శీతాకాల ప్రవేశంతో ఉత్తరార్ధగోళంపై కరోనా మళ్లీ కోరలు చాచింది. ప్రపంచ వ్యాపితంగా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఇంతవరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో పదకొండున్నర లక్షల మంది చనిపోయారు. అందునా అమెరికాలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకోగా ఆ తరువాతి స్థానాల్లో భారత్, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్, ఇటలీ, జర్మనీ, బెల్జియం వరుసగా నిలిచాయి. మున్ముందు మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికాలో గత వారాంతంలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 81,417 కేసులు నమోదయ్యాయి. ఇది లక్షకు కూడా చేరుకోవచ్చని అంతర్జాతీయ అంటు వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండడం ట్రంప్‌ను కలవరపరిచే అంశమే. ఈ దెబ్బతో ట్రంప్ ఇంటి ముఖం పట్టడం ఖాయమని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం బుకాయింపులు, అబద్ధాలతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యత్నించిన అధ్యక్షుడు, ఇప్పుడు ఏం చెప్పినా అమెరికన్లు నమ్మే స్థితి లేదు. ట్రంప్ అంతులేని నిర్లక్ష్యం వల్లే 2,30,000 మంది చనిపోయారు. ఇది ముమ్మాటికీ మితవాద రిపబ్లికన్ ప్రభుత్వ వైఫల్యమే. ట్రంప్ ఏమాత్రం ప్రయత్నించినా 1,30,000 మరణాలను నివారించగలిగేవారమని ప్రముఖ అంటువ్యాధి నిపుణులు విలియం హాసిల్టీన్ అభిప్రాయపడ్డారు. కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశం ట్రంప్‌నకు ఏ కోశాన లేదు. ఇప్పటికీ ఆయన తన వైఫల్యాన్ని అంగీకరించకుండా, మీడియాపై ఎదురు దాడి చేస్తున్నారు. అణుబాంబులు, రాకెట్ల తయారీలో ముందుండే అమెరికా కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ఒక్క వ్యాక్సిన్‌ను కూడా ఎందుకు తయారు చేయలేకపోతోంది? ప్రజల ఉపాధిని, ఉద్యోగాలను ఎందుకు నిలబెట్టలేకపోతోంది? వీటికి ట్రంప్ ఏం సమాధానం చెప్తారు? కార్పొరేట్ లాభాలే ఆయనకు ముఖ్యం. ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. మితవాద శక్తులు అధికారంలో ఉన్న చోటల్లా జరుగుతున్నది ఇదే. బ్రెజిల్‌లో బోల్సనారో కావచ్చు, భారత్‌లో మోడీ కావచ్చు, ఆస్ట్రేలియాలో మోరిసన్ కావచ్చు. వీరి దృష్టి అంతా కరోనాతో తలెత్తిన పరిస్థితిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చడం ఎలా అన్నదాని గురించే. ఇంకోవైపు దీనికి భిన్నమైన పరిస్థితి చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, లావోస్ వంటి సోషలిస్టు దేశాల్లోను, అలాగే వామపక్ష అనుకూల ప్రభుత్వాలు ఉన్న పోర్చుగల్, వెనిజులా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐస్‌లాండ్ వంటి దేశాల్లో నెలకొంది. ప్రజారోగ్యానికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి.
సోషలిజానికి కాలం చెల్లిందని, కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని శాపనార్థాలు పెట్టినవారు సైతం కరోనా బారి నుంచి ప్రజలను కాపాడడంలో సోషలిస్టు ప్రభుత్వాల కృషిని ప్రశంసించక తప్పని స్థితి వచ్చింది. మన దేశంలో వలస కార్మికులను ఆదుకోవడంలోను, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు దన్నుగా నిలవడంలో కమ్యూనిస్టులు ముందున్నారు. సోషలిస్టు, వామపక్ష అనుకూల ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిస్తాయి. కోవిడ్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడంలోనూ, మందుల ఉత్పత్తిని సామాజికంగా చేపట్టడంలోను, వాటిని బడుగు దేశాలకు అందుబాటులో ఉంచడంలోను తమ విశిష్టతను చాటుకుంటున్నాయి. సోషలిజం, సెక్యులరిజం అన్న పదాలను భారత రాజ్యాంగం నుంచి తొలగించేందుకు విఫలయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైంది. ఐస్‌లాండ్, న్యూజిలాండ్ వంటి ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో ప్రజారోగ్యానికి జిడిపిలో 11 శాతం దాకా వెచ్చిస్తుంటే భారత్ ఒక్క శాతం మాత్రమే కేటాయిస్తున్నది. కరోనా కేసుల్లో త్వరలోనే భారత్ అమెరికాను కూడా దాటి పోయే పరిస్థితి వస్తుందని నిపుణులు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకు ఎదురు చూడమంటున్నది. ఆ వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఇతమిత్థంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. దాని పేరు చెప్పుకుని కరోనా వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాలు చేయకుండా మోడీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటోంది. మరి ప్రజలు కరోనాతో చావాల్సిందేనా ?










