Jan 06,2022 06:59

ప్రముఖ కాలమిస్ట్‌, 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' భారత అధ్యక్షుడు ఆకార్‌పటేల్‌... ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధి జియా ఉస్సలామ్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లోని కొన్ని ముఖ్యాంశాలు.

నరేంద్ర మోడీ ఆర్‌.ఎస్‌.ఎస్‌ ను అంగీకారయోగ్యంగానే కాక గౌరవింపబడే సంస్థగా చేశారు. ఈ నేపథ్యంలో దేశం చెల్లించిన మూల్యం ఏమిటి?
ఏది సాధిస్తే ఆర్‌.ఎస్‌.ఎస్‌ గౌరవప్రదంగా భావిస్తుందో, దానిని మోడీ చేస్తున్నారు. వాటిలో మొదటిది, ముస్లింలను రాజకీయంగా ప్రాధాన్యతలేని వారిగా పక్కకు నెట్టివేయడం. ఇది పార్టీ లక్ష్యమని 1965లో దీనదయాళ్‌ ఉపాధ్యాయ పూణేలో చేసిన ప్రసంగంలో చెప్పాడు. రెండోది, మైనారిటీలను భారతీయేతరులుగా పరిగణింపబడుతున్నారు కాబట్టి వారిని నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులకు ప్రభుత్వ ఆమోదం, ప్రోత్సాహం ఉంది కాబట్టి అవి కొనసాగుతాయి. ప్రపంచం కూడా భయపడిపోయే భారతదేశాన్ని అవి సృష్టించాయి. ఇక ఏ మాత్రం అభివృద్ధి చెందిన, నాగరికత గల దేశాల చెంతన చేరే ఆశలను భారత్‌ వదిలేసి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.

మోడీకి పెరిగిన ప్రాధాన్యత, 'లౌకికతత్వం' అనే పదాన్ని ఒక అసాధారణ స్థాయికి తగ్గించింది. లౌకిక పార్టీలు కూడా ఆ పదాన్ని ఉపయోగించడం లేదు. నేడు భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి ఇదేం చెపుతున్నది?
నేడు భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, మైనారిటీలు అత్యంత సహనశీలతతో బతుకుతున్నారు. దేశ రాజధాని ప్రాంతంలో ముస్లిం వలస కార్మికులు, వేధింపులు లేకుండా వారికి నిర్దేశించిన నమాజ్‌ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఆదివారం రోజున ప్రార్థనా స్థలాల్లో దేశ వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. దేశంలో ఒక మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేయడం, దానిని అనుసరించడం ప్రాథమిక హక్కు. ఒక వ్యక్తి యొక్క మత స్వేచ్ఛను సమర్థించడం కంటే .... మత ఆచరణను కట్టడి చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ సమర్థిస్తుంది. మైనారిటీ మతస్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాస్తవానికి ఉనికిలో లేకుండా పోయాయి. లౌకికతత్వం అనే పదాన్ని రాజకీయ పార్టీలు కూడా ఉచ్ఛరించడం లేదు. వారు ఆ పదం లోని నిజమైన అర్థాన్ని వదిలివేశారు.

2002 గోద్రా అల్లర్లలో, గుజరాతీ భాషా మీడియా పక్షపాత వైఖరిని ప్రదర్శించింది. భారతదేశాన్ని మించిన గుజరాత్‌ తరహాతో, జాతీయ మీడియా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందా?
గత దశాబ్ద కాలంగా భారతీయ మీడియా తులనాత్మక స్థితిని కోల్పోయింది. ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ద్వారా ఆమోదం పొందిన హిందూత్వ...భారతీయ మైనారిటీలపై... ముఖ్యంగా ముస్లింలపై దాడులకు తెరలేపింది. కుంచించుకు పోయిన ప్రచార మార్కెట్లో ఆడియో విజువల్‌ పబ్లిసిటీ డైరెక్టరేట్‌ వద్ద పెద్ద మొత్తంలో విడుదలైన నిధుల విషయంలో ప్రభుత్వ పని తీరును పరిశీలించడంలో మీడియా కొంతమేరకు అయిష్టత వ్యక్తం చేసిందని చెప్పవచ్చు.

