ఫహద్ షా.. జమ్మూ కాశ్మీర్ వాసి. 'కాశ్మీరీ వాలా' వెబ్‌సైట్ నిర్వాహకుడు, ఎడిటర్. ఉన్నట్టుండి పుల్వామా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాను రాసిన వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్నది కారణం. కేరళ వన్.. ఇదో మళయాళం న్యూస్ ఛానల్. దీన్ని నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో కేసులు పడ్డాయి. వాద ప్రతివాదాలు జరిగాయి. చివరకు నిషేధం రైటే అని కోర్టు కూడా అభిప్రాయపడింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా వార్తలు ఉంటున్నాయన్నది సాకు. ఈ రెండు సంఘటనలు 24 గంటల వ్యవధిలోనే జరిగాయి. సరిగ్గా ఇదే సమయానికి మీడియా వర్గాలకు తలలో నాలుకలా వ్యవహరించాల్సిన-ప్రెస్ ఇన్ఫర్‌మేషన్ బ్యూరో (పి.ఐ.బి)-మరో బాంబు పేల్చింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించని లేదా జాతీయ భద్రతకు చేటు తెచ్చే వారి జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులను అర్థంతరంగానైనా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఆదేశాలూ ఇచ్చింది. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ మీడియాకు సంబంధించి ప్రభుత్వం విధిస్తున్న సంకెలలివి. తనకు నచ్చని, తాము మెచ్చని మీడియాపై-అది సామాజిక మాధ్యమమైనా, ప్రధాన స్రవంతి మీడియా అయినా సరే- ప్రభుత్వ అదుపాజ్ఞలు, ఆంక్షలు, అరెస్టులు అమలు చేస్తూ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. దాసోహం అనకపోతే పీక నొక్కేస్తున్నాయి. 2021 సంవత్సరానికి ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసింది.
భారతీయ మీడియా స్వేచ్ఛ మట్టి బండేనని తేల్చింది. హక్కులు, ప్రమాదాల విశ్లేషణ గ్రూపు (రాగ్) ఇండియా సహా మొత్తం 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛపై ఆరా తీస్తే అందులో భారత్ 142వ స్థానంలో నిలిచింది. సమాజంలో పెచ్చుపెరిగిపోతున్న కలుపు మొక్కల్ని ఏకిపారేసేందుకు ఉద్దేశించిన జర్నలిజాన్నీ, జర్నలిస్టుల్నీ ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న పాలకపక్షాలు పీకిపారేస్తున్నాయి. ఇండియా జర్నలిస్టులు అనుక్షణం అభద్రతతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏవైపు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపడానికి సాహసించడం లేదు. అధికార వర్గాలను విమర్శించేందుకు వెనకాడుతున్నారు (పాలక వర్గాలకు కావాల్సింది ఇదే). 2021లో అధికారిక లెక్కల ప్రకారం ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు (అనధికార లెక్కలైతే దీనికి మరో 18 కలపాలి). మరో 113 మంది జర్నలిస్టులు, 13 మీడియా సంస్థలు పాలక వర్గాల హిట్ లిస్టులో ఉన్నాయి. వీళ్లను ఎప్పుడైనా అరెస్ట్ లేదా విచారణ పేరిట అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో ఎక్కువమంది జమ్మూ కాశ్మీర్, ఉత్తరాది రాష్ట్రాల వారు కాగా కొద్ది మంది దక్షిణాది ప్రాంతానికి చెందిన వారు. జాతీయ భద్రతా కారణాల సాకుతో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రెస్ క్లబ్ సహా పలు మీడియా హౌస్‌లపై దాడులు జరిగాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే పేరిట కొందరు జర్నలిస్టులపై నిరంతర నిఘా కొనసాగుతోంది. అసాంఘిక శక్తులకు ఆసరా అని, అర్బన్ నక్సలైట్లని ఇంకొందరిపై మూడో నేత్రం తెరుచుకుంటోంది. వీళ్లను ఆ సమయం, సందర్భాన్ని బట్టి విచారణకు పిలవొచ్చు. అరెస్ట్ చేయవచ్చు. మరికొందరిపై బైండోవర్ కేసులు పెట్టి ప్రతి రోజూ పోలీసు ఠాణాకు వచ్చి సంతకం చేసి పొమ్మంటున్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించారని ఇప్పటికే 25 మందిపై ఎఫ్‌ఐఆర్ లు నమోదైయ్యాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా సంస్థలపై పోలీసు నిఘా ఉందని రాగ్ తన నివేదికలో పేర్కొనడం జర్నలిస్టు వర్గాలలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.
