- ఇందిరాగాంధీ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి
ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మహాయజ్ఞం ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్, ఎపి సిఎం వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి రాక సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లను ఇతర శాఖల అధికారులు, డిసిపి విశాల్‌గున్నితో కలిసి నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మంగళవారం పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ , ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ట్రయిల్ రన్‌ను నిర్వహించి అధికారులకు , సిబ్బందికి సిపి తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా భద్రతా పరంగా ఆయా శాఖలతో సమన్వయం చేసుకొని స్టేడియం, దాని పరిసర ప్రాంతాలలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అన్ని శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. లా ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ , అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమమును విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారయణ, సబ్ కలెక్టర్ ఆదితిసింగ్, పోలీసుల అధికారులు పాల్గొన్నారు.










