Jul 11,2021 06:25

    పని చేయని వారిని శిక్షించినట్టు, సమర్థతకు పట్టం కట్టినట్టు ఏదేదో చెబుతున్నా ప్రచారానికి మాత్రమే. మోడీ హయాంలో అధ్యక్ష తరహాలో ప్రధాని కార్యాలయం (పిఎంవో) సమస్తం శాసిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసు. కాని వైఫల్యాలను మరెవరిపైకో నెట్టి బ్రాండ్‌ మోడీని కాపాడాలి. మరో విధంగా చెప్పాలంటే బ్రాండ్‌ మోడీ బ్యాడ్‌ మోడీగా మిగలడానికి కారణమైన విధానాలను మార్చకుండా మరెవరో అసమర్థులనీ అందుకోలేక అప్రతిష్ట తెచ్చారని చెబితే చెల్లుతుందా? ఆ కపట నాటకంలో భాగమే ఇదంతా.
    రెండవసారి అధికారం లోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తన మంత్రివర్గాన్ని సమూల ప్రక్షాళన చేసిన ప్రధాని మోడీ చర్యలో స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. తన ప్రభుత్వమూ బిజెపి కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. దీన్ని విస్తరణ మార్పు అనేకంటే తిరగనేత అనడం మెరుగు. ఒకేసారి 12 మందిని బయిటకు పంపించడం, ఏడుగురు సహాయ మంత్రుల హోదా పెంచడం, 36 మందిని కొత్తగా తీసుకోవడం ద్వారా మొత్తం 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించడం గతంలో ఎన్నడూ జరగలేదు. దేశ రాజకీయాలలో కేంద్ర పాలనా చరిత్రలో ఇది పెద్ద మార్పు. అంతా అయిపోయిందనుకున్నాక ప్రకాశ్‌ జవదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌లు తప్పుకోవడం చాలామందిని దిగ్భ్రాంతపరచింది. ఇదంతా ఎన్నికల వ్యూహంతో చేశారని బిజెపి నేతలు పైకి గొప్పగా చెప్పుకోవచ్చు గాని పరిస్థితి బాగాలేదని మోడీ ఒప్పుకోవడంగా చూడక తప్పదు. ఒక ప్రధాని ఏకంగా ఇంతమందిని ఒకేసారి తప్పించవలసి రావడం నిస్సందేహంగా పెద్ద సవాలే. అంత పెద్ద ఆపరేషన్‌ అవసరమనే మోడీ భావించారు. కేరళలో పినరయి విజయన్‌ రెండవసారి గెలిచాక మొత్తం మంత్రివర్గాన్ని కొత్తగా తీసుకున్నారు. ఎ.పి లో జగన్‌ సగం పదవీ కాలం తర్వాత మంత్రివర్గాన్ని మొత్తం మార్చేస్తామని ముందే ప్రకటించారు. ఇప్పుడు మోడీ చేసింది కూడా అలాంటి ప్రయోగమే. కాస్త చిన్నవారిని తీసుకోవడం లోనూ విజయన్‌ కనిపిస్తాడు. తన మంత్రి వర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పూర్తిగా మార్చేస్తానని ప్రకటించిన ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ నమూనా ఛాయలు కూడా కనిపిస్తాయి. నలుగురు మాజీ ముఖ్యమంత్రులూ 23 మంది సీనియర్‌ ఎం.పి లు, 18 మంది మాజీ సహాయ మంత్రులు వచ్చినవారిలో వున్నారంటే అనుభవం కొరత ఒకవైపు, తనతో తలపడని వారిని ఎంపిక చేయాలనే సమతూకం మరోవైపు ప్రభావం చూపాయి. మహిళలు, మైనారిటీలు, ఎస్‌సి, ఎస్‌టి లకు కూడా విస్త్రుత ప్రాతినిధ్యం కల్పించారంటే ఇప్పటివరకూ అది లేదని సామాజిక సమీకరణలు సరైన సంకేతాలు ఇవ్వలేదని ఒప్పుకున్నారన్నమాట. మరి ఇంతకాలం బిజెపి చెప్పిన సోషల్‌ ఇంజనీరింగ్‌ ఎక్కడకు పోయింది? గతంలో అద్వానీ కమండల్‌ తీస్తే అప్పటి ప్రధాని వి.పి.సింగ్‌ మండల్‌ తీశాడని అనేవారు. ఇప్పుడూ రెండూ మావే అనడానికి వీలుగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి ల ప్రాతినిధ్యం పెంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వాస్తవంలో వారే గాక కార్పొరేట్‌ శక్తులూ మాజీ ఐఎఎస్‌ లూ పెద్ద ఎత్తున ప్రవేశించారు.
 