మహిళా జర్నలిస్టులపైన సైతం...
భారత్‌లో మహిళా జర్నలిస్టులు ఉన్నదే తక్కువ. అందులో స్వతంత్ర జర్నలిస్టులు మరీ స్వల్పం. అటువంటి స్థితిలో ఏకంగా 8 మంది మహిళా జర్నలిస్టులపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. వీళ్లను ఇంతటితో విడిచి పెట్టకుండా వాళ్లను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ట్రోలింగ్ చేయడం, వారి వేషభాషల పైనా, శరీరాకృతుల పైనా వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళా జర్నలిస్టులను కించపరిచిన వారిని వదిలివేసి తిరిగి ఆ జర్నలిస్టుల పైనే కేసులు పెట్టడం దొంగే దొంగన్నట్టుగా ఉంది.
గిట్టకపోతే ఆదాయపన్ను శాఖ దాడులే...
గొంతెత్తిన మీడియా పీక నొక్కేయడం పాలక పక్షాలకు కొత్తేమీ కాదు. నాడు ఇందిరా గాంధీ మొదలు నేటి మోడీ వరకు.. ఇదే తంతు. అయిన వారికి ఆకుల్లో కానివారికి మూకుళ్లలో.. కాంగ్రెస్ అయినా బిజెపి అయినా తమకు నచ్చని వారి పీచమణచాల్సిందే. ప్రశ్నించే వారిపైనో, ఆయా మీడియా సంస్థలపైనో ఆదాయ పన్ను శాఖో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటో (ఇ.డి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ).. మరొకటో.. మరొకటో ఏదో ఒక ప్రభుత్వ సంస్థ దాడులు చేస్తుంది. ఏదైనా సంస్థ ఎదురు తిరిగితే దాన్ని మూతవేయిస్తుంది. జాతీయ భద్రతకు విఘాతం అని ముద్ర వేస్తుంది. ప్రభుత్వానికి లంగిపోయిన సంస్థలు బాగుంటాయి. ఎదురుతిరిగిన సంస్థలైతే యజమానులతో పాటు ఉద్యోగులూ బజారుపాలు కావాల్సి వస్తుంది. సర్వసాధారణంగా జరిగే తంతు ఇదే. ఏతావాతా నష్టపోయేది మాత్రం జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులే. ఇక అసలు విషయానికి వస్తే.. గత రెండేళ్లలో మీడియా సంస్థలపై దాడులు బాగా పెరిగాయి. 2021లో న్యూస్ క్లిక్, దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్, న్యూస్ లాండ్రీ వంటి పెద్ద సంస్థలతో పాటు 34 చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలపై ఐ.టి, ఇ.డి దాడులు చేశాయి. పెద్దఎత్తున సోదాలు నిర్వహించాయి. అధికారిక దాడులిలా ఉంటే అనధికార దాడులకు లెక్కే లేదు. మాఫియా ముఠాలు, రాజకీయ వర్గాలు, రౌడీ మూకలు చేసే దాడులకైతే లెక్కే లేదు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియాకు పేరుంది. మొదటి మూడు వ్యవస్థలు ఇప్పటికే కుళ్లిపోయాయంటున్నారు. మిగిలిన నాలుగో స్తంభాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకపక్షాలు ఇప్పుడు కుళ్లబడుస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి కావలి కుక్కగా (వాచ్ డాగ్) పరిగణించే మీడియా కూడా మూగబోతే ఇక గొంతులేని వారికి గొంతుకగా నిలిచేదెవరు..? జర్నలిజంపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామిక వాదులు నిలదీయకపోతే రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(ఎ)కి అర్థమేముంటుందీ..? అందుకే జర్నలిస్టులు, పౌరసమాజం గొంతెత్తి నినదించాల్సిన, సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఆకుల అమరయ్య
/ వ్యాసకర్త సెల్: 9347921291 /










