న్యూఢిల్లీ : మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఘటనలు విన్నాం. అయితే పెంపుడు జంతువులు కుక్క, పిల్లి ఇతరత్రా కోవిడ్‌కు అత్యధికంగా ప్రభావితమౌతున్నాయని యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజస్‌కు చెందిన బృందం పరిశోధనలో వెల్లడైంది. కోవిడ్ బారిన పడిన యజమానులు నుండి వీటికి సోకుతుంది. పెంపుడు జంతువులు కలిగి, రెండు నుండి 200 రోజుల లోపు కోవిడ్ సోకిన 196 మంది యజమానుల ఇళ్లను నెదర్లాండ్స్‌కు చెందిన ఉట్రెక్ ్ట విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం సందర్శించింది. వారి ఇళ్లలోని 156 కుక్కలు, 154 పిల్లుల రక్తనమూనాలను, గొంతు నుండి స్వాబ్‌ను సేకరించి.. వాటికి పరీక్షలు నిర్వహించింది. అందులో ఆరు పిల్లులు, ఏడు కుక్కలకు పిసిఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అలాగే 31 పిల్లులు, 23 కుక్కల రక్తంలో యాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత మరో 11 జంతువులకు రెండోసారి టెస్టులు చేసినప్పుడు వాటిలోనూ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. మూడోసారి టెస్టు చేసినప్పుడు మరో మూడు పిల్లుల్లోనూ యాండీబాడీలు ఉత్పన్నమైనట్లు కనిపించాయి. ఈ లెక్కన ఇవన్నీ కోవిడ్ సోకి, నయమైనట్లు నిర్ధారణైంది. సాధారణంగా యజమానుల నుండి జంతువులకు సోకుతుందన్న మాట. జంతువుకు, జంతువుకు, ఇతర వాటికి వైరస్ సోకుతున్నట్లు ఆనవాళ్లులేవు.