                                                        యు.పి సమస్తం, ఎ.పి కి రిక్తహస్తం

   తమకు 71 మంది ఎం.పి లను ఇచ్చిన యు.పి నుంచే అత్యధికంగా ఏడుగురికి ప్రాతినిధ్యం కల్పిస్తూ (మొత్తం 15) దక్షిణాదిని తమిళనాడులో ఒక్క మంత్రికే పరిమితం చేయడం, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి హోదా పెంచుతూ ఎ.పి ని చిన్న ఈశాన్య రాష్ట్ర గవర్నర్‌ పదవితో సరిపెట్టడం యాదృచ్ఛికం కాదు. ఈ రాష్ట్రాలలో ఇంకేమీ అవకాశాలు లేవని బిజెపి అధిష్టానం నెమ్మదిగా అంగీకరిస్తున్నదన్నమాట. పాలిచ్చే గేదెకే గడ్డి వేయాలన్నట్టు సీట్లు రాని రాష్ట్రాలకు కేంద్ర పదవులు కేటాయించదలుచుకోలేదు. తెలంగాణ నుంచి తమ తరపున నేరుగా ఎన్నికైన ఎం.పి లు వున్నా, ఎ.పి లో టిడిపి నుంచి వచ్చి కలిసిపోయిన వారు వున్నా స్థానం కల్పించలేదంటే అదే కారణం. ఇక్కడ హడావుడి చేసే నేతలకు ఈ ధోరణి ఆశాభంగమే. కోవిడ్‌-19ను ఎదుర్కోవడంలో వైఫల్యం ధరలు, నిరుద్యోగం అపారంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ పేద మధ్య తరగతి వ్యవహారాలన్నీ నడిపించే మూల విరాట్టులు మోడీ-షా లు మారకుండా ఉత్సవ విగ్రహాల వంటి ఇతరులను ఎందరిని మార్చితే ఎంత ప్రయోజనం?
 