మీ రచనలో మతాధిపత్యం గురించి మాట్లాడారు. 2021 లోని మోడీ భారతదేశం, 1986 లోని జియా ఉల్‌ హక్‌ పాకిస్థాన్‌ ను గుర్తు చేస్తుందా?
మైనారిటీలను, అణగారిన వర్గాలను లక్ష్యంగా దాడులు చేయడంలో రెంటి మధ్య కొన్ని పోలికలున్నాయి. జియా ఉల్‌ హక్‌ కు మోడీకి ఉన్నంత మతమౌఢ్యం లేదు. మోడీకి ఉన్నంత ప్రజాస్వామిక ఆమోదం జియా ఉల్‌ హక్‌ కు లేదు. అందుకనే, అత్యాచారంపై పాకిస్థాన్‌ చట్టాన్ని, ఎటువంటి వ్యతిరేకత లేకుండా ముస్లిం మత చట్టం నుండి న్యాయ వ్యవస్థకు తిప్పి పంపారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో వడ్డీని రద్దు చేసే ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. ఆధునిక పండితులు, న్యాయ కోవిదుల సలహా మేరకు రాళ్ళతో కొట్టడం, కాళ్ళూ చేతులూ నరికేయడం లాంటి (ఇస్లాం మత చట్టం ప్రకారం) శిక్షలు కూడా అమలుకు నోచుకోకుండా కాగితాలకే పరిమితమయ్యాయి.
మరోవైపు భారతదేశంలో, ముస్లిం వ్యతిరేక చట్టాలు మైనారిటీల వ్యక్తిగతమైన స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనలను నిలువరించేందుకు, బతుకుదెరువు కోసం పోరాడుతున్న ముస్లింలను వేధింపులకు గురి చేయడం, ముస్లింలను కొట్టి చంపే చర్యలు నిత్యకృత్యమని ఆమోదించే స్థితికి సమాజాన్ని ప్రోత్సహించారు. రాజకీయాల నుండి ముస్లింలను మొత్తంగా మినహాయించేందుకు కూడా ఇక్కడ ఆమోదం లభించింది. నేడు పాకిస్థాన్‌ కొన్ని విషయాల్లో లౌకిక తత్వం మార్గంలో పయనిస్తుంటే, భారతదేశం మాత్రం లౌకిక తత్వం మార్గం నుండి దూరంగా జరుగుతున్నది.

స్వతంత్ర భారతదేశంలో 2014 తరువాత జరిగిన హింసలో ఆవుకు సంబంధించిన హింస 97 శాతంగా ఉంది. దీనిపై మీ అభిప్రాయం?
గోవధ అనేది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో భాగం. ట్రాక్టర్ల వాడకం మొదలైన తరువాత కోడె దూడలతో ఉపయోగం లేదు. వాటిని ఉంచుకోవడం ఖర్చుతో కూడుకున్నది. ఇది వ్యవసాయం చేసే వారికి బాగా తెలుసు. గొడ్డు మాంసాన్ని కలిగి ఉండడాన్ని నేరంగా భావిస్తూ చట్టం చేసేందుకు ప్రధాని ప్రయత్నించి, 2015 తరువాత బిజెపి పాలిత రాష్ట్రాల్లో చట్టం చేసిన తర్వాత చట్ట వ్యతిరేకంగా మూక దాడులతో హత్యలు మొదలయ్యాయి.

2018 అనంతరం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ''లవ్‌ జీహాద్‌'' చట్టం చేసిన తర్వాత మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై కూడా ఇదే తరహాలో మూకదాడులు జరుగుతున్నాయి. ఇలాంటి చట్టాలను ప్రయోగించి భారతదేశంలో ప్రభుత్వాలు మైనారిటీలపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నాయి. గుజరాత్‌ రాష్ట్రంలో గోవధకు పాల్పడిన వ్యక్తులకు విధించే శిక్ష జీవిత ఖైదు. ముస్లింలను ప్రమాదకారులుగా చిత్రీకరించడానికి ఈ చట్టాలు ఉద్దేశించబడ్డాయి. అలా చేయడంలో వారు కృతకృత్యులయ్యారు.

మోడీ పాలనలో భారతదేశం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి?
ఒకటి, మోడీ పాలనలో, ఆర్థిక వ్యవస్థ భారీగా పేదరికాన్ని కొనసాగించే, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను సృష్టించే మార్గంలో ఉంది. ఇప్పడున్న విధంగా, కొద్దిమంది మాత్రమే మెజారిటీ వనరులు, సంపదను అదుపు చేస్తారు. రెండోది, నేడు హిందూత్వ అల్లరి మూకలు భారత దేశాన్నేలుతూ, భవిష్యత్తులో వారనుకున్నది జరగాలని కోరుకుంటున్నాయి.
( 'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో )