయినా సరే ఎర్రకోట సాక్షిగా అది ఘనకార్యం సాధించినట్టే మోడీ చెబుతున్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన మోడీనే 'మేడ్ ఇన్ ఇండియా' నినాదాన్ని 'మేకిన్ ఇండియా'గా మార్చారని, మళ్లీ ఇప్పుడు దానికి కొత్త పూతలు పూస్తున్నారని అందరికీ తెలుసు. స్వావలంబన అన్న దీర్ఘకాలిక విధానాన్ని 'ఆత్మ నిర్భర్'గా మార్చిన మోడీ గనులు రక్షణ, అంతరిక్ష పరిశోధన...ప్రతి దాంట్లోకి విదేశీ కార్పొరేట్లను పిలిచి పీట వేసి వ్యతిరేకించిన బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను దేశ ద్రోహులనిపిస్తున్నారు. రాజ్యాంగ విలువలను. స్వాతంత్య్ర సమర వారసత్వాన్ని తలకిందులు చేసిన మోడీ నెహ్రూ తదితరులు తప్పులు చేశారని దాడి చేయడంతో ఆగక...తమ అగ్ర నాయకుడైన వాజ్‌పేయి కన్నా తానే అధికుడననే భావం ప్రచారంలో పెడుతున్నారు. అప్పటికంటే ఇప్పుడు మరింత బాహాటంగా పరివార్ ఎజెండా అమలు చేయడానికి సన్నాహమిది. సరిహద్దులలో ఉద్రిక్తతలపై ప్రచారాలను దీనికి జోడించి కృత్రిమ దేశభక్తి ఉద్వేగాన్ని రగిలిస్తున్నారు. అయోధ్య విషయంలో బిజెపి తో పోటీ పడి మరీ హిందూత్వ తరహా రాగాలాలపించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి 'మోడీ చైనా పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నార'ని సవాళ్లు విసురుతూ ఈ ఉద్వేగాలకు ఆజ్యం పోస్తున్నారు.
మోడీని తరచూ ఇందిరా గాంధీ తర్వాత శక్తివంతుడైన ప్రధాని అంటుంటారు. ఇందిరా గాంధీ మొదట్లో అలీన విధానం, బ్యాంకుల జాతీయీకరణ వంటి కొన్ని చర్యలతో మొదలై తర్వాత ఎమర్జన్సీ నిరంకుశత్వం వైపు పయనించారు. కాని మోడీ వచ్చిన నాటి నుంచి ఏకపక్ష పోకడలను పెంచడమే గాక భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిని ఒక విధానంగా మార్చుకున్నారు. ఆమె హయాంలో పెరిగిన ప్రభుత్వ సంస్థలనూ అలీన విధానాన్ని మాత్రం పూర్తిగా తోసిపుచ్చారు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను కూడా హరించి తనే సర్వం సహాధినేతగా చలామణి కావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎ.పి, తెలంగాణ లతో సహా చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ పోకడలను గట్టిగా నిలవరించకపోగా చాలా వరకూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వత్తాసునిస్తున్నాయి. రాష్ట్రాలలో చాలా సార్లు ఓటర్లు బిజెపిని తిరస్కరిస్తున్నా ఈ అవకాశవాదం కారణంగానే కేంద్ర పెత్తనం శృతి మించుతున్నది. పాత్రికేయులు, రచయితల పైన దాడులు జరుగుతున్నా బడా మీడియాలో పెద్ద భాగం మోడీకి ప్రచారం కల్పించి మోడియా గా మారిపోతున్నది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా వుండవలసింది, నిరంకుశ పోకడలను నిలవరించవలసింది దేశ ప్రజలే. మోడీ రికార్డుల భుజకీర్తుల పైపై ప్రచారాలన్నీ వారి కళ్లు గప్పడానికే. కొండంత వైఫల్యాలు, వైపరీత్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటే సర్వేలు, సందళ్లలో కొట్టుకు పోవడానికి భారతీయులు చైతన్య హీనులు కాదు.
- తెలకపల్లి రవి










