మహాధర్నా జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-అనంతసాగరం : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెప్టెంబరు 25న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మహాధర్నాకు సంబంధించి నోటీసును అనంతసాగరం ప్రాజెక్టు సిడిపిఒకు వినతిపత్రం అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు నాగమణి, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. అంగన్‌వాడీల సమస్యలపై సెప్టెంబరు 25న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు తగ్గకుండా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్‌మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. మినీ వర్కర్స్ అందరినీ తక్షణమే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, లబ్ధిదారులకు, పిల్లలకు నాణ్యమైన సరుకులు సరిపోయేంతగా ఇవ్వాలని, ఖచ్చితమైన కొలతలతో ప్రతినెలా 5వ తేదీ లోపు సెంటర్లకు సరుకులు అందజేయాలని కోరారు. ఈ సమస్యలపై జరిగే మహాధర్నా కార్యక్రమంలో ప్రతి అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. మహాధర్నా సందర్భంగా 25వ తేదీ అనంతసాగరం ప్రాజెక్టులో ఉండే ఏ అంగన్‌వాడీ సెంటర్ కూడా తెరవమని సిడిపిఒకు వినతిపత్రం ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో అనంతసాగరం ప్రాజెక్టు నాయకులు సునీత, లక్ష్మి, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.