                                                               మంత్రుల మార్పు తీరు

    ఆరోగ్యశాఖనే తీసుకుంటే చప్పట్లు పళ్లాల నుంచి వ్యాక్సిన్‌ విజిట్స్‌ వరకూ చేసింది మోడీ. హేమాహేమీలైన కేంద్ర మంత్రులందరూ ఆయనను పొగిడి తరించారు. తీరా ఇప్పుడు హర్షవర్థన్‌ అందుకు కారణమని తీసేస్తే ప్రధాని పాత్రేమిటి? ఇప్పుడు నియమితుడైన మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ఎరువులు రసాయనాల మంత్రిగా ఆ వైఫల్యంలో భాగస్వామి (ఆయనను ఆ శాఖలో కొనసాగిస్తూనే స్వతంత్ర బాధ్యత మరొకరికి అప్పగించారు). ఆయనకు ఈ రంగంలో ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినా జన ఔషధ ప్రచార ప్రహసనం నడిపి మెప్పించారు. ఇక వలస కార్మికుల వ్యథార్థ గాథలు దేశాన్ని కలచివేయడమే గాక ప్రభుత్వ అసమర్థతను, అలక్ష్యాన్ని వెల్లడించాయి గనక కార్మిక శాఖామంత్రి సంతోష్‌ గాంగ్‌వర్‌ను తీసేశారు. విద్యామంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ అసంబద్ద మార్పులతో అంతా తలకిందులు చేశారు గనక తప్పించడం అనివార్య అవసరం. ఆ స్థానంలో తెచ్చిందెవరినంటే విశాఖ ఉక్కు విక్రయానికి ఆధ్వర్యం వహించే ధర్మేంద్ర ప్రధాన్‌ను! ఐ.టి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సోషల్‌ మీడియా సంస్థల సమస్యను సరిగ్గా వ్యవహరించలేదని అమెరికాకు ఆగ్రహం కలిగింది. ఇక ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తట్టుకుని సానుకూల ఇమేజి కల్పించడంలో విఫలమైనారు గనక అనురాగ్‌ ఠాకూర్‌ను నియమించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మత విద్వేషం రగిలించినందుకు గాను ఎన్నికల ప్రచారం నుంచి బహిష్కరించబడిన ఈ ప్రబుద్ధుడు ఎలాంటి సమాచార ప్రచారం చేస్తారో చెప్పాలా? ఇక రైల్వేశాఖకు వస్తే మోడీ మొదటి నుంచి దాన్ని తనకు బాగా నచ్చినవారికి అప్పగిస్తూ ఏదో తలకిందులు చేయాలని చూస్తున్నారు. మొదటి దఫాలో సదానంద గౌడ రైల్వేశాఖ చూస్తే తర్వాత శివసేన నుంచి సురేష్‌ ప్రభును ప్రత్యేకంగా తీసుకొచ్చి అప్పగించారు. తర్వాత కొంత కాలానికి ఆయననూ తప్పించి పీయూష్‌ గోయల్‌ ఉద్ధరిస్తాడన్నారు. ఇప్పుడు ఆయనకూ ఉద్వాసన చెప్పి అమెరికాలో చదువుకుని వచ్చిన కాన్పూర్‌ ఐఐటియన్‌ అశ్వనీ వైష్ణవ్‌ను కూచోబెట్టారు. ఆర్థిక రంగం క్షీణతకు అధిక భారాలకు కారణమైన నిర్మలా సీతారామన్‌ మాత్రం ఒ.కె నే!
 

                                                               చిన్న పార్టీలూ కలిస్తేనే...

    ఇవన్నీ ఎన్ని చేసినా వచ్చే ఎన్నికలలో ఎదురీత తప్పదనే చిన్న చిన్న మిత్రపక్షాలను కూడా కలుపుకొంటేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలమని ఒప్పుకోవలసి వచ్చింది. అప్నా దళ్‌ నుంచి జెడియు వరకూ అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఇదే కనిపిస్తుంది. మొదటి మంత్రివర్గంలో అప్నా దళ్‌ నాయకురాలు అనుప్రియా పాటిల్‌ మోడీ మొదటి మంత్రివర్గంలో వుండగా తర్వాత తొలగించేశారు. ఇప్పుడు ముందే మాట్లాడి మరీ చేర్చుకున్నారు. రెండవసారి కేంద్రంలో చోటు కల్పించని జెడియు కు ఇప్పుడు ఒక్క స్థానమిచ్చారు గాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అంతగా ఇష్టం లేని ఆర్‌.సి.పి సింగ్‌ను ఎంపిక చేశారు. నితీష్‌ ఆయనను అభినందించకపోగా రెండు స్థానాలు ఇవ్వనందుకు కినుక వహించారట. ఇక బిజెపి పనుపున ఎల్‌జెపి ని చీల్చిన పశుపతిని కేంద్రంలో తీసుకోవడం కూడా నితీశ్‌కు నచ్చేది కాదు. సోషల్‌ ఇంజనీరింగ్‌ అంటూనే యు.పి లోని నిషద్‌ పార్టీని నిర్లక్ష్యం చేశారు.
 

