ప్రజాశక్తి-కంచికచర్ల: క్రీడలు యువతలో మానశిక ఉల్లాసానికి దోహదపడతాయని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. జై భీమ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులలో మానసిక వికాసం కలుగుతుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహ భావం పెంపొందుతుందని, అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. అదేవిధంగా వేసవిలో తీవ్రమైన ఎండలు నమోదవుతున్న కారణంగా క్రీడాకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