                                                              బ్రాండ్‌ మోడీకి బలిహారం

    మోడీ మొదటిసారి ప్రధాని అయ్యేనాటికే అద్వానీ వంటివారు పక్కకు నెట్టివేయబడ్డారు. అప్పటికి వున్న అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, అనంతకుమార్‌ వంటి వారు చనిపోయారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, మరో ఇద్దరు మాత్రమే పాతవారున్నారు. అయితే ఏం జరిగేది తనకు అసలు తెలియదని రాజ్‌నాథ్‌ మంత్రివర్గ మార్పులకు ముందు రోజే చెప్పేశారు. బిజెపి లోనూ ఇప్పుడు మోడీ షాల ద్వయందే రాజ్యం. పని చేయని వారిని శిక్షించినట్టు సమర్థతకు పట్టం కట్టినట్టు ఏదేదో చెబుతున్నా ప్రచారానికి మాత్రమే. మోడీ హయాంలో అధ్యక్ష తరహాలో ప్రధాని కార్యాలయం (పిఎంవో) సమస్తం శాసిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసు. కాని వైఫల్యాలను మరెవరిపైకో నెట్టి బ్రాండ్‌ మోడీని కాపాడాలి. మరో విధంగా చెప్పాలంటే బ్రాండ్‌ మోడీ బ్యాడ్‌ మోడీగా మిగలడానికి కారణమైన విధానాలను మార్చకుండా మరెవరో అసమర్థులనీ అందుకోలేక అప్రతిష్ట తెచ్చారని చెబితే చెల్లుతుందా? ఆ కపట నాటకంలో భాగమే ఇదంతా. 2022, 2023లలో జరిగే రాష్ట్రాల ఎన్నికలు అంతిమంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అవకాశాలకు గ్రహణం పట్టిందనే అంచనా ఆరెస్సెస్‌తో సహా సంఘ పరివార్‌కు కలవరం కలిగిస్తున్నది. కనుకనే వారు మోడీకి సర్వాధికారాలు ఇచ్చేశారు. నిర్ణయాలన్నీ ఆయన చేసినా తొలగించినవారికి తీసుకునేవారికి కూడా తెలియజేసే బాధ్యత బిజెపి నాయకులకు అప్పగించారు. ఆఖరి నిముషంలో పార్టీ అధ్యక్షుడు జె.డి నడ్డా తొలగించేవారికి ఫోన్‌ చేస్తే ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌ సంతోష్‌ కొత్తగా తీసుకునేవారికి చేశారట. అంటే ప్రధాని గాని అమిత్‌ షా గాని వారికి అందుబాటులో వుండే ప్రసక్తి లేదన్నమాట. అయితే 2022లో యు.పి, పంజాబ్‌, గుజరాత్‌ ఎన్నికలలో బిజెపి అవకాశాలు ఈ మార్పులతో పెరుగుతాయా అంటే గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు విఫలమైతే మళ్లీ పెను మార్పులు చేయబోరని చెప్పలేము. మంత్రులు మారారు గాని మోడీ మంత్రం మారలేదని ఒక వ్యంగ్య వ్యాఖ్యాత అన్నట్టుగా ఇదంతా మోడీ చుట్టూనే తిరగడం అందరికీ తెలిసిన సత్యం. మాజీ ఐఎఎస్‌ లు పెద్దగా పట్టు లేని చోటా నాయకులైతే ఆ ప్రదిక్షణ మరింత బాగా చేస్తారు గనకనే మోడీ కొత్త మొహాలనూ 11 మంది మాజీ అధికారులనూ కార్పొరేట్‌ కరోడాలను తీసుకున్నారు. రాజ్యాంగ పరంగా మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం వుంటే ఇప్పటికే 77 మందినీ తీసేసుకున్నారు. 'కనీస ప్రభుత్వం గరిష్ట పాలన' అనే నినాదం ఇప్పుడు తలకిందులైంది. మాగ్జిమం గవర్నమెంట్‌ మినిమం గవర్నెన్స్‌ వచ్చేసినట్టే కనిపిస్తుంది. పార్లమెంటు సమావేశం కాబోతుండగా ఇంత పెద్ద కసరత్తు చేసి వారిని సభ లోకి వదిలితే అర్థవంతమైన చర్చలు, సమాధానాలు, సమాచార సమర్పణ ఆశించడం ఎలా?
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి